వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి బలవన్మరణం

ABN , First Publish Date - 2020-12-30T06:22:36+05:30 IST

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి బలవన్మరణం
లక్ష్మీప్రసన్న (ఫైల్‌)

మియాపూర్‌, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఓల్డ్‌హఫీజ్‌పేట సాయినగర్‌కు చెందిన షేక్‌గౌస్‌ కుమారుడు షేక్‌ ఇబ్రహీం(20) స్థానికంగా ఓ ఫ్లైవుడ్‌ స్ర్కాప్‌ షాపులో పనిచేస్తున్నాడు. ఈనెల 28వ తేదీ రాత్రి విధులు పూర్తయిన తర్వాత ఇబ్రహీం ఇంటికి వెళ్లలేదు. షాపులోనే నిద్రపోయి ఉండొచ్చని కుటుంబ సభ్యులు భావించారు. మరుసటి రోజు ఉదయం షేక్‌గౌస్‌ కుమారుడికి ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు. దీంతో చిన్న కుమారుడు షేక్‌ ఇంతియాజ్‌ను షాపు వద్దకు పంపించాడు. షాపు డోర్‌ తెరవడానికి ప్రయత్నించగా తెరుచుకోకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఇబ్రహీం ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. 

అదనపు కట్నం వేధింపులు భరించలేక..

జీడిమెట్ల, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ కృష్ణలంక ప్రాంతంలోని గౌతంనగర్‌కు చెందిన పి. నాగరాజు కుమార్తె లక్ష్మీప్రసన్న(27)కు రాజమండ్రి దవళేశ్వరానికి చెదిన సాధనాల కార్తీక్‌(29)తో 2019లో వివాహం చేశారు. పెళ్లి సమయంలో రూ. 5 లక్షలు, 8 కాసుల బంగారం, 200 గజాల ప్లాట్‌ కట్నంగా ఇచ్చారు. వీరు జగద్గిరిగుట్ట తులసివనం ప్రాంతంలోని నవోదయ కాలనీలో నివసిస్తున్నారు. ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్న కార్తీక్‌ కొద్దిరోజులు భార్యను బాగానే చూసుకున్నాడు. కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అదనపు కట్నం తీసుకురావాలని కుటుంబ సభ్యులతో కలిసి భార్యను వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక లక్ష్మీప్రసన్న ఈనెల 28వ తేదీన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జగద్గిరిగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-30T06:22:36+05:30 IST