నాలుగు నెలలకు 9,262 కరోనా కేసులు వస్తే.. హైదరాబాద్‌లో 13 రోజులకే ఏకంగా..

ABN , First Publish Date - 2020-07-14T17:30:12+05:30 IST

గ్రేటర్ హైదరాబాద్ లో తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల పాటు ఊరటనిచ్చిన సంఖ్య ఇప్పుడు మళ్లీ వెయ్యికి చేరువైంది.

నాలుగు నెలలకు 9,262 కరోనా కేసులు వస్తే.. హైదరాబాద్‌లో 13 రోజులకే ఏకంగా..

13 రోజులకు 14,959 కరోనా కేసులు.. 

జూలైలో ఉధృతమైన కరోనా

రికార్డు స్థాయిలో కేసులు

తాజాగా 926 మందికి వైరస్..


హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ లో తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల పాటు ఊరటనిచ్చిన సంఖ్య ఇప్పుడు మళ్లీ వెయ్యికి చేరువైంది. సోమవారం తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో 926 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెలలో గడిచిన 13 రోజుల్లోనే గ్రేటర్ లో 14,959 మందికి వైరస్ సోకింది. ఈ నెలలోనే కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంది. కరోనా వైరస్ మొదలైన నాలుగు నెలల (మార్చి నుంచి జూన్) కాలంలో గ్రేటర్ హైదరాబాద్ లో కేసుల సంఖ్య 9,262 కాగా.. ఈ నెలలో కేవలం 13 రోజులకే 14,959 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంటే వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తోందో స్పష్టమవుతోంది. 


మే నెల వరకు కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితమైన కరోనా వైరస్ మెల్లమెల్లగా జూన్ నాటికి ఇతర ప్రాంతాలకు విస్తరించడం మొదలైంది. జూలైలో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం వైరస్ ఆవరించినట్లయింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా చాలా మంది తమ పరిసర ప్రాంతాల్లో ఎందరు పాజిటివ్స్ ఉన్నారో పరిశీలించి నిర్ధారించుకుంటున్నారు. కొందరి అయిదు వందల మీటర్ల పరిధిలోనే రెండు వందలకు మించి పాజిటివ్స్ ఉంటుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వైరస్ ఉందని అనుమానం ఉంటే ఆ వైపు వెళ్లకుండా మరో మార్గం ద్వారా గమ్య స్థానాలకు చేరుకుంటున్నారు. 





Updated Date - 2020-07-14T17:30:12+05:30 IST