ఫార్మా పరిశ్రమల రసాయనాలతో ఉక్కిరిబిక్కిరి

ABN , First Publish Date - 2020-09-13T08:52:42+05:30 IST

ఐడీఏబొల్లా రం పారిశ్రామికవాడకు సమీపంలో ఉన్న అనేక ప్రాంతాలు విష రసాయనాల వాయువులతో ..

ఫార్మా పరిశ్రమల రసాయనాలతో ఉక్కిరిబిక్కిరి

శ్వాసకోశ, చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు 

మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో ఫిర్యాదు 

నాలుగు మొబైల్‌ ఎయిర్‌ మానిటరింగ్‌ బృందాలతో పరిశోధిస్తున్నాం: ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ రవికుమార్‌ 


మియాపూర్‌, సెప్టెంబర్‌ 12(ఆంధ్రజ్యోతి): ఐడీఏబొల్లా రం పారిశ్రామికవాడకు సమీపంలో ఉన్న అనేక ప్రాంతాలు విష రసాయనాల వాయువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. అసలే శ్వాసకోశ వ్యాధులతో పాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వారికి ఇది మరో శాపంగా మారింది. ఇటీవల మంత్రి కేటీఆర్‌కు మియాపూర్‌ మయూరినగర్‌కు చెందిన మల్లారెడ్డి రూప ట్విట్టర్‌ ద్వారా అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున ఐడీఏబొల్లారానికి చెందిన వివిధ పరిశ్రమల ద్వారా వస్తున్న విష రసాయన వాసనలతో చెడుగాలిని పీల్చలేక శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నామని, కంటిమీద కునుకులేకుండా ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదు చేశారు. వాస్తవానికి అనేక సంవత్సరాలుగా ఫార్మాహబ్‌గా ఉన్న ఈ ప్రాంతంలో రాత్రి, తెల్లవారుజాము న విషవాయువులను వదలడం ఇక్కడ కంపెనీలకు అలవాటుగా మారింది. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోపక్క ఐడీఏబొల్లారం, బాచుపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పరిసరాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు, కాలనీలు ఫార్మా కంపెనీలకు ఆనుకుని ఉన్నాయి.


మియాపూర్‌ పరిసర ప్రాంతాల్లోని రెడ్డిఎన్‌క్లేవ్‌, అమీన్‌పూర్‌, మక్తామహబూబ్‌పేట, హెచ్‌ఎంటీస్వర్ణపురి, లక్ష్మీనగర్‌, న్యూ కాలనీ, జేపీనగర్‌ వంటి ప్రాంతాల్లో విషవాయువులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఉండేవారు ధర్నాలు చేసినా, కాలుష్యనియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ప్రజల ప్రాణాల కు నష్టం కలగకుండా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలని పలుకాలనీలకు చెందిన సంక్షేమ సంఘా లు, ప్రజలు కోరుతున్నారు. 


మంత్రి కేటీఆర్‌కు విషవాయువుల గురించి ట్విట్‌చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. నిన్న తెల్లవారుజామున విషవాయువులు కమ్మిన విషయం మాదృష్టికి వచ్చింది. ఫార్మాకంపెనీల్లో ఏ కంపెనీ నుంచి రసాయన వాయువు వదిలారో పరిశోధన చేస్తు న్నాం. ప్రధానంగా నాలుగు మొబైల్‌ ఎయిర్‌మానిటరింగ్‌ బృందాలను ఏర్పాటు చేసి ఫార్మా కంపెనీని పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాం. త్వరలోనే విషవాయువులు వదిలిన వారిపై చర్యలు తీసుకుంటాం. 

-రవికుమార్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌, ఐడీఏబొల్లారం 

Updated Date - 2020-09-13T08:52:42+05:30 IST