కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ సృష్టించి మోసం

ABN , First Publish Date - 2020-03-21T10:00:12+05:30 IST

గూగుల్‌లో ఓ నకిలీ కాల్‌సెంటర్‌ నెంబర్‌ ప్రచారం చేసి.. యూపీఐ యాక్టివేషన్‌ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్‌ నేరస్థులను సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు.

కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ సృష్టించి మోసం

 నగరవాసికి రూ.37 వేల టోకరా 

సీసీఎ్‌సలో ఫిర్యాదు

జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు నిందితుల అరెస్టు


హైదరాబాద్‌ సిటీ, మార్చి20 (ఆంధ్రజ్యోతి): గూగుల్‌లో ఓ నకిలీ కాల్‌సెంటర్‌ నెంబర్‌ ప్రచారం చేసి.. యూపీఐ యాక్టివేషన్‌ పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్‌ నేరస్థులను సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను జార్ఖండ్‌లో అరెస్టు చేసి నగరానికి తరలించారు. లైమ్‌రోడ్‌ పేరిట ఆన్‌లైన్‌ విక్రయాలు జరిపే యాప్‌కు సంబంధించి సొంతంగా ఓ కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌ నెంబర్‌ను నిందితులు సృష్టించారు. ఏదైనా సమస్య ఉండి ఎవరైనా కాల్‌ చేయగానే ఆ నెంబర్‌ను డిస్‌కనెక్ట్‌ చేసి మరో నెంబర్‌తో వారిని కాంటాక్ట్‌ చేస్తారు. ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయడం, ఆర్డర్‌లో ఏదైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయడం, డబ్బులు రిఫండ్‌ అడగడం లాంటి ఫిర్యాదులను పరిష్కరిస్తామని నటిస్తారు. సంభాషించిన తర్వాత ఓ మెసేజ్‌ పంపి దాన్ని మరో హెడ్‌ ఆఫీస్‌ నెంబర్‌పై ఫార్వర్డ్‌ చేయాలని చెబుతారు. ఆ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేయగానే యూపీఐ యాక్టివేషన్‌ లింక్‌ మోసగాళ్ల చేతికి చేరుతుంది. క్షణాల్లో ఫిర్యాదుదారుని అకౌంట్‌లోంచి డబ్బులు మాయం చేసేస్తారు.


సికింద్రాబాద్‌ లాలాగూడ ప్రాంతానికి చెందిన అర్జున్‌ సింగ్‌ భోజక్‌ లైమ్‌రోడ్‌ యాప్‌లో రెండు షర్టులకు ఆర్డర్‌ చేస్తే ఒకే షర్టు వచ్చింది. దీంతో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ సేకరించి కాల్‌ చేయగా.. మోసగాళ్లు కాంటాక్ట్‌లోకి వచ్చి మెసేజ్‌ పంపి ఫార్వర్డ్‌ చేయగానే అతని అకౌంట్‌లోంచి రూ.37 వేలు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు జార్ఖండ్‌ రాష్ట్ర వాసులుగా గుర్తించారు. పిప్రా గ్రామానికి చెందిన మన్సూర్‌ అన్సారీ(40), అస్లమ్‌ రాజా(21) కలిసి కొంతకాలంగా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మందిని మోసం చేసి రూ.లక్షల్లో కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్సిట్‌ వారెంట్‌పై వారిని నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2020-03-21T10:00:12+05:30 IST