చెరువులకు చెర..అపార్ట్‌మెంట్లు, ఇళ్ల నిర్మాణం
ABN , First Publish Date - 2020-08-22T09:35:31+05:30 IST
బాలాపూర్ మండలంలో నాలుగు చెరువులు కబ్జా అయ్యాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఆయా ప్రాంతాల్లోని
హైదరాబాద్ సిటీ నెట్‌వర్క్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): బాలాపూర్ మండలంలో నాలుగు చెరువులు కబ్జా అయ్యాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఆయా ప్రాంతాల్లోని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. శేరిలింగంపల్లిలో చెరువును ఆక్రమించినా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. పటేల్ చెరువులో ప్రస్తుతం ఉన్నంత వరకే సుందరీకరణ పనులు చేపట్టారు. వర్షాలు వచ్చినప్పుడు రాయదుర్గం, గచ్చిబౌలిలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతోపాటు రోడ్లన్నీ జలమయమవుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
బాలాపూర్ మండలంలోని మీర్‌పేట, జిల్లెలగూడ గ్రామాల్లో గల నాలుగు ప్రధాన చెరువులు కబ్జాకు గురయ్యాయి.
లెనిన్‌నగర్‌లోని దాదాపు 30 ఎకరాల విస్తీర్ణం గల తాళ్ల చెరువు పూర్తిగా నివాస గృహాలతో నిండిపోయింది. నీరు నిలిచేందుకు గజం స్థలం కూడ లేదు. స్థానిక నాయకులు కొందరు కబ్జాదారుల అవతారమెత్తి ప్లాట్లుగా విభజించి సొమ్ము చేసుకున్నారు.
మీర్‌పేటలోని పెద్దచెరువులో సగ భాగం బడంగ్‌పేట, అల్మా్‌సగూడకు చెందిన కబ్జాదారులు ఆక్రమించి వెంచర్లు చేయడంతో చెరువు విస్తీర్ణం సగానికి తగ్గింది. భారీ వర్షాలు కురిసినప్పుడు కబ్జా ప్రాంతంలోని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి.
మీర్‌పేటలోని మంత్రాల చెరువుదీ ఇదే పరిస్థితి. దాదాపు 40 ఎకరాల వాస్తవ విస్తీర్ణం కలిగి ఉన్న ఈ చెరువు ఇప్పుడు కేవలం 15 ఎకరాల్లో మాత్రమే దర్శనమిస్తోంది. చెరువును ఆనుకొని నిర్మాణాలు వెలిశాయి.
జిల్లెలగూడలోని చందచెరువు సుమారు 35 ఎకరాల విస్తీర్ణాన్ని కలిగి ఉండగా, ఎఫ్‌టీఎల్‌ను కబ్జాదారులు చెరబట్టడంతో 15ఎకరాలు మాత్రమే మిగిలింది.
సగానికిపైగా ఆక్రమణ
శేరిలింగంపల్లి నియోజకవర్గం గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి గాంచింది. దాదాపు 70కిపైగా చెరువులు ఉన్నప్పటికీ రియల్ వ్యాపారులు, భూకబ్జాదారుల కబంద హస్తాల్లో కనుమరుగై చెరువుల ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. సర్వే నంబర్ 70లోని పటేల్ చెరువు 38.20 ఎకరాల విస్తీరణంలో ఉండేది. 10 నుంచి 15 ఎకరాల భూమిని కబ్జాచేసి అన్యాక్రాంతం చేశారు. ఆక్రమణల జోలికి వెళ్లకుండా ఉన్న చెరువు వరకే కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు చేపట్టారు. చందానగర్ గంగారం చెరువు డివిజన్‌లోనే అతిపెద్దచెరువు. సర్వే నంబర్ 12లో పెద్దచెరువు 61.19 ఎకరాల్లో విస్తరించి ఉండగా సుమారు 15 ఎకరాలు కబ్జా అయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు
మాదాపూర్ హైటెక్‌సిటీ ప్రాంతంలోని గుట్టలబేగంపేటలో 20.19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మేడికుంట చెరువులో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. దుర్గంచెరువు పరీవాహక ప్రాంతంలోని శిఖం భూమిలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.
రాయదుర్గంలోని మల్కంచెరువు, ఖాజాగూడ పెద్దచెరువు, ఎల్లమ్మచెరువు, భగీరథ చెరువు, మేడికుంట, రంగ్‌లాల్‌కుంట, గోసాయికుంట, మొండికుంట, ఎర్రకుంట, చెరువులు కబ్జా అయ్యాయి. గచ్చిబౌలి నాలా ఆక్రమణలతో కుంచించుకుపోయింది. చిన్నపాటి వర్షానికే గుల్షన్‌నగర్, గచ్చిబౌలి గ్రామంలో ఇళ్లలోకి మురుగునీరు వస్తోంది. గౌలిదొడ్డిలోని గోసాయికుంట అలుగు స్థలం కబ్జా అవడంతో చెరువు నీరు బయటకు వెళ్లేమార్గం లేకుండాపోయింది. ఖాజాగూడ పెద్దచెరువు, ఎల్లమ్మచెరువు శిఖం స్థలాలు కబ్జా అయ్యాయి.