డబ్బు కోసం ఆశపడి వృద్ధుడితో బాలిక పెళ్లి.. తండ్రి ఫిర్యాదుతో..
ABN , First Publish Date - 2020-12-30T06:26:42+05:30 IST
బాలిక జనన ధ్రువీకరణ పత్రాలు మార్చి వృద్ధుడితో వివాహం జరిపించిన ఖాజీని, సహకరించిన బ్రోకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): బాలిక జనన ధ్రువీకరణ పత్రాలు మార్చి వృద్ధుడితో వివాహం జరిపించిన ఖాజీని, సహకరించిన బ్రోకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక(16) తల్లి కొన్నేళ్ల క్రితం చనిపోయింది. తండ్రి రెండో వివాహం చేసుకోవడంతో తల్లి సోదరి బాలికను తీసుకెళ్లి పెంచుకుంటోంది. బండ్లగూడకు చెందిన ముగ్గురు బ్రోకర్లు బాలిక చిన్నమ్మను సంప్రదించి కేరళకు చెందిన ఓ వృద్ధుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అతడికి బాలికను ఇచ్చి పెళ్లి చేస్తే రూ. 2.50 లక్షలు ఇస్తారని చెప్పారు. డబ్బుకు ఆశపడిన చిన్నమ్మ, ఆమె భర్త కలిసి బాలికకు ఈనెల 27వ తేదీన నిఖా జరిపించారు. వివాహం చేయడానికి మలక్‌పేటకు చెందిన బాదీయుద్దీన్ అనే ఖాజీ ఆధార్‌కార్డులో వయస్సు తక్కువగా ఉండడంతో వేరే ఆధార్ కార్డు వివరాలు జోడించి వృద్ధుడితో బాలిక వివాహం జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఫలక్‌నుమా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖాజీని, సహకరించిన బ్రోకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకున్న వృద్ధుడు, ఇద్దరు బ్రోకర్లు పరారీలో ఉన్నారు.