బోయిన్‌పల్లిలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-03-21T09:52:16+05:30 IST

సికింద్రాబాద్‌లోని ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో కరోనా కలకలం రేగింది. ఇక్కడి ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఒకరు రెండు రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చారు.

బోయిన్‌పల్లిలో కరోనా కలకలం

 విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి సెల్ఫ్‌  క్వారంటైన్‌

సమాచారం అందించిన స్థానికులు


బోయినపల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):  సికింద్రాబాద్‌లోని ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో కరోనా కలకలం రేగింది. ఇక్కడి ఓ అపార్ట్‌మెంట్‌కు చెందిన ఒకరు రెండు రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చారు. దీంతో సదరు అపార్ట్‌మెంట్‌ వాసులు భయాందోళలకు గురయ్యారు. సదరు వ్యక్తి బయటకు రాకున్నా.. పిల్లలు బయట తిరుగుతుండడంతో వారి భయం మరింత ఎక్కువైంది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఇద్దరు వ్యక్తులు లండన్‌ నుంచి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా,  తమ అపార్ట్‌మెంట్‌లోని వ్యక్తి సైతం అదే విమానంలో ప్రయాణించినట్లు తెలుసుకున్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. శుక్రవారం ఉదయం నుంచే వారంతా తమ తమ స్వస్థలాలకు పరుగులు తీశారు. గమనించిన కొందరు వైద్యాధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ అంజయ్య, వైద్యాధికారులు వచ్చి విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు.


అతను ఇంట్లోని ఓ గదిలో ఏకాంతంగా ఉండడంతో పాటు ఇంట్లో వారితో కూడా వీడియో కాల్‌లోనే మాట్లాడుతున్నట్లు తేలింది. విమానం దిగిన రోజే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అధికారులు స్ర్కీనింగ్‌ టెస్టులు చేయగా అతనికి వైరస్‌ లక్షణాలు లేవని తేలిందని, వైద్యులు, అధికారుల సూచనల మేరకు ఇంట్లో ఏకాంతంగా ఉంటున్నట్లు తెలిపాడు. అధికారులు వెంటనే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించి, విషయం తెలుసుకున్నారు. అక్కడి వారు కూడా నిర్ధారించడంతో సదరు వ్యక్తి బయట తిరగవద్దని సూచించారు. కాలనీవాసులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇచ్చారు.   సదరు వ్యక్తి విషయంలో ఏలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని సీఐ అంజయ్య వివరించారు. అతను వైద్యాధికారుల పర్యవేక్షణలోనే ఉన్నాడని వివరించారు.  

Updated Date - 2020-03-21T09:52:16+05:30 IST