పని చేస్తున్న చోటే చోరీలు

ABN , First Publish Date - 2020-12-15T06:30:08+05:30 IST

కూకట్‌పల్లి ప్రాంతంలో

పని చేస్తున్న చోటే చోరీలు

కళామందిర్‌లో రూ.10 లక్షలు అపహరణ

సెక్యూరిటీ గార్డుపై ఫిర్యాదు

మరో సంస్థలో 1.20 లక్షలు, వాహనంతో డ్రైవర్‌ పరార్‌

పని చేస్తున్న ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళ అరెస్ట్‌


సంస్థలో ఉద్యోగులుగా ఉంటూ ఆ సంస్థకు చెందిన సొమ్ముతో ఉడాయించారు వారు. సెక్యూరిటీగా ఉంటాడని తాళం చెవులు ఇస్తే.. నకిలీ తాళం చేయించి లాకర్‌లోని రూ.10 లక్షలు దోచేశాడు సెక్యూరిటీ గార్డు. మరో సంస్థకు చెందిన డ్రైవర్‌ ఒక బ్రాంచిలో వసూలు చేసిన సొమ్మును ప్రధాన కార్యాలయంలో చెల్లించాల్సింది పోయి.. డబ్బు, వాహనంతో సహా ఉండాయించాడు. ఇంకో ఘటనలో యజమాని ఇంట్లో లేని సమయంలో చోరీకి పాల్పడ్డ మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 


కళామందిర్‌లో చోరీ.. 

కూకట్‌పల్లి, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి) : కూకట్‌పల్లి ప్రాంతంలో దొంగలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వేర్వేరు సంఘటనల్లో వస్త్రదుకాణంతో పాటు ఓ ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయారు. కూకట్‌పల్లి సీఐ నర్సింగ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.... స్థానిక భాగ్యనగర్‌కాలనీలోని కళామందిర్‌ వస్త్రదుకాణంలో ఒరిస్సాకు చెందిన మోనీదాస్‌ సెక్యూరిటీగార్డుగా పని చేస్తున్నాడు. షోరూం నిర్వాహకులు రోజూ షట్టర్‌ తాళాలతో పాటు లాకర్‌కు సంబంధించిన తాళాలను ఒక బంచ్‌గా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ గార్డుకు ఇచ్చి వెళ్తుంటారు. ఇదే అదునుగా షోరూంలోని నగదు ఎత్తుకెళ్లిపోవాలని మోనీదాస్‌ పథకం పన్నాడు. కొద్దిరోజుల ముందే లాకర్‌కు చెందిన అసలైన తాళం చెవికి బదులు నకిలీది తయారు చేయించాడు. ఒరిజినల్‌ తాళం తన వద్ద పెట్టుకొని... నకిలీది షోరూంకు చెందిన తాళాల బంచ్‌లో పెట్టాడు. ఇది గమనించని షోరూం నిర్వాహకులు రోజూ తాళాలను మోనీదాస్‌కు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి విధుల్లో ఉన్న మోనీదాస్‌ షోరూం లోపలికి వెళ్లి... లాకర్‌లోని సుమారు రూ.10లక్షల నగదును ఎత్తుకెళ్లిపోయాడు. ఆదివారం రాత్రి షోరూం నిర్వాహకులు నగదును పరిశీలించగా... కనిపించలేదు. మోనీదాస్‌ విధులకు రాకపోవడంతో అతడిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు శంషీగూడలోని నిందితుడి ఇంటికి వెళ్లగా... అతను భార్య, పిల్లలతో సహా ఊరు విడిచి వెళ్లి పోయినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని పట్టుకొనేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 


ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ...

కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని సాయిరాం ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌ నాల్గో అంతస్తులో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఇంటి యజమాని సురేష్‌ లాక్‌డౌన్‌ సమయంలో రామగుండం వెళ్లి.. అక్కడ ఆన్‌లైన్‌ క్లాసులు నడిపిస్తున్నారు. నెలకోసారి ఇంటికి వచ్చి పరిశీలించుకొని వెళ్లేవారు. సోమవారం ఉదయం ఇంటి తాళాలు పగిలిపోయి ఉండడం గమనించిన వాచ్‌మన్‌.. సురేష్‌కు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బంగారం ఎంత చోరీ అయిందన్న విషయంపై స్పష్టత రాలేదని, ఇంటి యజమాని వచ్చి చెక్‌ చేసుకొంటే తప్ప తెలియదని సీఐ నర్సింగ్‌రావు తెలిపారు. 


వసూలైన సొమ్ముతో...

నార్సింగ్‌, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తున్న ఓ డ్రైవర్‌ 1.20 లక్షల నగదు, వాహనంతో పరారైన సంఘటన నార్సింగ్‌లో జరిగింది. నార్సింగ్‌ పోలీసుల కథనం ప్రకారం... కోకాపేట్‌ విజేత సూపర్‌ మార్కెట్‌లో మంగలి వెంకటేశ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను శనివారం బ్రాంచ్‌లో వసూలైన లక్షా 20 వేల రూపాయలను తీసుకొని మియాపూర్‌లోని హెడ్‌ ఆఫీస్‌లో కట్టేందుకు బొలేరా వాహనంలో వెళ్లాడు. అతను అక్కడ డబ్బులు చెల్లించ లేదు. సంస్థకు కూడా రాలేదు. ఈ విషయం గుర్తించిన యాజమాన్యం నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


తిన్నింటికే కన్నం.. అరెస్ట్‌ 

రాజేంద్రనగర్‌, డిసెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి) : పని చేస్తున్న ఇంట్లోనే చోరీకి పాల్పడి 15 తులాల బంగారం, రూ.95 వేలను దొంగిలించిన ఓ మహిళతో పాటు ఆమె కుమారుడు(మైనర్‌ బాలుడు)ను రాజేంద్రనగర్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్‌కు మహ్మద్‌ గౌసుద్దీన్‌ ఈ నెల 12 మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటి నుంచి మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. రాత్రి అక్కడే బస చేశాడు. 13వ తేదీన ఉదయం 10 గంటలకు గౌసుద్దీన్‌ ఇంటి వెనకాల తలుపులు తెరిచి ఉండటం చూసి పక్కింట్లో ఉండే అబ్దుల్‌ ఫోన్‌ చేసి చెప్పాడు. గౌసుద్దీన్‌ వెంటనే ఇంటికి వచ్చి చూడగా బెడ్‌రూమ్‌ లాక్‌, బీరువా లాక్‌ తెరిచి ఉన్నాయి. బీరువాలోని 15 తులాల బంగారం, రూ. 95 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన రాజేంద్రనగర్‌ డీఐ రాజు ఆ ఇంటి పనిమనిషిని ప్రశ్నించగా తానే దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. ఈ దొంగతనంలో ఆమె కుమారుడు(మైనర్‌)కూడా పాల్గొన్నట్లు దర్యాప్తులో తేలింది. 


దురాశ పుట్టి చోరీ...

ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఆ మహిళ గౌసుద్దీన్‌ ఇంట్లో పని మనిషిగా, వాచ్‌మన్‌గా పని చేస్తోంది. గౌసుద్దీన్‌ ఇంట్లోని సెల్లార్‌లోని ఓ గదిలో 15 సంవత్సరాల కుమారుడితో కలిసి ఉంటోంది. ఈ నెల 12న యజమాని కుటుంబంతో సహా బయటకు వెళ్లడం చూసి వెనుక డోర్‌ తాళాలను విరగొట్టి బీరువాలో దాచిన బంగారంతో పాటు నగదును దొంగించింది. తిరిగి ఏమీ తెలియనట్లుగా అక్కడే ఉంది. అనుమానంతో పోలీసులు విచారించగా.. దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. ఆమె నుంచి 15 తులాల బంగారంతో పాటు రూ. 47 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-12-15T06:30:08+05:30 IST