కోరలు చాస్తోన్న కరోనా

ABN , First Publish Date - 2020-05-11T09:08:13+05:30 IST

కరోనా కోరలు చాస్తోంది. వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు మృతి చెందారు.

కోరలు చాస్తోన్న కరోనా

ఇద్దరి మృతి.. పలువురికి పాజిటివ్‌


ఆబిడ్స్‌/అఫ్జల్‌గంజ్‌/బర్కత్‌పుర/చాదర్‌ఘాట్‌/వనస్థలిపురం/బౌద్ధనగర్‌/ఎర్రగడ్డ/హైదరాబాద్‌ సిటీ, మే 10 (ఆంధ్రజ్యోతి): కరోనా కోరలు చాస్తోంది. వైరస్‌ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు మృతి చెందారు. పలువురికి ఆదివారం నిర్ధారణ అయింది. కరోనా బారిన పడిన వారి సంఖ్య ఆదివారం ఎక్కువగానే ఉంది. వనస్థలిపురానికి చెందిన వృద్ధురాలికి కరోనా సోకడంతో ఆమె ఇంట్లో పనిమనిషి, డ్రైవర్‌ కూడా వైరస్‌ బారిన పడ్డారు. డ్రైవర్‌ భార్యకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. డబీర్‌పురాలో ఒకే కుటుంబంలో నలుగురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బౌద్ధనగర్‌లో కరోనా బారిన పడిన వ్యక్తి భార్య, కొడుకుకి కూడా వైరస్‌ సోకింది. 


కరోనా వ్యాధితో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జియాగూడ శ్రీసాయినగర్‌కు చెందిన ఓ వ్యాపారి(51) ఆదివారం మృతి చెందాడు. బర్కత్‌పుర చమన్‌ వద్ద గల ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న  విశ్రాంత పోస్టు మాస్టర్‌ జనరల్‌(85)శనివారం రాత్రి చనిపోయారు. మృతుడి కుటుంబానికి చెందిన తొమ్మిది మందిని ఆయుర్వేద ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. వారి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఎవరికైనా పాజిటివ్‌ వస్తే గాంధీ ఆస్పత్రికి లేకపోతే హోం క్వారంటైన్‌లో ఉంచుతామని ఏఎంవోహెచ్‌ డాక్టర్‌ హేమలత తెలిపారు.  


కింగ్‌కోఠి ఆస్పత్రిలో 13 మందికి పాజిటివ్‌ 

కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రికి 34 మంది అనుమానితులు రాగా 13 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 18 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వీరిలో ఇద్దరు గతంలో పాజిటివ్‌ వచ్చిన రోగులు ఉన్నారు. మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది.  


ఇందిరానగర్‌లో మహిళకు..

జియాగూడ ఇందిరానగర్‌కు చెందిన మహిళ(29) అత్తకు నాలుగు రోజుల క్రితం పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కోడలు, కొడుకు, మనవళ్ల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించగా కోడలికి పాజిటివ్‌ వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. 


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కుటుంబంలో ఐదుగురికి 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బేగంబజార్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(45), అతడి తండ్రి(62), తమ్ముడు(28), భార్య(27), ఇద్దరు కుమారులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మిగతా కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌ చేశారు. 


ఓల్డ్‌మలక్‌పేటలో ఒకే ఇంట్లో ముగ్గురికి..

ఓల్డ్‌మలక్‌పేటలో నివసిస్తున్న మహిళ(55)కు గత గురువారం కరోనా పాజిటివ్‌ రాగా ఆమె భర్త, కుమార్తె, కోడలికి వైరస్‌ సోకింది. ఆమెకు జ్వరం వచ్చినప్పుడు చికిత్స చేసిన వైద్యుడికి, ఆమె కుమారుడు, ఇద్దరు మనవళ్లకు నెగెటివ్‌ వచ్చిందని వైద్యులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన ముగ్గురిని చార్మినార్‌లోని ప్రభుత్వ యునాని ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగజ్‌ కార్ఖానాలేన్‌లోని వారి నివాస ప్రాంతాన్ని కట్టడి ప్రాంతంగా అధికారులు ప్రకటించారు.  


