మమ్మల్ని పట్టించుకోండి..

ABN , First Publish Date - 2020-04-12T09:31:50+05:30 IST

కరోనా నేపథ్యంలో నగరంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మమ్మల్ని పట్టించుకోండి..

అత్యవసర  సేవలు అందించాలి 

‘ఆంధ్రజ్యోతి’కి పలువురి ఫోన్‌కాల్స్‌


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌11 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో నగరంలో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి నుంచి హాస్పిటల్‌ వరకు సమస్యలతో కష్టాలు పడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరవాసుల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘లాక్‌డౌన్‌ కష్టాలా..? మా దృష్టికి తీసుకురండి’ అంటూ ఆంధ్రజ్యోతి ప్రారంభించిన శీర్షికకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా శనివారం నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను ‘ఆంధ్రజ్యోతి’కి తెలియజేశారు.


నగరంలోని కొత్తపేట హుడా కాంప్లెక్స్‌ పరిధిలో నివాసముంటున్న సాజీదా కొన్ని నెలలుగా ఓవర్‌ బ్లీడింగ్‌, మూత్ర సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. సమస్యను తగ్గించుకునేందుకు కొద్ది రోజులుగా ఆమె కొత్తపేటలోని ఓమ్నీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. మార్చి 27న ఆపరేషన్‌ చేస్తామని చెప్పినా లాక్‌డౌన్‌తో హాస్పిటల్‌ మూతపడింది. దీంతో సాజీదా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోంది. ప్రభుత్వం అత్యవసర రోగులు, ఆపరేషన్లను పట్టించుకోవాలని బాధిరాలు కోరారు. వారు సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌ 93470 91554.


బియ్యం అందడం లేదు...

తెల్ల రేషన్‌ కార్డు ఉన్నప్పటికీ అధికారులు బియ్యం ఇవ్వడం లేదు. లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా బియ్యం లేకపోతే ఏం తినాలని ప్రజలు అడుగుతున్నారు. నగరానికి చెందిన ఇద్దరు బాధితులు ఫిర్యాదులు చేశారు. వారి ఫోన్‌ నెంబర్లు 80967 31186, 99666 69168. నిజాంపేట విజయపురి కాలనీ నుంచి అంభీర్‌ చెరువుకు వెళ్లే మురుగుకాల్వ నుంచి విపరీతమైన దుర్వాసన వస్తోందని, దోమలతో ఇబ్బంది పడుతున్నామని, చెత్తను తొలగించి, క్రిమి సంహారక మందులను తక్షణమే పిచికారి చేయాలని స్థానికులు కోరారు. ఫిర్యాదు చేసినవారి ఫోన్‌ నెంబర్లు 8008266133, 9951750915.


కుషాయిగూడలోని సూపర్‌మార్కెట్‌లో వస్తువులు కొనేందుకు వెళ్లిన వారికి కొత్త సమస్య ఎదురవుతోంది. సర్జికల్‌ మాస్కులు ఉంటేనే లోపలికి రావాలని చెబుతున్నారని వినియోగదారుడు తెలిపారు. అలాగే నగరంలోని ఓ వ్యక్తి ఇల్లు మారదామని కొత్త ఇంటికి అడ్వాన్స్‌ ఇచ్చాడు. ఈ సమయంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో ఇప్పుడు తాను రెండు ఇళ్లకు అద్దె కట్టాల్సి వస్తోందని, జీతాలు సరిగా రాని ఈ సమయంలో ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు అదేపనిగా బయటకు వస్తున్నారు. వారికి అవసరమైన కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువులను ఒక్కో కాలనీకి పంపితే ప్రజలు బయటకొచ్చే అవకాశం ఉండదని మరొకరు కోరారు. 


కరోనా కష్టాలా..? మా దృష్టికి తీసుకురండి..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నగరవాసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావాలని సంకల్పించింది. ఎవరికైనా ఇబ్బంది కలిగితే మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారికి సమాచారం ఇవ్వడంతోపాటు పత్రికలో ప్రచురిస్తాం. మీ కష్టాలను మా వాట్సాప్‌ నంబర్‌: 9985411079కు పంపించగలరు. మీ పూర్తి వివరాలు కూడా వాట్స్‌పలో పొందుపర్చగలరు. 


ఇండోనేషియాలో ఉన్నాం.. ఇండియాకు తీసుకెళ్లండి

ఫోన్‌ ద్వారా ఆంధ్రజ్యోతిని సంప్రదించిన రాజశేఖర్‌


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌11 (ఆంధ్రజ్యోతి): ఆఫీస్‌ పని మీద ఇండోనేషియాకు వచ్చాను. మార్చి 15న భారత్‌కు రావాల్సి ఉండే. కానీ.. విమానయానంతో కరోనా వైరస్‌ సోకే ప్రమాదముందని ఆగిపోయా. ఆ తరువాత లాక్‌డౌన్‌ ప్రకటించారు. అప్పటి నుంచి ఇండోనేషియాలోనే ఉం టున్నా. ఇక్కడ మరికొందరు భారతీయులున్నారు. విపత్కర పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇండోనేషియాలో కూడా లాక్‌డౌన్‌ మరింత పటిష్ఠం చేస్తారట.


అదే జరిగితే ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయేమో. ఇండోనేషియాలో ఉండే వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడి భారత్‌ ఏంబసీ ప్రతినిధులను సంప్రదిస్తున్నాం. వారి నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.

Updated Date - 2020-04-12T09:31:50+05:30 IST