సారూ... కరోనా ఎక్కడుంది?

ABN , First Publish Date - 2020-04-08T19:56:40+05:30 IST

మేం ఫలానా ఏరియాలో ఉంటాం, మా ప్రాంతంలో కరోనా కేసులు ఏమైనా ఉన్నాయా..? నగరవాసి ప్రశ్న. నేను ఫలానా ఏరియాకి వెళ్లాలనుకుంటున్నాను వెళ్లొచ్చా..?

సారూ... కరోనా ఎక్కడుంది?

ఫలానా ఏరియాలో ప్రాబ్లం లేదు కదా  

ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు మా ప్రాంతంలో ఉన్నారు 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి):
మేం ఫలానా ఏరియాలో ఉంటాం, మా ప్రాంతంలో కరోనా కేసులు ఏమైనా ఉన్నాయా..? నగరవాసి ప్రశ్న. నేను ఫలానా ఏరియాకి వెళ్లాలనుకుంటున్నాను వెళ్లొచ్చా..? అక్కడ రెడ్‌ జోన్‌ లాంటివేమన్న ప్రకటించారా..? ఓ పౌరుడి ఆరా. మా కాలనీలో ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చాడు. ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరూ తీసుకెళ్లలేదు. - ఓ వ్యక్తి ఫిర్యాదు. జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌కు ప్రజల నుంచి వస్తున్న కాల్స్‌లో కొన్ని ఇవీ. నిత్యం వందల సంఖ్యలో కాల్స్‌ వస్తుండగా.. అందులో కరోనా సంబంధిత ఫిర్యాదులు, సమాచారం కోసం వస్తున్నవే ఎక్కువ అని అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు నగరంలోని ఏ ఏరియాలో ఎక్కువ నమోదయ్యాయి..? ఫలానా ప్రాంతంలో పరిస్థితి బాగానే ఉందా అని నగరవాసులు ఆరా తీస్తున్నారు. సంతల వల్ల మా ఏరియాలో జనాలు గుమిగూడుతున్నారని, పేరుకు పోయిన చెత్తను తొలగించాలని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. వారం రోజులుగా నగరంలో కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో కంట్రోల్‌ రూమ్‌కు కాల్స్‌ పెరిగాయని అధికారులు చెబుతున్నారు. గత నెల 24వ తేదీ నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు 12 వేలకు పైగా కాల్స్‌ వచ్చాయి. ఇందులో కరోనా సంబంధిత సమాచారం, కేసులు ఏ ప్రాంతంలో ఉన్నాయన్న వివరాల కోసం వచ్చిన కాల్స్‌ ఎక్కువ అని ఓ అధికారి తెలిపారు. కొందరు నిరాశ్రయులు తమకు ఆశ్రయం కల్పిస్తారా అని  కూడా కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదిస్తున్నారు.


Updated Date - 2020-04-08T19:56:40+05:30 IST