డబీర్‌పురాలో ఒకే ఇంట్లో నలుగురికి పాజిటివ్‌ 

డబీర్‌పురాలోని బీబీకాఅల్వాలో నివసిస్తున్న ఒకే ఇంట్లో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఈ నెల 4వ తేదీన అదే ఇంట్లోని వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా తల్లి, ముగ్గురు కుమార్తెలకు పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి భార్యకు మాత్రం నెగెటివ్‌ వచ్చింది. బీబీకా అల్వాను కట్టడి ప్రాంతంగా అధికారులు ప్రకటించారు.  


వనస్థలిపురంలో మరో ముగ్గురికి.. 

వనస్థలిపురం హుడాసాయినగర్‌ కాలనీకి చెందిన వృద్ధురాలి(65) ఇంట్లో పనిమనిషి(40)తోపాటు ఆమెను కారులో ఆస్పత్రికి తరలించిన డ్రైవర్‌(45), అతడి భార్య(38)కూ కరోనా వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. పనిమనిషి వృద్ధురాలితోపాటు మరో ముగ్గురి ఇళ్లలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పనిమనిషికి సెకండరీ కాంటాక్టుగా ఉన్న 17 మంది నమూనాలు సేకరించినట్లు జిల్లా అసిస్టెంట్‌ వైద్యాధికారి భీమానాయక్‌ తెలిపారు.  


బౌద్ధనగర్‌లో మరో రెండు పాజిటివ్‌ కేసులు 

సికింద్రాబాద్‌ వారాసిగూడ బౌద్ధనగర్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి(56)కి ఏప్రిల్‌ 28న కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆయన కుటుంబసభ్యులతోపాటు మరో ముగ్గురికి వైద్య పరీక్షలు చేయగా భార్య(48), కుమారుడు(27)కి పాజిటివ్‌ వచ్చింది. వీరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 


 చెస్ట్‌ ఆస్పత్రిలో ఏడుగురు అనుమానితులు

ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిలో ఏడుగురు కరోనా అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ఓపీకి ఏడుగురు రాగా వీరిలో అనుమానంగా ఉన్న నలుగురిని అడ్మిట్‌ చేసుకున్నారు. గతంలో చికిత్స పొందుతున్న ఒకరికి పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరొకరికి నెగెటివ్‌ రావడంతో డిశ్చార్జి చేసినట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ ఖాన్‌ తెలిపారు.


ఫీవర్‌ ఆస్పత్రిలో...

నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో ఆదివారం ఒకే ఒక అనుమానిత కేసు నమోదైంది. అతడిని ఐసోలేషన్‌ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. 


పెరుగుతున్న అనుమానిత కేసులు

మెహిదీపట్నం/బర్కత్‌పుర/అంబర్‌పేట/ముషీరాబాద్‌/రామంతాపూర్‌/ఎర్రగడ్డ, మే 10 (ఆంధ్రజ్యోతి): నగరంలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్ని కట్టడి ప్రాంతాలను తొలగిస్తున్నారు. వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నారు.  


‘సరోజినీదేవి’ ఐసోలేషన్‌కు తాకిడి 

సరోజినిదేవి ఆస్పత్రి ఐసోలేషన్‌కు కరోనా అనుమానితుల తాకిడి పెరిగింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 57 మంది ఉండగా ఇంకా వస్తూనే ఉన్నారని డాక్టర్‌ అనురాధ తెలిపారు.


గోల్కొండలో.. 

గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో పది పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. రాఘవకాలనీ, ఎండీలైన్స్‌, గుల్షన్‌కాలనీ, రేతీగల్లీ ప్రాంతాల్లో కట్టడి కొనసాగుతోందని పేర్కొన్నారు. 


ముషీరాబాద్‌ దయారాకమాన్‌ వద్ద కట్టడి 

ముషీరాబాద్‌ దయారాకమాన్‌ వద్ద వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతడు నివసించే పరిసర ప్రాంతాలను కట్టడి చేసేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది బారికేడ్లు ఏర్పాటు చేశారు. భోలక్‌పూర్‌ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ కృష్ణమోహన్‌ సారథ్యంలో సూపర్‌వైజర్‌ డాక్టర్‌ అనురాధ, పీహెచ్‌ఎం భాగ్యలక్ష్మి, ఏఎన్‌ఎం పద్మలత, సునీత 1,200 ఇళ్లలో నివసించే వారికి వైద్యపరీక్షలు చేశారు. 


