కొత్త ప్రాంతాల్లో కరోనా

ABN , First Publish Date - 2020-05-30T10:10:33+05:30 IST

గ్రేటర్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తకొత్త ప్రాంతాల్లో వైరస్‌ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఫ్రీజోన్‌గా ఉన్న బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో

కొత్త ప్రాంతాల్లో కరోనా

పెరుగుతున్న పాజిటివ్‌లు.. 

చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బాధితులు


బడంగ్‌పేట్‌/మెహిదీపట్నం/ముషీరాబాద్‌/ఓల్డ్‌బోయిన్‌పల్లి/ఆనంద్‌బాగ్‌/ఉప్పల్‌/అడ్డగుట్ట/  పహాడిషరీ్‌ఫ/యూసు్‌ఫగూడ/ఎల్‌బీనగర్‌/ఖైరతాబాద్‌/బంజారాహిల్స్‌/రాంనగర్‌/రెజిమెంటల్‌బజార్‌/ మదీన/ హయత్‌నగర్‌/ చాదర్‌ఘాట్‌/ అంబర్‌పేట, మే 29 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తకొత్త ప్రాంతాల్లో వైరస్‌ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఫ్రీజోన్‌గా ఉన్న బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలో మొదటిసారి ఇద్దరు బాలురు(14, 12)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఉస్మాన్‌గంజ్‌కు చెందిన బాలుర తల్లిదండ్రులకు ఇటీవల కరోనా వైరస్‌ సోకడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో బాలురు సాయిబాలాజీ కాలనీలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. అప్పటికే బాలల నమూనాలు ల్యాబ్‌కు పంపించారు. పాజిటివ్‌గా తేలడంతో గురువారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించా రు. అమ్మమ్మ కుటుంబంలోని ఐదుగురిని హోం క్వారంటైన్‌ చేశారు. కాలనీని కట్టడి ప్రాంతంగా ప్రకటించారు. 

 

ఒకరికి కరోనా.. పలువురు హోం క్వారంటైన్‌

మహేశ్వరం హర్షగూడలో కరోనా సోకిన వారి బంధువులు బాలాపూర్‌ మండలం మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని లెనిన్‌నగర్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పలువురిని హోం క్వారంటైన్‌ చేశారు. లెనిన్‌నగర్‌కు చెందిన ఓ గర్భిణి ఈ నెల 18న ప్రసవం కోసం ఇంజాపూర్‌లోని పుట్టింటికి వెళ్లింది. ఆమెకు ఆస్తమా ఉండడంతో ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఆమె ఈ నెల 25న జడ్జిఖానా ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. లెనిన్‌నగర్‌లోని ఆమె భర్త, అత్త సహా మరికొందరిని హోం క్వారంటైన్‌ చేసినట్లు బాలాపూర్‌ వైద్యాధికారిణి డాక్టర్‌ ఉమాదేవి చెప్పారు.   


ముషీరాబాద్‌లో ముగ్గురికి.. 

ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. శుక్రవారం భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ పరిధిలో ఒకరికి,  బైబిల్‌ హౌస్‌ యూపీహెచ్‌సీ పరిధిలో ఒకరికి, చిక్కడపల్లి యూపీహెచ్‌సీ పరిధిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నియోజకవర్గంలో శుక్రవారం వరకు 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 26 మంది డిశ్చార్జి అయ్యారు. భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ పరిధిలో ఇప్పటి వరకు 16, బైబిల్‌హౌస్‌ యూపీహెచ్‌సీ పరిధిలో 14 కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వడంతో ఈ నెల 19 నుంచి భోలక్‌పూర్‌ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. 


భవానీనగర్‌లో ఒకరికి.. 

ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌, భవానీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒకరికి(39) శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌ చేశారు. మరో ముగ్గురిని కూడా వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


నాచారంలో మూడేళ్ల బాలుడికి... 

నాచారం దుర్గానగర్‌లో మూడేళ్ల బాలుడు కరోనా బారిన పడ్డాడు. బాలుడి తండ్రి ప్రైవేటు ఉద్యోగి. చిన్నారికి వైరస్‌ ఎలా సోకిందన్న విషయాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు. బాలుడిని ‘గాంధీ’కి తరలించారు.  


