పడకేసిన ‘పర్యాటకం’
ABN , First Publish Date - 2020-03-13T09:39:20+05:30 IST
తెలంగాణ టూరిజంశాఖ పడకేసింది. చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైర్‌సతో తెలంగాణ టూరిజం కుదేలవుతోంది.

తీర్థయాత్రలకు తగ్గిన టూరిస్టుల సంఖ్య
కలవరపెడుతున్న కరోనా..
వీక్లీ టూర్ బస్సులోనూ ప్రయాణికులు సగమే..
పర్యాటకశాఖకు భారీగా తగ్గిన ఆదాయం
హైదరాబాద్ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ టూరిజంశాఖ పడకేసింది. చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైర్‌సతో తెలంగాణ టూరిజం కుదేలవుతోంది. గతంలో సాధారణ సంఖ్యకు రెట్టింపు స్థాయిలో దేశంలోని వివిధ దర్శనీయ, చారిత్రక ప్రాంతాల సందర్శనకు వెళ్లిన పర్యాటకులు.. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం ఇంటినుంచి కాలు బయట పెట్టని పరిస్థితి ఏర్పడింది. కార్యాలయాలు, అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే మాస్క్‌లు ధరించి, అత్యంత జాగ్రత్తగా వెళ్తున్నారు. ఫలితంగా కొన్ని రోజుల క్రితం పర్యాటకులతో కళకళలాడిన టూరిజం రిజర్వేషన్ సెంటర్లు, పర్యాటక ప్రాంతాలు నేడు కళావిహీనంగా మారాయి.
సగానికి తగ్గిన టూరిస్టులు..
కరోనా వైరస్ కారణంగా తెలంగాణ టూరిజంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ప్యాకేజీలకు నగరవాసులు అంతగా ఆసక్తి చూపడం లేదు. కొన్ని రోజులుగా పర్యాటక, దర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ఎవరూ ముందుకురావడం లేదు. గతంలో హైదరాబాద్-షిరిడీ రెండు రోజుల ప్యాకేజీకి భారీ డిమాండ్ ఉండేది. నిర్ణీత టూరిస్టుల సంఖ్య కంటే ఎక్కువ మంది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్ చేసుకునేవారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ ప్యాకేజీకి ఆన్‌లైన్ బుకింగ్‌లు భారీగా తగ్గిపోయాయి. 43 సీట్ల కెపాసిటీ కలిగిన బస్సులో కనీసం 20 మంది కూడా రావడం లేదని టూరిజంశాఖ అధికారి ఒకరు తెలిపారు. హైదరాబాద్-తిరుమల, తిరుపతి ప్యాకేజీ పరిస్థితి ఇలాగే ఉందని, వారానికోసారి నిర్వహించే ఈ యాత్రకు 43 సీట్ల కెపాసిటీ కలిగిన బస్సులో కేవలం 22 నుంచి 24 మంది మాత్రమే వెళ్తున్నారని చెప్పారు.
ఆదాయం కోల్పోతున్న టూరిజం..
కరోనా వైరస్ కారణంగా పర్యాటకుల సంఖ్య తగ్గడంతో టూరిజంశాఖ భారీగా ఆదాయం కోల్పోతోంది. 43 సీట్ల కెపాసిటీ కలిగిన టూరిజం బస్సు ఒకసారి షిరిడీకి వెళ్లి వస్తే అన్ని ఖర్చులు పోను వారానికి రూ.30 రూ.35 వేల ఆదా యం మిగులుతుంది. నెలకు సగటున రూ.1.40 లక్షలు వచ్చేది. హైదరాబాద్-తిరుపతి ప్యాకేజీలో వారానికి అన్ని ఖర్చులు పోనూ రూ. 45వేల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో నెలకు రూ.1.80 లక్షల వరకు వచ్చేది. పర్యాటకులు తగ్గిన కారణంగా షిరిడీ, తిరుపతి ప్యాకేజీలకు నెల రోజులుగా టూరిజంశాఖ దాదాపు రూ. రూ.2లక్షల ఆదాయం కోల్పోయినట్లు తెలుస్తోంది. అలాగే తెలంగాణ టెంపుల్ టూరిజం కింద వారానికి రూ.25వేల నుంచి రూ.30వేల ఆదాయం వస్తుంది. రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు పొరుగు రాష్ర్టాలకు పదుల సంఖ్యలో నిర్వహిస్తున్న యాత్రలకు నెలకు సగటున టూరిజం శాఖకు రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం వచ్చేది.
ఇక నగరంలోని చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, గోల్కొండ, హుస్సేన్‌సాగర్, బిర్లామందిర్, చౌమహల్లా ప్యాలెస్, తదితర ప్రాంతాల నుంచి రూ.15లక్షల ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ర్టాన్ని, నగరాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా పర్యాటక ప్రాంతాలను సందర్శించే నాథుడే కరువయ్యారు. పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన వారు మినహా నగరవాసులు భాగ్యనగర పర్యాటకానికి దూరంగా ఉంటున్నారని టూరిజంశాఖ అధికారులు చెబుతున్నారు. దీం తో గణనీయంగా ఆదాయం పడిపోయినట్లు పేర్కొంటున్నారు.
అంతంత మాత్రంగా హాఫ్‌ఆన్ హాఫ్ ఆఫ్ బస్సులు..
నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను ఒకే బస్సులో అతి తక్కువ ధరతో చూపించాలనే ఉద్దేశంతో టూరిజంశాఖ కొన్నేళ్ల క్రితం అందుబాటులోకి తీసుకొచ్చిన హాఫ్ ఆన్.. హాఫ్ ఆఫ్ బస్సులు ఆదరణ కోల్పోతున్నాయి. గతంలో రోజుకు నాలుగైదు ట్రిప్పులు నడిచిన బస్సులు ప్రస్తుతం ఒకటి కూడా సరిగా నడవడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, నగరంలోని లుంబినీ పార్కు, ఎన్‌టీఆర్ గార్డెన్, హుస్సేన్‌సాగర్, గోల్కొండ ప్రాంతాలకు కూడా పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది.