శుభ్రతే శ్రీరామ రక్ష..!

ABN , First Publish Date - 2020-03-24T09:23:56+05:30 IST

బయటకు వెళ్లడం దాదాపు తగ్గించాలి. అత్యవసరం అయితే తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలి. ఇది అందరూ పాటిస్తేనే కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

శుభ్రతే శ్రీరామ రక్ష..!

జనతా కర్ఫ్యూ.. లాక్‌డౌన్‌.. వీటన్నింటి ఉద్దేశ్యమూ కరోనా వైరస్‌ నివారణే. ఎన్ని చేసినా కరోనాపై విజయం సాధించాలంటే.. ఒక్కటే మంత్రం. పరిశుభ్రత పాటించడం. స్వీయ నియంత్రణలో ఉండడం. ప్రాణాపాయ స్థితి తప్పితే బయటకు వెళ్లకుండా ఉండడం. 


హైదరాబాద్‌ సిటీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : 


బయటకు వెళ్లడం దాదాపు తగ్గించాలి. అత్యవసరం అయితే తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలి. ఇది అందరూ పాటిస్తేనే కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఇటలీ దేశానికి వచ్చిన పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త, పరిసరాల పరిశుభ్రతమే ఏకైక లక్ష్యంగా ఉండాలి. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరికి వారు స్వయం దిగ్భంధనం (క్వారంటైన్‌) చేసుకోవడమే చాలా ఉత్తమని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌ లాంటి మహానగరంలో నివాసం ఉంటున్న కుటుంబాలన్నీ తమ గదులను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా ఉంచుకొని కొన్ని రోజుల పాటు ప్రత్యేక జాగ్రతలు తీసుకుంటే సరిపోతుంది.


పిల్లలతో కలిసి ఉండే సమయంలోనూ పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఈ వైరస్‌కు మందు (వ్యాక్సిన్‌) లేదు. నివారణ ఒక్కటే ఏకైక మార్గం. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే తరచూ సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్‌ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఉండొద్దు. అలాగని వారిని అంటరాని వారిలా చూడకూడదు. ఎవరికైనా దగ్గు, జ్వరం లాంటివి వస్తే వాళ్లు జనంలో తిరగకుండా ఇంట్లోనే ఉంటూ ఎక్కువ నీళ్లు తాగాలి. ఒకట్రెండు రోజుల్లో అవి తగ్గకపోతే ఎవరినీ తాకకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి.


ఇంట్లో వస్తువులతో అప్రమత్తం

ఇంట్లో ఉంటున్న సమయంలో రకరకాల వస్తువులను పట్టుకోకుండా గడవని పరిస్థితి. కరోనా సోకిన రోగి పట్టుకున్న ప్రతి వస్తువు మీద దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎవరికి ఆ వైరస్‌ ఉందో గుర్తించ లేము. కేవలం దగ్గు, జలుబు మాత్రమే కాదు, వారి చేతులతో తాకిన వస్తువులను పట్టుకునే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణం చేయడం కొందరికి తప్పనిసరిగా ఉంటుంది. ఈ సమయంలో  సమూహంగా వెళ్లే  బదులు ఒక్కొక్కరుగా వెళ్లి రావడం చేస్తే కరోనా వ్యాపించకుండా కట్టడి చేయవచ్చు.


ఆన్‌లైన్‌ ఆర్డర్లిచ్చారా... 

వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై ఆధారపడుతున్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు తగినట్లుగా ఈ కామర్స్‌ సంస్థలు కొత్తగా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటిస్తున్నాయి. డిమాండ్‌ తట్టుకునేందుకు వీలుగా గోదాముల్లో పని చేయడానికి, సరుకులు డెలివరీ చేయడానికి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది. ఆన్‌లైన్‌ ఆర్డర్లు తీసుకువచ్చే డెలివరీ బాయిస్‌తో పాటు ఆయా వస్తువులు కూడా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉందన్న సంగతిని ముందుగానే గుర్తించాలి. దానికి అనుగుణంగా శుభ్రత పాటించిన తర్వాతే ఆయా వస్తువులను తాకాలి.

Updated Date - 2020-03-24T09:23:56+05:30 IST