మీ భద్రత మా బాధ్యత
ABN , First Publish Date - 2020-12-01T07:22:42+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

ధైర్యంగా ఓటేయండి
సమస్యాత్మక ప్రాంతాల్లో సీపీల పర్యటన
ఓటర్లకు అవగాహన కల్పించిన పోలీస్ బాస్‌లు
హైదరాబాద్ సిటీ, నవంబర్ 30 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్‌బూత్‌కు వెళ్లి వేటు వేయాలని, మీ భద్రత మా బాధ్యత అని మూడు కమిషనరేట్ల సీపీలు పేర్కొనారు. ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. ప్రలోభాలకు లొంగకుండా, రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కును ఓటరు వినియోగించుకోవాలలన్నారు. అడుగడుగునా పోలీసుల నిఘా ఉంటుందని, ఎక్కడా ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రాచకొండ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ సోమవారం సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటించి, ఓటర్లకు అవగాహన కల్పించారు. పలు కాలనీల్లో, బస్తీల్లో కేంద్ర సాయుధ బలగాలతో కలసి పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పకడ్బందీగా బందోబస్తు: సీపీ సజ్జనార్
ఓటింగ్ జరిగే డివిజన్లలో పోటీలో పాల్గొన్న అభ్యర్థికి, తన ఏజెంట్‌కు ఒకే వాహనం సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సోమవారం గచ్చిబౌలిలోని కమిషరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కోసం పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఎవరైనా గుంపులుగా చేరితే చర్యలు తప్పవన్నారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల మేర 144 సెక్షన్ అమలులో ఉంటున్నారు. అలాగే, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులపై నిఘా పెట్టామన్నారు.
ఆరోపణలు తగదు..
కొందరు నాయకులు పనిగట్టుకుని పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని, ఫేక్ వీడియాలను వైరల్ చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే డయల్0-100కు లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగాని ప్రత్యర్థులు, స్థానికులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇతర పార్టీ నాయకులతో వాగ్వాదాలకు దిగడం, గొడవలు పడటం చేయొద్దన్నారు. ఈ సందర్భంగా కూకట్పల్లి, మైలార్‌దేవ్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో ఆదివారం జరిగిన కొన్ని సంఘటనలు సీపీ ఉటంకించారు.
