కరోనా దెబ్బకు హోటల్స్‌ కకావికలం

ABN , First Publish Date - 2020-03-18T09:24:28+05:30 IST

కరోనా కేసులు ఇండియాలో నెమ్మదిగా పెరుగుతుండటం.. ఇతర దేశాల నుంచి పర్యాటకులపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు... పర్యాటక ప్రాంతాలు సహా పలు ప్రాంతాలను ఈ నెలాఖరు వరకూ మూసేయ్యాలన్న ఆజ్ఞలు... ఇప్పుడు హోటల్‌ రంగంపై తీవ్రంగా చూపుతున్నాయి.

కరోనా దెబ్బకు హోటల్స్‌ కకావికలం

దారుణంగా పడిపోయిన బుకింగ్స్‌

పెరిగిన కార్పొరేట్‌ బుకింగ్‌ క్యాన్సిలేషన్స్‌ 

20-30 శాతం ఆక్యుపెన్సీతో కష్టం

ఈ 15 రోజులూ కీలకం 

రూమ్‌ రెంట్లలో ప్రస్తుతానికి లేని మార్పులు

వైరస్‌ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామంటున్న మేనేజర్లు


కరోనా కేసులు ఇండియాలో నెమ్మదిగా పెరుగుతుండటం.. ఇతర దేశాల నుంచి పర్యాటకులపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు... పర్యాటక ప్రాంతాలు సహా పలు ప్రాంతాలను ఈ నెలాఖరు వరకూ మూసేయ్యాలన్న ఆజ్ఞలు... ఇప్పుడు హోటల్‌ రంగంపై తీవ్రంగా చూపుతున్నాయి. నిన్నమొన్నటి వరకూ 10-15 శాతం ఆక్యుపెన్సీ కన్నా ఎక్కువేమీ తగ్గదని బీరాలు పలికిన హోటల్‌ మేనేజర్లు... ఇప్పుడు తమ ఆక్యుపెన్సీ ఆ 10-15 శాతానికే పరిమితమైందని వాపోతున్నారు.


మాదాపూర్‌, గచ్చిబౌలి, అమీర్‌పేట, బంజారాహిల్స్‌... ప్రాంతం ఏదైనా కావొచ్చు... హోటల్‌కు నక్షత్రాలు ఎన్నైనా ఉండొచ్చు గాక... అధికశాతం హోటల్స్‌లో రూమ్‌ ఆక్యుపెన్సీ మాత్రం 25 శాతం మించడం లేదన్నది పలువురు హోటల్‌ మేనేజర్ల మాట. అంతేకాదు.. కరోనా దెబ్బకు కకావికలం అయ్యే పరిస్థితి దాపురించిందని, రెస్టారెంట్‌ వ్యాపారమూ ఘోరంగా పడిపోయిందని పేర్కొంటున్నారు.నగరంలో చాలా వరకూ హోటల్స్‌ కార్పొరేట్‌ బుకింగ్స్‌పైనే ఆధారపడుతుంటాయని, ఇప్పుడు వాటిలోనూ 90 శాతం క్యాన్సిలేషన్స్‌ జరుగుతుండటం తమ కష్టాలను మరింత పెంచుతున్నాయని వాపోతున్నారు.


మార్చిలో తక్కువే కానీ... 

కరోనా ప్రభావం ఎంత మేరకు ఉందనేది అప్పుడే చెప్పడం సాధ్యం కాదు కానీ.. ఈ ప్రభావం మాత్రం ఉందని చెప్పకతప్పదంటున్నారు హోటలీయర్లు. సాధారణంగా మార్చి నెలలో పరీక్షలు జరుగుతుంటాయి కాబట్టి దేశీయ పర్యాటకుల సంఖ్య కాస్త తక్కువగానే ఉంటుంది. వ్యాపార సందర్శనలు కూడా కాస్త తగ్గే అవకాశాలుంటాయి. కానీ కరోనా ప్రభావం మాత్రం హోటల్‌ ఇండస్ట్రీపై ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా మార్చిలో నగరంలో హోటల్స్‌లో 50-55 శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం విధించిన ఆంక్షలు, కరోనా భయం కారణంగా అది 25 శాతం మించడం లేదని ఎక్కువ మంది హోటలీయర్లు చెబుతున్నారు.


