అన్ని చోట్లా అలర్ట్‌..!

ABN , First Publish Date - 2020-03-21T09:35:31+05:30 IST

కరోనా నేపథ్యంలో ఆయా మాల్స్‌ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌, కొండాపూర్‌లోని శరత్‌సిటీమాల్‌, ఐకియా, మియాపూర్‌లోని జీఎస్‌ఎంమాల్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో ఉన్న పలు మాల్స్‌ ముందు శానిటైజర్‌తో చేతులు కడుక్కుని.. థర్మల్‌ స్కానింగ్‌ తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.

అన్ని చోట్లా అలర్ట్‌..!

కరోనా నివారణ చర్యలు

మాల్స్‌, సూపర్‌ మార్కెట్లలో పకడ్బందీ ఏర్పాట్లు

థర్మల్‌ స్కానింగ్‌ తర్వాతనే లోపలికి అనుమతి

చేతికి శానిటైజర్లు, ప్లాస్టిక్‌ గ్లౌజులు

అపార్టమెంట్లలోనూ శానిటైజర్ల వినియోగం

కొత్తపేట, గుడిమల్కాపూర్‌ మార్కెట్ల మూసివేత

తాత్కాలికంగా ఐకియా షోరూం మూసివేత


కరోనా వైరస్‌ నివారణకు ఎవరికి వారు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల నిత్యావసర వస్తువుల కొనుగోలు కేంద్రాలైన మాల్స్‌, సూపర్‌ మార్కెట్లతో పాటు ప్రభుత్వ కూరగాయల మార్కెట్లో సైతం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. థర్మల్‌ స్కానింగ్‌ తర్వాతే మాల్స్‌లోకి అనుమతిస్తున్నారు. 


హైదరాబాద్‌ సిటీ నెట్‌వర్క్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : కరోనా నేపథ్యంలో ఆయా మాల్స్‌ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌, కొండాపూర్‌లోని శరత్‌సిటీమాల్‌, ఐకియా, మియాపూర్‌లోని జీఎస్‌ఎంమాల్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, కూకట్‌పల్లి, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో ఉన్న పలు మాల్స్‌ ముందు శానిటైజర్‌తో చేతులు కడుక్కుని.. థర్మల్‌ స్కానింగ్‌ తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.  ప్రభుత్వ ఆదేశాలతో కొన్ని మాల్స్‌ వెలవెలబోతుండగా, నిత్యావసర వస్తువులకు సంబంధించిన మార్కెట్లలో వినియోగదారుల సంఖ్య భారీగా ఉంటోంది. కేపీహెచ్‌బీ ప్రాంతంలో ఉన్న ఫోరం సుజనా మాల్‌, మంజీరా మాల్‌, డీ మార్ట్‌ తదితర మాల్స్‌, సూపర్‌ మార్కెట్‌లలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది మాస్క్‌లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. పండ్లు, కూరగాయలు విక్రయించే కొన్ని సూపర్‌ మార్కెట్లలో చేతికి ప్లాస్టిక్‌ గ్లౌజ్‌ తొడుక్కొని వెళ్లాలని సూచిస్తున్నారు.


సూపర్‌మార్కెట్ల వద్ద పెరిగిన రద్దీ...

కరోనా వైరస్‌ నేపథ్యంలో జనం నిత్యావసర సరుకుల కోసం సూపర్‌మార్కెట్లలో క్యూ కడుతున్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడంతో ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. కొన్ని రోజులపాటు కర్ఫ్యూ ఉండే అవకాశాలు లేకపోలేదని జనం చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందస్తుగా ఇంట్లోకి కావాల్సిన సరుకులను కనీసం రెండు  నెలలకు సరిపడా తీసుకుంటున్నారని సూపర్‌మార్కెట్లలో పనిచేస్తున్న ఉద్యోగులు తెలిపారు. నగరంలో అతి పెద్ద కూరగాయల మార్కెట్లు అయిన కొత్తపేట, గుడిమల్కాపూర్‌లోని కూరగాయల మార్కెట్లను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మలక్‌పేట మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిగడ్డలను 15 రోజుల పాటు నిషేధించినట్లు తెలిపారు.


అపార్టుమెంట్లలో ప్రత్యేక ఏర్పాట్లు...

గ్రేటర్‌ పరిధిలోని అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు అసోసియేషన్ల ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా గేటెడ్‌ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్న నార్సింగి, మణికొండ, గచ్చిబౌలి, సన్‌సిటీ బండ్లగూడ జాగీర్‌, కూకట్‌పల్లి ప్రాంతాల్లో స్థానికులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బండ్లగూడ సన్‌సిటీ పరిధిలో ఉన్న మధుపార్క్‌ రిడ్జ్‌ అపార్టుమెంట్లలో కరోనా నివారణ చర్యలు చేపట్టారు. కూకట్‌పల్లి ప్రాంతంలోని మలేషియన్‌టౌన్‌షిప్‌, ఇందూ ఫార్చున్‌ ఫీల్డ్స్‌, మంజీరా ట్రినిటీ హోమ్స్‌, ఎస్‌ఎంఆర్‌ వినయ్‌, ప్రణీత్‌ నెస్ట్‌ హ్యాపీ హోమ్స్‌, రెయిన్‌ బో విస్టా తదితర గేటెడ్‌ కమ్యూనిటీలల్లో అసోసియేషన్లు ప్రత్యేకంగా సమావేశం అయి కరోనా నివారణకు చర్యలు తీసుకునేందుకు నిర్ణయించాయి. తొలుత యూవీ థర్మామీటర్‌ ద్వారా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నివాసం ఉండే వారి ఆరోగ్య స్థితిగతులను పరీక్షించడంతో పాటు ఆయా అపార్ట్‌మెంట్‌లలో పనిచేస్తున్న సిబ్బందికి శానిటేషన్‌ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ పరిశీలించి వారి చేతులను శానిటరీతో శుభ్రం చేసుకున్న తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. రోజూ పనిచేసే కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందికి మాస్క్‌లు పంపిణీ చేసి వాటిని తప్పనిసరిగా ధరించి విధులు నిర్వహించేలా చూస్తున్నారు. 


గెలెరియా మాల్‌కు వెళ్లిన వారు...

పంజాగుట్టలోని గెలెరియా మెట్రో మాల్‌కు ఈనెల 11న వెళ్లిన వారు తమ ఇళ్లల్లోనే ఉండిపోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. ఈ మాల్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్దారణ అయిందని, ఆరోజు మాల్‌కు వెళ్లిన వారంతా ముందు జాగ్రత్త చర్యగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, కరోనా నివారణ చర్యలు పాటించాలని అధికారులు సూచించారు.

Updated Date - 2020-03-21T09:35:31+05:30 IST