అడ్డగుట్టలో వృద్ధుడికి.. 

అడ్డగుట్టకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది. కొన్ని రోజులుగా జలుబు, ఆయాసం, జ్వరంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాడు. తగ్గకపోవడంతో కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అడ్డగుట్ట ఆరోగ్యకేంద్రం ప్రతినిధి నవనీత వివరాలు సేకరించారు. వంట మనిషి, పేపర్‌, పాలప్యాకెట్‌ వేసే వారితోపాటు ముగ్గురిని క్వారంటైన్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 


పహాడిషరీ్‌ఫలో ఆరుగురికి... 

పహాడిషరీ్‌ఫలో శుక్రవారం మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఓ వృద్ధురాలు తన కుటుంబంతో సరదాగా గడపాలనుకున్న కోరిక ఇప్పటి వరకు 28 మంది కరోనా బారిన పడేందుకు కారణమైంది. బోరబండ, హర్షగూడ, గౌలిపురా, జియాగూడ, సంతో్‌షనగర్‌లలో గతంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి వృద్ధురాలి కుమార్తెలు పహాడిషరీ్‌ఫకు వచ్చారు. ఈ క్రమంలో పహాడిషరీ్‌ఫలో మొదట 10 మందికి, తర్వాత ఎనిమిది మందికి, శుక్రవారం ఆ వృద్ధురాలి కుమారుడి(60)తోపాటు బంధువులు(55), (56), (34), (16), (9)లకు  పాజిటివ్‌గా తేలింది. వృద్ధురాలి కుమారులు మటన్‌ షాపు నిర్వహిస్తారు. వారిని ఎవరు కలిశారు. వారి వద్ద ఎవరు మటన్‌ కొన్నారో స్వచ్ఛందంగా ముందుకు రావాలని బాలాపూర్‌ అర్బన్‌ ప్రైమరీ సెంటర్‌ వైద్యాధికారిణి డాక్టర్‌ ఉమాదేవి కోరారు. 


యూసు్‌ఫగూడలో నలుగురికి..  

యూసు్‌ఫగూడ సర్కిల్‌ పరిధిలో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. వెంకటగిరి, ఇంజనీర్స్‌ కాలనీలలో రెండు కేసులు, రహ్మత్‌నగర్‌ వీడియోగల్లీలో మరో రెండు కేసులు నమోదయ్యాయి.


న్యూగడ్డిఅన్నారంలో ముగ్గురికి..  

సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని గడ్డిఅన్నారం కాలనీలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాలనీకి చెందిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌కు గురువారం కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అతడి తల్లిదండ్రులు, భార్యాపిల్లలను ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో 70 ఏళ్ల తండ్రి, 33 ఏళ్ల భార్య, 11 ఏళ్ల కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా వైద్యులు తేల్చారు. 


ఎంఎస్‌ మక్తాలో ఒకరికి.. 

ఎంఎస్‌ మక్తాలో వృద్ధురాలి (60)కి కరోనా సోకింది. రెండు, మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెను పరీక్షించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెకు స్థానికంగాగల ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. మరో ముగ్గురిని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిలోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. 


హిల్స్‌లో ఒకే కుటుంబంలో నలుగురికి.. 

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో ఓ కుటుంబంలో నలుగురికి వైరస్‌ సోకింది. ఓ వ్యాపారి భార్య, కుమారుడు(17), కుమార్తె (14)తో కలిసి ఉంటున్నాడు. పదిరోజుల క్రితం కొంపల్లిలో బంధువు మరణించడంతో అంత్యక్రియలకు హాజరయ్యారు. మూడు రోజుల క్రితం కుమారుడికి జలుబు, దగ్గు రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అతడితోపాటు, కుటుంబ సభ్యులకూ పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారిని ప్రైవేటు ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు.  


