తండ్రికి సాయం చేసిన వ్యక్తి ఇంట్లోనే చోరీ

ABN , First Publish Date - 2020-12-10T06:55:39+05:30 IST

తండ్రికి సాయం చేసే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరిని మంగళ్‌హాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తండ్రికి సాయం చేసిన వ్యక్తి ఇంట్లోనే చోరీ
నిందితులతోపాటు స్వాధీనం చేసుకున్న సొత్తును చూపుతున్న పోలీసులు

ఇద్దరి అరెస్టు 

రూ. 3.3 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనంహైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): తండ్రికి సాయం చేసే వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరిని మంగళ్‌హాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజస్థాన్‌లోని పాలి జిల్లా జేతారాం గ్రామానికి చెందిన మనోహర్‌ కుమావత్‌ (23) ప్రైవేటు ఉద్యోగి. ఇతడి కుటుంబం కొన్ని ఏళ్ల క్రితం రాజస్థాన్‌ నుంచి నగరానికి వల స వచ్చింది. ఇతడి తండ్రి బిక్కారాం కుమావత్‌ వ్యాపారం చేసేవాడు. ఇతడికి ఆగాపురాలో సురేష్‌ భాటి అనే స్నేహితుడు ఉన్నాడు. బిక్కారాం వ్యాపార అవసరాల కోసం అప్పుడప్పుడు సురేష్‌ నుంచి అప్పు తీసుకునేవాడు, తిరిగి చెల్లించేవాడు. డబ్బు తీసుకోవడానికి, తిరిగి చెల్లించడానికి బిక్కారాం కొడుకు మనోహర్‌ సురేష్‌ ఇంటికి తరచూ వెళ్లేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారం ఆగిపోవడంతో బిక్కారాం కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పులు పెరిగిపోయాయి. ప్రైవేటు ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో అప్పులు చెల్లించడం కష్టమని భావించిన మనోహర్‌ తన స్నేహితుడు బేగంబజార్‌ ప్రాంతానికి చెందిన విజయ్‌కుమార్‌ కుమావత్‌తో కలిసి చోరీ పథకం రచించాడు. తనకు బాగా పరిచయమున్న సురేష్‌ భాటి ఇంట్లో నగలు, నగదు చోరీ చేయాలని భావించాడు. అందులో భాగంగా న్యూ ఆగాపురాలోని సురేష్‌ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించాడు. సురేష్‌ భార్యా పిల్లలను బంధువుల ఇంట్లో వదిలి షాపునకు వెళ్లిన సమయంలో చోరీకి పాల్పడ్డారు. కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా విరగొట్ట్టి 4.25 తులాల బంగారు నగలు, రూ. 1.20 లక్షల నగదు చోరీ చేసి, పరారయ్యారు. రాత్రి 10 గంటలకు ఇంటికి చేరిన సురేష్‌ భాటి ఇది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చోరీ జరిగిన రోజు ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా సంచరించిన వీరిద్దరిపై దృష్టి పెట్టారు. పురానాపూల్‌ ప్రాంతంలో సంచరిస్తున్న వీరిద్దరిని అరెస్ట్‌ చేశారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో వారిద్దరి నుంచి 4.25 తులాల బంగారంతోపాటు రూ.1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగలను అమ్మేలోపు నిందితులను అరెస్ట్‌ చేసిన అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.సైదాబాబు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.


Updated Date - 2020-12-10T06:55:39+05:30 IST