హోమియోపతి ఆస్పత్రి ఐసోలేషన్‌ ఖాళీ 

కరోనా అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన రామంతాపూర్‌ ప్రభుత్వ హోమియోపతి ఆస్పత్రి ఐసోలేషన్‌ కేంద్రం ఆదివారం ఖాళీ అయింది. పాజిటివ్‌గా తేలిన వారిని గాంధీ ఆస్పత్రికి, నెగెటివ్‌ వచ్చిన వారిని ఇంటికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. శ్రీరమణపురం, నవరంగ్‌గూడ, పాశం సత్తయ్య కాలనీల్లో కరోనా వైరస్‌ సోకిన వారి కుటుంబ సభ్యులను రెండో దఫా వైద్య పరీక్షల కోసం అధికారులు తరలించారు. పరీక్షల ఫలితాల అనంతరం కట్టడి ప్రాంతాల తొలగింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 


ఆయుర్వేద ఆస్పత్రిలో.. 

ఆయుర్వేద ఆస్పత్రి ఓపీకి 50 మంది రాగా వారి నమూనాలు తీసుకొని పరీక్షకు పంపించామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పరమేశ్వర్‌నాయక్‌ తెలిపారు. 


నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిలో..

నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిలో 142 మంది అనుమానితులకు చికిత్స అందిస్తుండగా.. ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.


అంబర్‌పేటలో 17 మంది అనుమానితులు 

అంబర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో 17 మంది కరోనా అనుమానితులను జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించి ఆయుర్వేద ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ మాట్లాడుతూ.. చెన్నారెడ్డినగర్‌లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 


కాచిగూడ ఓయో హోటల్‌లో ఐసోలేషన్‌ కేంద్రం

 అపోలో ఆస్పత్రి సహకారంతో కాచిగూడ కుమార్‌ థియేటర్‌ సమీపంలోని ఓయో హోటల్‌లో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోని 109 గదులను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చారు. ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డులో 94 మందిని ఉంచారు. పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతరులను హోటల్‌లోకి అనుమతించడం లేదు. 


రాజేంద్రనగర్‌లో 8 క్వారంటైన్‌ సెంటర్లు

రాజేంద్రనగర్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ప్రభుత్వ సంస్థల్లో ఏర్పాటుచేసిన ఎనిమిది క్వారంటైన్‌ కేంద్రాల్లో సుమారు 1,290 మంది ఉండటానికి వీలుగా అధికారులు బెడ్లు సిద్ధం చేశారు. రంగారెడ్జి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పర్యవేక్షణలో రాజేంద్రనగర్‌ ఆర్డీవో కె.చంద్రకళ, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌గౌడ్‌ ఆయా సెంటర్లలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విదేశాల నుంచి శనివారం నగరానికి వచ్చిన వారు ప్రభుత్వ క్వారంటైన్‌ సెంటర్లలో ఉండటానికి ఇష్టపడలేదు. వారందరూ కాచిగూడ, శేరిలింగంపల్లిలోని హోటల్స్‌లో ఉండటానికి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. 


క్వారంటైన్‌ సెంటర్లు ఇవే..

రాజేంద్రనగర్‌లోని ఎక్స్‌టెన్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (ఈటీసీ)లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో 91 గదుల్లో  100 పడకలు ఉన్నాయి. హిమాయత్‌సాగర్‌లోని వాటర్‌ అండ్‌ ల్యాండ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(వాలంతరీ)లో 100 గదులు ఉండగా ఇక్కడ 130 బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌)లో 60 గదుల్లో 120 బెడ్లు ఉన్నాయి.


నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ (నార్మ్‌)లో 100 గదులు, 200 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌లో 200 గదులు, 240 బెడ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీఎ్‌సఐఆర్‌డీ), తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు (టీఎస్‌ క్యాబ్‌)లో 300 గదులు, 400 బెడ్‌లు అందుబాటులో ఉంచారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐపీహెచ్‌ఎం)లో 100 గదులు 100 పడకలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-05-11T09:08:13+05:30 IST