పది పరీక్షలకు కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-03-21T09:56:05+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం పదో తరగతి విద్యార్థులపై కూడా పడింది.

పది పరీక్షలకు కరోనా ఎఫెక్ట్‌

కరోనా వైర్‌సతో వాయిదా పడిన పదోతరగతి పరీక్షలు

మూడు పరీక్షలతో బ్రేక్‌ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సమూహాల కట్టడితో కరోనాను నియంత్రించేందుకు ప్రయత్నం


హైదరాబాద్‌ సిటీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం పదో తరగతి విద్యార్థులపై కూడా పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న కరోనా వైర్‌సను పూర్తిగా వందశాతం కట్టడి చేయాలనే ఉద్దేశంతో హైకోర్టు శుక్రవారం ప్రత్యేక తీర్పును వెలువరించింది. షెడ్యూల్‌ ప్రకారం శనివారం వరకు జరిగే పరీక్షను నిర్వహించి, తర్వాత పరీక్షలను ఈనెల 30 వరకు తాత్కాలికంగా వాయిదా వేసి రీషెడ్యూల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


కొందరి ఆందోళన

హైదరాబాద్‌ జిల్లాలో 2019-20 విద్యా సంవత్సరానికిగాను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి మొత్తం 82,502 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 362 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు తెలుగు మొదటి పేపర్‌కు 712 మంది గైర్హాజయ్యారు. అలాగే శుక్రవారం జరిగిన పరీక్షకు 727 మంది గైర్హాజరయ్యారు. శనివారం హిందీ పరీక్షను నిర్వహించనున్నట్లు, తర్వాత మిగతా వాటిని వాయిదా వేస్తున్నట్లు టీవీల్లో వార్తలు తెలుసుకున్న విద్యార్థులు, వారితల్లిదండ్రుల్లో కొంత మంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తమ పిల్లలు దాదాపు నాలుగు నెలల నుంచి సిద్ధమవుతున్నారన్నారు. వైరస్‌ కారణంగా పరీక్షలను వాయిదా వేయడంతో వారు ఏకాగ్రత కోల్పోతారని అంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సమాజానికి మంచిది కదా అని విద్యార్థులు, తల్లిదండ్రులు వాదిస్తున్నారు.

Updated Date - 2020-03-21T09:56:05+05:30 IST