కరోనా కట్టడికి క్రెడాయ్ కేర్స్ కార్యక్రమం
ABN , First Publish Date - 2020-03-23T09:33:28+05:30 IST
కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని క్రెడాయ్ తెలంగాణ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్ సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని క్రెడాయ్ తెలంగాణ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలకు అవగాహన మెరుగు పర్చేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై సభ్యులు, అసోసియేషన్లు, కార్యాలయాలకు మార్గదర్శకాలు జారీచేశారు. నిర్మాణ రంగంలో కీలకంగా ఉన్న క్రెడాయ్ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించామని క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ జి.రామిరెడ్డి తెలిపారు. ప్రపంచ విపత్తు కాలంలో ఓ పరిశ్రమగా మేమం తా కలిసికట్టుగా ఉండటంతోపాటు ఈ వైర్‌సతో యుద్ధం చేయబోతున్నామని, వినియోగదారులు, వెండార్లు, సిబ్బంది, ముఖ్యంగా సైట్ వర్కర్లు తరఫున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒకవేళ ‘మీరు లేదంటే మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా మహమ్మారి లక్షణాలు కనబడితే దయచేసి స్వీయ క్వారంటైన్ చేసుకోవాలి’అని అభ్యర్థిస్తున్నామన్నారు.
మార్గదర్శకాలు
నిర్మాణ ప్రదేశాలు, కార్యాలయాలు, అపార్టుమెంట్ అసోసియేషన్లు కచ్చితంగా పలుమార్లు శుభ్రపర్చుకోవాలి.
ఈ ప్రాంగణాలకు సమీపంలో కచ్చితంగా శుభ్రతా కేంద్రాలు ఉండాలి. అక్కడ తగినంతగా సోప్ సొల్యూషన్ అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరినీ కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రపర్చుకోవాల్సిందిగా సూచించాలి.
నిర్మాణ రంగంలోని కార్మికులకు నిర్దేశిత వాష్ ఏరియా ఉండాలి. కార్మికులకు నో కాంటాక్ట్(ఎవరినీ తాకరాదు) అనే విధానం గురించి సూచించాలి. ఉద్యోగులు, కార్మికులకు థర్మల్ స్ర్కీనింగ్ చేయడం ద్వారా అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించాలి.
మధ్యాహ్న భోజనం ఇంటి నుంచి తెచ్చుకునేందుకు ఉద్యోగులను ప్రోత్సహించడంతో పాటు బయట తినడాన్ని నిరోధించాలి.
కార్మికులు బయట సందర్శకులతో హ్యండ్‌షేక్ చేయడం లేదంటే వ్యక్తిగతంగా తాకడం లాంటివి నిరోధించాలి.
వ్యాపారానికి అవసరం లేదని భావించిన వ్యక్తులను సైట్/ ఆఫీస్ లోపలకు అనుమతించడం లేదా అక్కడ ఉండేందుకు అంగీకరించొద్దు.
సైట్‌తో పాటు వారి ఇళ్ల వద్ద తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి డెవలపర్లు కచ్చితంగా కార్మికులకు వివరించాలి. అలాగే ఇంటి వద్ద ఉన్న వారు అదేవిధమైన మార్గదర్శకాలను అనుసరించేందుకు ప్రోత్సహించాలి. వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఎలాంటి పరిస్థితిల్లో అయినా సమూహాలకు దూరంగా ఉండాలి.