ఆస్ట్రేలియా నుంచి వచ్చి.. ఆస్పత్రికి వెళ్తానన్నా..
ABN , First Publish Date - 2020-03-24T09:42:15+05:30 IST
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ యువకుడు క్వారెంటైన్‌కు వెళ్తానని స్వచ్ఛందంగా ప్రయత్నించినా అధికారులు, టోల్‌ఫ్రీ సిబ్బంది స్పందించలేదు.

స్పందించని అధికారులు, టోల్ ఫ్రీ
‘ఆంధ్రజ్యోతి’ చొరవతో ఆస్పత్రికి..
చాదర్‌ఘాట్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ యువకుడు క్వారెంటైన్‌కు వెళ్తానని స్వచ్ఛందంగా ప్రయత్నించినా అధికారులు, టోల్‌ఫ్రీ సిబ్బంది స్పందించలేదు. దీంతో రెండు గంటలపాటు బాధితుడు రోడ్డుపైనే తన కారులో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో చివరికి ఆస్పత్రికి తరలించారు. సైదాబాద్ ఎస్‌బీహెచ్‌సీ కాలనీకి చెందిన యువకుడు (35) ఆస్ట్రేలియాలో ఎంఎస్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి కేరళ త్రివేండ్రం విమానాశ్రయంలో దిగాడు. అక్కడ నామమాత్రపు తనిఖీలతో డొమోస్టిక్ విమానంలో సోమవారం వేకువజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు.
ఇంటికి క్యాబ్‌లో చేరుకున్నాడు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా అపార్ట్‌మెంట్‌వాసులు అభ్యంతరం తెలిపారు. ఆస్పత్రికి వెళ్లాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆ యువకుడు సైదాబాద్ పోలీసులను సంప్రదించగా పట్టించుకోలేదు. ముసారాంబాగ్‌లోని స్నేహితుడి ఇంటికి వెళ్లగా అతనూ లోనికి రానివ్వలేదు. దీంతో అక్కడే కారులో ఉండిపోయాడు. సదరు యువకుడి మొబైల్‌లో కేవలం వాట్సాప్ సౌకర్యం మాత్రమే ఉంది. దాంతోనే జీహెచ్‌ఎంసీ, 104కు, 100కు, వైద్య ఆరోగ్య శాఖ టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించగా, ఎలాంటి స్పందన రాలేదు. స్థానికుల ద్వారా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి సమాచారం అందగా, ఆయన పోలీసుల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు తన సిబ్బందితో యువకుడు ఉన్న చోటుకు వెళ్లి ఆస్పత్రి తరలించే ఏర్పాట్లు చేశారు.