రాంనగర్‌లో రెండు పాజిటివ్‌ కేసులు  

రాంనగర్‌ దయారా మార్కెట్‌లో వస్త్ర దుకాణం యజమానికి సంబంధించి ప్రైమరీ కాంట్రాక్ట్‌లో 15ఏళ్ల కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతడి ఇంట్లోని ఐదుగురిని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉంచారు. అదే డివిజన్‌లోని మేదరబస్తీలో మహిళ(50)కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ముషీరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో పరీక్షలు చేయగా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


కిషన్‌బాగ్‌లో..  

బహదూర్‌పురా నియోజకవర్గం కిషన్‌బాగ్‌ నౌ నంబర్‌ ప్రాంతానికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారితోపాటు బహదూర్‌పురా పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్‌కు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. 


మలక్‌పేట్‌లో ఇద్దరికి.. 

మలక్‌పేటలో కరోనా మళ్లీ ప్రతాపం చూపుతోంది. ఓల్డ్‌మలక్‌పేట వాహెద్‌నగర్‌లో 50ఏళ్ల మహిళకు గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె కుటుంబంలోని ఐదుగురిని క్వారంటైన్‌కు తరలించారు. సైదాబాద్‌ ప్రెస్‌ కాలనీలో 35 ఏళ్ల మహిళ అస్వస్థతకు గురికాగా, ఈనెల 27న అవేర్‌ గ్లోబల్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కు తీసుకెళ్లారు. ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె భర్త, ముగ్గురు పిల్లలు, సోదరుడిని క్వారంటైన్‌ చేశారు. ఓల్డ్‌మలక్‌పేట నివాసి(53)కి గురువారం రాత్రి కరోనా పాజిటివ్‌గా తేలింది. 


ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌లో ఒకరికి..

ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌ కాలనీలో 60 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొన్ని రోజుల క్రితం పాతబస్తీలో బంధువుల అంత్యక్రియలకు హాజరై వచ్చిన నేపథ్యంలో అక్కడే వైరస్‌ సోకి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబంలోని ఏడుగురికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


‘గాంధీ’లో వృద్ధుడి మృతి 

ఖమ్మంకి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చనిపోయాడు. అతడిని ఈ నెల 25న ఆస్పత్రికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం చనిపోయాడు. విషయాన్ని నిర్ధారించేందుకు వైద్యులు నిరాకరించారు.  


వైద్యురాలికి కరోనా పాజిటివ్‌

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12లో గల ఓ ఆస్పత్రి వైద్యురాలికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.  కూకట్‌పల్లికి చెందిన ఒకరు కేన్సర్‌తో బాధపడుతుండగా, వారం క్రితం సదరు వైద్యురాలు, మరో వైద్యుడు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం కరోనాతో ఆ వ్యక్తి మరణించాడు. రెండు రోజుల క్రితం వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజాగా వైద్యురాలికి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్‌లో గల ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 


స్టాఫ్‌ నర్సుకు.. 

సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌బజార్‌కు చెందిన స్టాఫ్‌ నర్సు కరోనా బారిన పడ్డారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేసే ఆమె ఈ నెల 21న ఓ రోగికి వైద్య సేవలందించింది. అతడికి కరోనా లక్షణాలు ఉండడంతో ఆస్పత్రి యాజమాన్యం ఆమెతోపాటు మరికొందరిని ఐసోలేషన్‌లో ఉంచింది. 24న సదరు రోగికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. స్టాఫ్‌ నర్సుకు ఈనెల 28న వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఆమె భర్త, కుమారుడిని హోం క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు చేయనున్నట్లు యూపీహెచ్‌సీ వైద్యుడు శ్రీమన్నారాయణ తెలిపారు.  


రైల్వే ఆస్పత్రి నర్సుకు..  

లాలాగూడ రైల్వే ఆస్పత్రిలో నర్సుకు(32) కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. మల్కాజిగిరి ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌, సీఫెల్‌ కాలనీకి చెందిన ఆమె జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండడంతో పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులనూ ఆస్పత్రికి తరలించారు.  


Updated Date - 2020-05-30T10:10:33+05:30 IST