సైబర్‌ వార్‌..సైట్‌ యాక్సెస్‌ తొలగింపు

ABN , First Publish Date - 2020-10-12T09:51:33+05:30 IST

ఆన్‌లైన్‌ వస్తు క్రయ విక్రయ సైట్‌లను అడ్డాగా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు దేశవ్యాప్తంగా వేలాది మందిని

సైబర్‌ వార్‌..సైట్‌ యాక్సెస్‌ తొలగింపు

ఆన్‌లైన్‌లో వస్తు క్రయ, విక్రయ సైట్లపై నిఘా

గూగుల్‌ సహకారంతో మోసాల కట్టడి

నేరాల కట్టడికి పోలీసుల వ్యూహాలు

 ఎక్కడికక్కడ ఆట కట్టించేందుకు సరికొత్త సన్నాహాలు

 మరోవైపు అవగాహనా కార్యక్రమాలు 


సరికొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతూ సవాల్‌  విసురుతున్న సైబర్‌ నేరగాళ్లతో యుద్ధానికి పోలీసులు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఒక వైపు.. రకరకాల సైబర్‌  మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే..  మరోవైపు  నేరాలకు పాల్పడుతున్న విధానాలను పసిగట్టి వాటిని నివారించడంపై దృష్టి సారించారు. 


ఆన్‌లైన్‌లో వస్తు క్రయ విక్రయ సైట్‌ (ఓఎల్‌ఎక్స్‌ వంటి) లో జరుగుతున్న మోసాలపై సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గూగుల్‌ సహకారంతో నేరగాళ్ల భరతం పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  ఇప్పటికే గూగుల్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌ అధికారులతో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సమావేశమయ్యారు. 


హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ వస్తు క్రయ విక్రయ సైట్‌లను అడ్డాగా చేసుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేస్తున్నారు. కార్లు, బైక్‌లు, సోఫాల ఫొటోలతో ఖరీదైన  వస్తువులను తక్కువ ధరకు అమ్మకానికి పెడుతూ నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఆర్మీ అధికారులుగా నకిలీ ఐడీకార్డులు, ఆర్‌సీలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. వాహనాలను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే పరిస్థితి లేక విక్రయిస్తున్నట్లు నమ్మిస్తున్నారు. వాక్చాతుర్యంతో వినియోగదారులను ఆకట్టుకుని ముంచేస్తున్నారు. దేశవ్యాప్తంగా వేలాదిమందిని మోసం చేస్తూ నెలకు రూ. కోట్లు సంపాదిస్తున్నారు. 


మోసాల కట్టడికి..

రోజు రోజుకు ఆన్‌లైన్‌ వస్తు క్రయ విక్రయ సైట్లలో పెరుగుతున్న మోసాలను అరికట్టడానికి సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సిద్ధమయ్యారు. గూగుల్‌ ఇండియా కంపెనీ ప్రతినిధుల సహకారంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన, నమోదవుతున్న ఫిర్యాదులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎక్కువ మోసాలు ఏ ప్రాంతం నుంచి జరిగాయి. నేరగాళ్లు వస్తువుల ఫొటోలను ఏ ఐపీ అడ్ర్‌స నుంచి అప్‌లోడ్‌ చేశారు. అనే అంశాలను విశ్లేషిస్తున్నారు. ఆ ఐపీ అడ్ర్‌సల ఆధారంగా గూగుల్‌ టెక్నికల్‌ టీమ్‌ వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తుంది. కొద్దిరోజుల పాటు వారిని సైబర్‌ క్రైం పోలీసులు అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. రోజుకు ఎన్ని వస్తువుల క్రయ విక్రయ ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఎలాంటి ప్రకటనలు ఇస్తున్నారు.. అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తున్న వ్యక్తి సైబర్‌ మోసగాడా..? కాదా.. అనేది నిర్ధారించుకుంటారు.


దేశంలో ఏయే ప్రాంతాల నుంచి సైబర్‌ మోసాలు జరుగుతున్నాయనేది గుర్తిస్తారు. ఆ తర్వాత గూగుల్‌ సహకారంతో ఆయా ప్రాంతాల్లో ఆ సైట్‌ ఓపెన్‌ కాకుండా చేసి, ఆయా ఐపీ అడ్ర్‌సల్లో యాక్సెస్‌ లేకుండా చూస్తారు. దాంతో సైబర్‌ నేరగాళ్లకు సైట్‌లలో ఫొటోలు, పోస్టులు అప్‌లోడ్‌ చేసే అవకాశం ఉండదు.  అలా పోలీసులు, గూగుల్‌ ప్రతినిధులు సంయ్తుంగా సైబర్‌ నేరగాళ్లకు చెక్‌ పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే దాదాపు అన్ని రకాల సైబర్‌ నేరాలకు గూగుల్‌ సహకారంతో చెక్‌ పెట్టాలని పోలీసులు భావిస్తున్నారు.


కొనుగోలు దారులుగా కూడా..

ఆయా సైట్‌లలో అమ్మకానికి పెట్టిన వస్తువులను కొనేందుకు కూడా సైబర్‌ నేరగాళ్లు ముందుకు వస్తారు. వస్తువు తర్వాత తీసుకుంటానని, ముందుగా డబ్బులు చెల్లిస్తానంటూ మోసపూరితమైన ఒక క్యూఆర్‌ కోడ్‌ను పంపిస్తారు. విక్రయదారుడు ఆ కోడ్‌ను స్కాన్‌ చేసి అమౌంట్‌  రిక్వెస్ట్‌ పంపగానే అతని ఖాతాలోని డబ్బు ఖాళీ అవుతంది. ఇలా అమ్మకందారులను సైతం దోచేయడం వారి ప్రత్యేకత. దేశవ్యాప్తంగా ఇలాంటి మోసాలు అధికంగా చేస్తోంది భరత్‌పూర్‌ సైబర్‌ ముఠా. ఇటీవలే ఆ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2020-10-12T09:51:33+05:30 IST