వాస్తవం కూడా అంతే! బేగంపేట పరిసరాలలో 180 రూమ్‌లు కలిగిన ఓ హోటల్‌లో ఇప్పుడు కేవలం 25 రూమ్‌లలో మాత్రమే అతిథులు ఉంటే, మాదాపూర్‌లోని 200లకు పైగా రూమ్‌లు కలిగిన ఓ హోటల్‌లో 45, 260కి పైగా రూమ్‌లు కలిగిన హోటల్‌లో 30, గచ్చిబౌలిలో 270కి పైగా రూమ్‌లు కలిగిన హోటల్‌లో 50 రూమ్‌లు మాత్రమే బుక్‌ అవుతున్నాయి. అంతేనా.. సదస్సులతో కళకళలాడే మరో హోటల్‌లో ఆ సదస్సులే లేకపోవడంతో నిర్వహణ కూడా కష్టంగా మారినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయమై ఓ హోటల్‌ మేనేజర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో బంద్‌లు జరిగిన రోజుల్లో కూడా 45 శాతం ఆక్యుపెన్సీ హోటల్స్‌లో కనిపించింది. ఇప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలు, ఆ మహమ్మారి చేస్తోన్న విలయతాండవానికి ప్రతి ఒక్కరూ భయపడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.


అతిథులు సంతోషంగా ఉంటేనే తమ వ్యాపారం నడిచేది. ఆ సంతోషం త్వరలోనే సిద్ధించాలని కోరుకోవడం తప్పా చేసేదేమీ లేదని నిట్టూర్చారు. నగరంలో దాదాపు అన్ని స్టార్స్‌ హోటల్స్‌లోనూ ఆక్యుపెన్సీ పడిపోయిందని, 10-15 రోజులు ఇలానే ఉన్నా తట్టుకోవచ్చేమో కానీ అంతకు మించితే సంక్షోభంలో పడే అవకాశాలు అధికంగానే ఉన్నాయంటున్నారు పలు హోటల్స్‌ మేనేజర్లు.


కార్పొరేట్‌ బుకింగ్స్‌ లేవు.. హోటల్‌ రెంట్లూ తగ్గలేదు...

నగరంలో చాలా వరకూ హోటల్స్‌ కనీసం 60-70 శాతం ఆక్యుపెన్సీతో ఉంటున్నాయంటే కార్పొరేట్‌ కంపెనీల బుకింగ్స్‌ ఓ కారణం. ఫార్మా, ఏవియేషన్‌, ఐటీ తదితర సంస్థలు ఇక్కడ కొలువై ఉండటం, పలు పరిశోధనా సంస్థలూ నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండటం వల్ల కార్పొరేట్‌ బుకింగ్స్‌ పలు హోటల్స్‌లో ఎక్కువగానే ఉంటాయి. అయితే కరోనా ప్రభావం అంతర్జాతీయంగా ఎక్కువ కావడం, పలు దేశాల నుంచి వచ్చే వారికి వీసాలను తాత్కాలికంగా నిలిపివేయడం, మరికొన్ని దేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరుతుండడం వంటి కారణాల వల్ల కార్పొరేట్‌ క్లయింట్స్‌ గతంలో చేసుకున్న బుకింగ్స్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటున్నారు.


సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉద్యోగుల రాకపోకలపైనే ఎక్కువగా ఆధారపడిన మాదాపూర్‌లోని ఓ హోటల్‌ ప్రతినిధి.. తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటున్నారు. కేవలం 10 శాతం ఆక్యుపెన్సీతో హోటల్‌ రన్‌ చేయడం సాధ్యమా..? ఒక్కో గెస్ట్‌కు షిఫ్ట్‌ల వారీగా కనీసం ముగ్గురు పనిచేస్తారు. వీరందరికీ జీతాలు, కరెంట్‌ బిల్లులు తలుచుకుంటేనే భయంగా ఉంది. బ్రేక్‌ ఈవెన్‌ వస్తే చాలని ఒకప్పడు అనుకునేవారం. ఇప్పుడు కనీసం ఉద్యోగుల జీతాలకు వస్తే చాలనుకుంటున్నాం. ఎందుకలా అంటే.. ఈ కరోనా భయం ఎన్నాళ్లు ఉంటుందో తెలియడం లేదు. ప్రజారోగ్యం దృష్ట్యా నిషేధం విధించడం మంచిదే కానీ తట్టుకోవడం తమకు కష్టమే అని చెప్పుకొచ్చారు. అలాగని రూమ్‌ రెంట్లను ఎవరూ తగ్గించకపోవడం విశేషమనే చెప్పాలి. దాదాపు అన్ని హోటల్స్‌ పలు వెబ్‌సైట్‌ల ద్వారా చేసే బుకింగ్స్‌పై కూపన్‌ కోడ్‌లు ఇచ్చి ఆఫర్లు ఇస్తున్నాయి తప్పా నేరుగా రూమ్‌ రెంట్లను తగ్గించింది లేదు.


నిజానికి రాబోయే రోజులన్నీ హోటల్స్‌కు సీజన్‌. ఇప్పుడు రెంట్లు తగ్గించడం ద్వారా అతిథులను ఆకర్షించాలనుకోవడం నేరమే..! అంటున్నారు బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌ పీఆర్‌ ప్రతినిధి. అతనే మాట్లాడుతూ ‘ఓ అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రజలు ఎదుర్కోవాల్సిన అవసరమిప్పుడు ఉంది. కష్టమైనా, నష్టమైనా అందులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిందే..! స్టేజ్‌-2 నుంచి స్టేజ్‌-3కు ఈ వైరస్‌ వెళ్లకుండా అడ్డుకోవాలంటే మన వంతు బాధ్యత తీసుకోవాల్సిందే! అందులో ఇది కూడా ఓ భాగమే’ అని తనదైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.


కరోనా భయాలు అన్ని చోట్లా పెరుగుతున్న వేళ అతిథులకు నమ్మకాన్ని పెంచేందుకు తగిన ఏర్పాట్లను సైతం చేశామంటున్నారు కొన్ని హోటల్స్‌ ప్రతినిధులు. స్వచ్ఛతకు అన్ని హోటల్స్‌ అగ్రతాంబూలం ఇస్తాయనేది కరెక్టే. కానీ ఇప్పుడు హోటల్‌కు ప్రవేశించగానే శానిటైజర్లను అందుబాటులో ఉంచడం, లిఫ్ట్స్‌, రెయిలింగ్స్‌ను తరచుగా శుభ్రపరచడం వంటివి చేస్తున్నాం. అంతేకాదు.. వెజిటేబుల్స్‌, నాన్‌వెజ్‌ ఐటమ్స్‌ను వీలైనంతగా ఫ్రెష్‌గా పర్చేస్‌ చేస్తున్నాం. తద్వారా నాణ్యత మెయింటెన్‌ చేయగలుగుతున్నాం. అలాగే కుకింగ్‌ పరంగా కూడా టెంపరేచర్‌ స్టాండర్స్‌ను కాస్త పెంచాం అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ హోటల్‌ ప్రతినిధి వెల్లడించారు.

- హైదరాబాద్‌ సిటీ, మార్చి17 (ఆంధ్రజ్యోతి) 

Updated Date - 2020-03-18T09:24:28+05:30 IST