వీధి కుక్కలకు ‘లాక్‌డౌన్’ కష్టాలు
ABN , First Publish Date - 2020-05-13T07:41:08+05:30 IST
కరోనా కష్టాలు మనుషులనే కాదు.. మూగజీవాలనూ వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్‌తో నగరంలోని వీధికుక్కలు ఆహారం

300 ప్రాంతాలు.. 3 వేల ఆహార ప్యాకెట్లు
వీధి కుక్కల ఆకలి తీరుస్తున్న సైబరాబాద్ పోలీసులు
ప్రత్యేక నీటి తొట్ల ఏర్పాటు
హైదరాబాద్ సిటీ, మే 12(ఆంధ్రజ్యోతి): కరోనా కష్టాలు మనుషులనే కాదు.. మూగజీవాలనూ వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్‌తో నగరంలోని వీధికుక్కలు ఆహారం లేక అవస్థలు పడుతున్నాయి. మనుషులు ఒక్కపూట భోజనం చేయకుంటేనే నీరసం వస్తుంది. అలాంటిది రోజుల తరబడి ఆహారం లేకుండా అలమటించే వీధి కుక్కల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాలేకడుపుతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కుక్కలు ఇళ్లలోకి చొరబడడం, రోడ్డు వెంట వెళ్తున్న వారిని చూసి మొరగడం, కరవడం, వెంబడించడం చేస్తున్నాయి.
దీన్ని గమనించిన కొంతమంది జంతు ప్రేమికులు వీధి కుక్కల ఆకలి తీర్చాలని, వాటికి ఆహారంతో పాటు నీటి కొరతలేకుండా చూడాలని ముందుకొచ్చారు. కరోనా కష్టాల్లో భాగంగా అన్నం కోసం అల్లాడుతున్న వారికి అండగా ఉండి ఆకలి తీరుస్తున్న సైబరాబాద్ పోలీసులను కలిశారు. వీఽధి కుక్కల ఆకలి తీర్చడానికి కూడా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) అంగీకరించింది. కొవిడ్-19 కంట్రోల్ రూమ్, ఎస్సీఎస్సీ వలంటీర్లకు జంతు ప్రేమికులు సహకరిస్తున్నారు.
రోజుకు 3 వేల ప్యాకెట్లు...
వీధి కుక్కల ఆకలి తీర్చడానికి ఎస్సీఎస్సీ ఒప్పుకోవడంతో... పీపుల్స్ ఫర్ యానిమల్ (పీఎ్‌ఫఏ), హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (హెచ్‌ఎ్‌సఐ), యానిమల్ వారియర్ కన్జర్వేషన్ సొసైటీ(ఏడబ్ల్యూసీఎస్) వంటి జంతు సంరక్షణ సంస్థలు రంగంలోకి దిగాయి. సైబరాబాద్ పోలీసులతో కలిసి కమిషనరేట్ పరిధిలో వీధి కుక్కలు అధికంగా ఉన్న 300 ప్రాంతాలను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎన్ని కుక్కలు ఉన్నాయి. ఎంత ఆహారం అవసరం అవుతోందని అంచనా వేసి కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు.
దాంతో సైబరాబాద్ పోలీస్, ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో రోజుకు 3 వేల ఆహారం ప్యాకెట్లు వీధికుక్కలకు అందిస్తున్నారు. అంతేకాకుండా నీటి తొట్లను కొనుగోలు చేసి, 300 ప్రాంతాల్లో వాటిని సగం వరకు భూమిలోకి పాతేసి నీటితో నింపుతున్నారు. ఆ తొట్లలోని నీళ్లతో వీధి కుక్కలు దాహం తీర్చుకోవడంతో పాటు.. పక్షులు, కాకులు, ఇతర మూగజీవాలు కూడా నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నాయి. నీటితొట్లను పాతేసిన చోట పోలీసులు ప్రత్యేక పోస్టర్లను అతికిస్తున్నారు. ఆ తొట్టి మూగజీవాల దాహం తీర్చడానికి ఏర్పాటు చేసినవి. ఎవరూ వాటిని తొలగించకూడదని హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు. ఏదేమైనా మాయదారి కరోనాతో ఆహారం కోసం అష్టకష్టాలు పడుతున్న మనుషులతో పాటు వీఽధికుక్కల ఆకలిని తీరుస్తున్న సైబరాబాద్ పోలీసులను స్థానిక ప్రజలు ప్రశంసిస్తున్నారు.