వెబినార్...మహిళలకు భరోసా !
ABN , First Publish Date - 2020-04-26T10:59:41+05:30 IST
కరోనా కష్టాలు మహిళలను వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఎంతోమంది మహిళలు ఇళ్లలో

గృహహింసకు చెక్‌పెట్టేందుకు..
సైబరాబాద్ సీపీ కొత్త ఆలోచన
లింక్‌ను ప్రారంభించిన సజ్జనార్
ఆన్‌లైన్‌లో ప్యానల్ డిస్కషన్..
ఒకేసారి 200 మంది బాధిత మహిళలతో మాట్లాడే అవకాశం
అందుబాటులో పోలీసులు, కౌన్సెలింగ్ నిపుణులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : కరోనా కష్టాలు మహిళలను వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఎంతోమంది మహిళలు ఇళ్లలో గృహహింసకు గురవుతున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఐటీ మహిళా ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
కొంతమంది భర్తలు మహిళల వద్ద నుంచి స్మార్ట్‌ఫోన్లు సైతం లాక్కున్నారని పోలీసుల విచారణలో తేలింది. దాంతో బాధితులైన మహిళలు ఇంటి నుంచి బయటకురాలేక, తమ గోడును పోలీసులకు చెప్పుకునే అవశాశం లేక విలవిల్లాడిపోతున్నారు. లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 659 ఫిర్యాదులు అందాయంటే ఇళ్లలో ఆడవాళ్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వెబినార్‌కు శ్రీకారం చుట్టిన సీపీ..
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మహిళల భద్రతకు సీపీ సజ్జనార్ పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాక్‌డౌన్ కాలంలో గృహహింసకు గురవుతున్న మహిళలతో షీటీమ్, ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు ఆన్‌లైన్‌లో మాట్లాడడానికి, వారికి అవసరమైన సపోర్టు అందించడానికి అందుబాటులో ఉండే విధంగా వెబినార్ అనే సరికొత్త కార్యక్రమానికి సీపీ సజ్జనార్ శ్రీకారం చుట్టారు. అందులో ప్యానల్ డిస్కషన్ మెంబర్స్‌గా సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉమెన్స్ ఫోరం సభ్యులు, ఐటీ కంపెనీల్లోని మార్గదర్శక్‌లు, భరోసా కేంద్రం కౌన్సెలర్‌లు, షీటీమ్ పోలీసులు, డీసీపీ అనసూయ, అవసరమైతే సీపీ సజ్జనార్ ప్యానల్ డిస్కషన్‌లో మహిళలకు అందుబాటులో ఉంటారు.
పోలీసులకు ఫిర్యాదు చేసే మహిళలకు పోలీసులు వెబినార్ లింక్‌ను, ఫోన్ నంబర్‌ను పంపిస్తారు. దాన్ని ఓపెన్ చేస్తే ప్యానల్ సభ్యులు మాట్లాడేది బాధిత మహిళలకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇలా ఒకేసారి 200లకు పైగా మహిళలు ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొనవచ్చు. ప్యానల్ సభ్యులకు, కనెక్ట్ అయిన బాధితులకు ఽమధ్యలో ఒక సమన్వయకర్త ఉంటారు. డిస్కషన్‌లో భాగంగా ప్యానల్ సభ్యులతో మాట్లాడాలనుకునే మహిళలు ఒక బజర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అది ఏ ఫోన్ నంబర్ నుంచి ప్రెస్ అయ్యిందో ఆ మహిళ ప్యానల్ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. ఇలా వెబినార్ కొనసాగుతుంది.
ఈ విధంగా పోలీసులు, కౌన్సెలింగ్ నిపుణులు వెబినార్ ద్వారా మహిళల్లో ధైర్యం నింపడం, సమస్యలు పరిష్కరించడం, వేధింపులకు పాల్పడిన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయడం, వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, ఆ తర్వాత కూడా వేధింపులు ఉంటే నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం చేస్తారు.