గ్రేటర్‌లో కరోనా తీవ్రత తగ్గుదల
ABN , First Publish Date - 2020-11-25T05:56:31+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజా పరీక్షల్లో కొత్తగా 129 కేసులు నిర్ధారణ అయినట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

హైదరాబాద్ సిటీ, నవంబర్ 23 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజా పరీక్షల్లో కొత్తగా 129 కేసులు నిర్ధారణ అయినట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. గత నెల వరకు రోజుకు సగటున 250కి మించి కేసులు రాగా, ఈ నెలలో మాత్రం రోజుకు అత్యధికంగా 197 కేసులు మాత్రమే వెలుగుచూశాయి. గతంలో వేలల్లో నమోదైన కరోనా కేసులు నేడు వందల సంఖ్యకు తగ్గాయి. నెలల తరబడి నగర వాసులను వణికించిన వైరస్ ఇప్పుడు కొంచెం నెమ్మదించినట్లే కనిపిస్తోంది. అయితే.. ముందున్నది చలికాలం కావడంతో వాతావరణం వైరస్‌కు అనుకూలంగా మారుతుందని, ప్రజలు అప్రమత్తతను వీడొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతున్నాయని అజాగ్రత్తగా ఉంటే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్ తీవ్రత చలికాలంలో అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం, సబ్బుతో చేతులు శుభ్రంగా కడుకోవడం వంటి జాగ్రత్తలను విడిచిపెట్టకూడదని సూచిస్తున్నారు. గడచిన వారం రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 200లోపు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆస్పత్రులకు వచ్చే కేసులు కూడా చాలా వరకు తగ్గాయి. చాలామంది హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 300లోపు మాత్రమే ఇన్‌పేషంట్లు ఉంటున్నారు. ఇక చెస్ట్ ఆస్పత్రి, కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో కూడా రోగుల సంఖ్య తక్కువగానే ఉంది. కరోనా పరీక్ష కేంద్రాల్లో జనం రోజుకు 50మందికిలోపే ఉంటున్నారు. యాంటీజెన్ ర్యాపిడ్ పరీక్షల కోసం గతంలో ఉదయం నుంచే క్యూ కట్టే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ నెల 10 నుంచి ప్రతిరోజూ నమోదైన కేసుల సంఖ్య వరసగా చూస్తే.. 192, 172, 169, 232, 167, 141, 150, 154, 168, 154, 161, 129గా ఉన్నాయి. గడచిన 22 రోజుల్లో మొత్తంగా 4325 మందికి కరోనా సోకింది.