రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాకు గండికొట్టారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-12-11T19:59:16+05:30 IST

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడిని చంద్రబాబు ఖండించారు.

రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాకు గండికొట్టారు: చంద్రబాబు

అమరావతి: చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలపై దాడిని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు ఖండించారు. పరామర్శకు వెళ్తున్న నాయకులపై దాడి చేయడం గర్హనీయమన్నారు. జగన్ ఫాసిస్ట్ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాకు గండికొట్టారని, తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల నుంచి ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొందరు రెచ్చగొట్టి మరీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే గుంటూరు, విజయవాడ, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగిన విషయం విదితమే. తాజాగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట వద్ద టీడీపీ నాయకుల వాహనాలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. అంతేకాదు.. వాహనాలపై దాడికి కూడా వైసీపీ శ్రేణులు ప్రయత్నించాయి.


తంబళ్లపల్లిలో పర్యటన నిమిత్తం  రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, పీలేరు నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బయలుదేరారు. ముందుగానే ప్లాన్‌తో వచ్చిన వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతల వాహనాలను అడ్డుకున్నాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతల రెండు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కిషోర్‌కు అడ్డుగా నిలవడంతో నేతలకు ఎవరికీ ఏమీ కాలేదు.

Updated Date - 2020-12-11T19:59:16+05:30 IST