అమ్మ లేనిదే.. సృష్టి లేదు
ABN , First Publish Date - 2020-03-11T09:14:15+05:30 IST
సృష్టికి మూలం అమ్మ.. మహిళ లేనిదే ఈ ప్రపంచం లేదు. లోకంలో ఎన్నో బంధాలు, అనుబంధాలకు ప్రతిరూపం మహిళ. తల్లిగా, చెల్లిగా, కూతురిగా, భార్యగా ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తోంది.
మహిళలందరూ ఆనందంగా ఉండాలి : సీపీ సజ్జనార్
సైబరాబాద్ కమిషనరేట్‌లో ఘనంగా మహిళా దినోత్సవం, హోలీ సంబరాలు
హైదరాబాద్ సిటీ, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): సృష్టికి మూలం అమ్మ.. మహిళ లేనిదే ఈ ప్రపంచం లేదు. లోకంలో ఎన్నో బంధాలు, అనుబంధాలకు ప్రతిరూపం మహిళ. తల్లిగా, చెల్లిగా, కూతురిగా, భార్యగా ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తోంది. వారు నేటికీ సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంటున్నారు. ఆ రోజులు పోవాలని, ప్రతి మహిళా రోజూ ఆనందంగా జీవించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆకాంక్షించారు. మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సైబరాబాద్ కమిషనరేట్‌లో మహిళా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. వేడుకల్లో మహిళా పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీ మాట్లాడుతూ... అందరూ సమానమే (ఆల్ ఆర్ ఈక్వల్) నినాదంతో ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. ఐక్యరాజ్య సమితి అదే నినాదంతో ప్రతియేటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అన్ని రంగాల్లో ఆమెదే విజయం
ప్రస్తుత సమాజంలో నేటి మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురుషులకు ధీటుగా అద్భుత విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌లో సుమారు 6 లక్షల మంది మహి ళా ఉద్యోగులు పనిచేస్తుండటమే వారి విజయానికి అద్దం పడుతోందన్నారు. నేడు మహిళలు ఒంటరిగా ప్రపంచలో ఎక్కడికైనా వెళ్లగలిగే స్థాయికి ఎదిగారన్నారు. ఎన్నో సంస్థలకు మహిళలు నాయకత్వం వహించి అద్భుత విజయాలు సాధిస్తున్నారని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, సాంసం్కృతిక, రాజకీయ విజయాలకు ప్రతీకగా ప్రపంచం అంతా జరుపుకునేదిగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కళాబృందం చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీపీ గౌస్‌మొయినుద్దీన్, అడిషనల్ డీసీపీ మాణిక్‌రాజ్, సీఏవో (అకౌంట్స్) చంద్రకళ, సీఏఓ (అడ్మిన్) మహముదా బేగం, షీటీమ్స్ ఇన్‌స్పెక్టర్ సునీత, మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం సైబరాబాద్ సీపీ సజ్జనార్ సహా... పోలీస్ సిబ్బంది హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
షీటీమ్స్‌తో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది...అనసూయ, డీసీపీ (ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్)
షీటీమ్స్ ఏర్పాటు తర్వాత మహిళలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించడంలో షీటీమ్స్ ముందున్నాయి. తల్లిదండ్రులు ఆడపిల్లలు, అబ్బాయిలను సమానంగా చూడాలి. అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా వారిలో స్ఫూర్తి నింపాలి. మహిళలు, అమ్మాయిలకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే వారికి అండగా ఉంటాం. మహిళా పోలీసు సిబ్బంది వృత్తిపరంగా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవాలి. అది జీవితంలో నిరంతర ప్రక్రియ. డిపార్ట్‌మెంట్‌లోని 17 అంశాల్లో ఏదైనా ఒకదానిపై తమ ప్రత్యేకతను చాటాలి. నేటి మహిళలు విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా విజయం సాధిస్తున్నారు.
స్త్రీ సమానత్వమే ప్రగతికి మూలం.. ఇందిర, అడిషనల్ డీసీపీ(క్రైమ్స్)
దేశాభివృద్ధిలో మహిళలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం.
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి...కవిత, అడిషనల్ డీసీపీ
వచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకున్నప్పుడే అన్ని రంగాల్లో రాణిస్తారు. ప్రతి అవకాశాన్ని చాలెంజ్‌గా తీసుకోవాలి. పురుషుల కన్నా మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించాలి. మహిళల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.