‘‘కంటోన్మెంట్’’కారులో కలవరం..!
ABN , First Publish Date - 2020-12-15T06:36:21+05:30 IST
‘‘కంటోన్మెంట్’’కారులో కలవరం..!

- పాలకమండలి సభ్యులకు కొత్త గుబులు
- మళ్లీ అవకాశం దక్కడంపై అనుమానాలు
- జీహెచ్‌ఎంసీ సిట్టింగ్ కార్పొరేటర్ల ఓటమి
- బోర్డుపై ప్రభావం చూపుతుందని చర్చలు
సికింద్రాబాద్, డిసెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార పక్షానికి చెందిన సిటింగ్ కార్పొరేటర్లు ఓడిపోవడం.... సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సభ్యుల్లో కలవరం సృష్టిస్తోంది. కాగా, ఈ ఫలితాలు వార్డుల నుంచి టికెట్ల కోసం ఉవ్విళ్లూరుతున్న ఇతర నేతల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. టీఆర్‌ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లు ఓడిపోవడం బోర్డు సభ్యులకు ఆందోళనను, గులాబీ పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారికి ఆనందాన్ని ఇవ్వడమేంటబ్బా....! అని ఆశ్చర్యపోతున్నారా?. అసలు విషయం ఏమిటంటే.. ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ కార్పొరేటర్లలో చాలా మంది ఓటమి చవి చూశారు. సిట్టింగ్‌లను మార్చిన చోట గులాబీ పతాకం రెపరెపలాడిందంటూ విశ్లేషణలు వెలువడ్డాయి. ఈ పరిణామాలు కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి సభ్యుల్లో గుబులు రేపుతుండగా, వారి స్థానంలో టికెట్లు ఆశిస్తున్న ఇతర నేతలకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరి నెలతో ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం ముగియనున్నందున, ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్లీ తమకు అవకాశం వస్తుందని ఆశ పడుతున్న సిట్టింగ్ సభ్యుల్లో ఆందోళన కనిపిస్తోంది. కంటోన్మెంట్‌లోని మొత్తం 8 వార్డుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలక మండలి సభ్యులలో ఏడుగురు ప్రస్తుతం గులాబీ పార్టీలోనే ఉన్నారు. పాలక మండలికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న సభ్యులు ఇటీవలి కాలంలో ప్రారంభోత్సవాలపై దృష్టి సారించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని స్థానిక శాసనసభ్యుడు జి.సాయన్న, మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి మర్రి రాజశేఖరరెడ్డి, బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ టి.ఎన్.శ్రీనివా్‌సలను ఆహ్వానిస్తూ, ఆయా వార్డుల్లో అభివృద్ధి పనులను ముమ్మరం చేయడంపై దృష్టి సారించారు. అయితే ఆయా వార్డుల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి వారు తమ గాడ్‌ఫాదర్ల చుట్లూ చక్కర్లు కొడుతున్నారు. ‘సిట్టింగ్ సభ్యులు ఉన్నారు కదా... వారిని కాదని మీకెలా అవకాశం కల్పించేది’ అని ప్రశ్నిస్తున్న గాడ్‌ఫాదర్లకు గ్రేటర్‌లో సిట్టింగ్‌ల ఓటమిని గుర్తు చేస్తున్నారు. ఫలానా వార్డుకు చెందిన సభ్యుడి పని తీరు బాగా లేదని, మళ్లీ టిక్కెట్ ఇస్తే ఓటమి తథ్యమని, కావాలంటే సర్వే జరిపించండంటూ సవాలు విసురుతున్నారు.
బీజేపీ వైపు నాయకుల చూపు..
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయాలపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు పెను ప్రభావం చూపనున్నాయి. కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏకైౖక డివిజన్‌గా ఉన్న మోండా మార్కెట్‌ను కాషాయ పార్టీ భారీ మెజారిటీతో కైవసం చేసుకోవడం, మునుపెన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడం కంటోన్మెంట్ రాజకీయాలను కుదిపేశాయి. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కమలానికి స్థానమే లేదని, బీజేపీ ప్రభావం శూన్యమని పదే పదే ప్రకటనలు చేసిన టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన బోర్డు పాలక మండలి సభ్యులు, ఇతర నేతలను ఎన్నికల ఫలితాలు విస్మయపరిచాయి. మరోవైపు బీజేపీలో నూతనోత్తేజాన్ని నింపా యి. ముఖ్యంగా కంటోన్మెంట్‌లో కాలనీలు, అపార్ట్‌మెంట్లు అధిక సంఖ్యలో ఉండడం, విద్యావంతులు, యువకులు ఎక్కువ శాతం ఉండడంతో రాబోయే బోర్డు పాలక మండలి ఎన్నికల్లో కమలం వికసిస్తుందని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీంతో కాషాయ కండువా కప్పుకునేందుకు అన్ని పార్టీల నుంచీ క్యూ కట్టడం ఖాయమని నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, 5వ వార్డు సభ్యుడు జె.రామకృష్ణ, మరో మాజీ ఉపాధ్యక్షురాలు బాణుక నర్మద, మల్లికార్జున్ దంపతులు బీజేపీలో చేరారు. బోర్డులోని అన్ని వార్డుల నుంచీ పాలక మండలి సభ్యులు టీఆర్‌ఎ్‌సకు చెందిన వారే. స్థానిక శాసనసభ్యుడు కూడా గులాబీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ స్థానికంగా బీజేపీకి సమర్థవంతమైన నాయకత్వం, కేడర్ పెద్దగా లేదు. అయితే గ్రేటర్ ఎన్నికల ఫలితాల ఊపులో వీటిని అధిగమించే దిశగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందని పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఆశిస్తున్నారు.
నేతల సంప్రదింపులు
మోండామార్కెట్ డివిజన్ బీజేపీ టికెట్‌ను కొంతం దీపికకు ఇప్పించడంలో, ఆమెను గెలిపించడంలో చురుకైన పాత్ర పోషించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆప్తుడు ఆకుల నాగే్‌షతో వివిధ పార్టీల నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీ పెద్దలతో మాట్లాడి, తమకు సముచిత స్థానం కల్పిస్తే కాషాయ కండువా కప్పుకుంటామని ప్రతిపాదిస్తున్నారు.
కమలం గూటికి జంపన!
సికింద్రాబాద్, డిసెంబర్ 14(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాజకీయాలపై గట్టి పట్టున్న బోర్డు పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఏడాది కాలంగా బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటి వరకూ వేచి చూసే ధోరణి అవలంబించిన జంపన తాజాగా అందుకు సమ్మతి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఓబీసీ సెల్ చైర్మన్ డాక్టర్ కె.లక్ష్మణ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు బి.శ్యాంసుందర్‌గౌడ్ తదితర ముఖ్య నేతలను కలిసి, పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నగరంలో లేకపోవడంతో ఒకటి, రెండు రోజుల్లో ఆయనను కలిసి, ఆ తర్వాత పార్టీలో చేరే తేదీ ఖరారు చేసుకునే యోచనలో జంపన ఉన్నట్టు సమాచారం. దివంగత నేత పీజేఆర్ శిష్యుడిగా, డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న జంపన ప్రతాప్ 90వ దశకం నుంచి కంటోన్మెంట్ రాజకీయాలపై పట్టు కలిగి ఉన్నారు. బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షునిగా, నామినేటెడ్ సభ్యుడిగా పదవులు నిర్వహించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎ్‌సలో ఉన్న జంపన..... తాజాగా బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు.