కరోనా ఎఫెక్ట్‌..నగర రోడ్లపై సాఫీగా ప్రయాణం

ABN , First Publish Date - 2020-06-25T09:41:18+05:30 IST

గ్రేటర్‌లో కరోనా ప్రభావం ట్రాఫిక్‌ రద్దీపై కనబడుతోంది. అనవసరంగా బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించడం ద్వారా

కరోనా ఎఫెక్ట్‌..నగర రోడ్లపై సాఫీగా ప్రయాణం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌లో కరోనా  ప్రభావం ట్రాఫిక్‌ రద్దీపై కనబడుతోంది. అనవసరంగా బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించడం ద్వారా కరోనాను కట్టడి చేయవచ్చని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. 


 గ్రేటర్‌ పరిధిలో రోడ్లన్నీ ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌తో కిటకిటలాడుతుంటాయి. ట్రాఫిక్‌జామ్‌లు సర్వసాధారణం. సా యంత్రం అయ్యిందంటే చాలు ఐటీ కారిడార్‌లోని ఏ మార్గం చూసినా వాహనాలు బారులు తీరి ఉంటాయి. ఇదంతా కరోనాకు ముందు నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితి. ఇప్పుడు రోడ్లపై ట్రాఫిక్‌ సాధారణంగానే ఉంది. ట్రాఫిక్‌జామ్‌ అనే సమస్య పెద్దగా ఉండడం లేదు.


ప్రధాన రద్దీ కూడళ్లయిన జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, మాదాపూర్‌, సైబర్‌ టవర్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, అవుటర్‌ రింగ్‌రోడ్డు, బయోడైవర్సిటీ, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో రోడ్లపై రద్దీ సాధారణంగా ఉంది. గూగుల్‌ మ్యాప్‌ లైవ్‌ ట్రాఫిక్‌ పరిస్థితిని పరిశీలిస్తే గ్రీన్‌, ఆరెంజ్‌ మార్క్‌ తప్ప, రెడ్‌ మార్క్‌ చాలా తక్కువ ప్రాంతాల్లో కనిపిస్తోంది.


ఇంతకుముందు సోమవారం రోజైతే నగరంలోని ప్రధాన కూడళ్లలో రెడ్‌, ఆరెంజ్‌ మార్క్‌లే ఎక్కువగా కనిపించేవి. కాగా ట్రాఫిక్‌ రద్దీ తగ్గడం మంచి పరిణామమే అయినప్పటికీ, పెరుగుతున్న కరోనా కేసులతోనే రోడ్డుపైకి రావాలంటే భయపడాల్సి వస్తోందని బ్యాంక్‌ ఉద్యోగి మాణికేశ్వర్‌ తెలిపారు.  

Updated Date - 2020-06-25T09:41:18+05:30 IST