ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు పెట్టాలి

ABN , First Publish Date - 2020-05-09T10:36:02+05:30 IST

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బలాలపై సుమోటాగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని

ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు పెట్టాలి

ఎస్సీ కమిషన్‌ జాతీయ సభ్యుడు రాములు


చాదర్‌ఘాట్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బలాలపై సుమోటాగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని సుల్తాన్‌బజార్‌ ఏసీపీ దేవేందర్‌ను ఎస్సీ కమిషన్‌ జాతీయ సభ్యుడు రాములు కోరారు. శుక్రవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ నుంచి వచ్చిన నివేదిక మేరకు చాదర్‌ఘాట్‌ పరిధిలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నాననే విషయం తెలుసుకుని ఎమ్మెల్యే తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు.


‘చిల్లర గాళ్లు’ అనే పదాన్ని ఉపయోగించిన బలాలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. ఈ విషయమై డీజీపీ, సీపీతో మాట్లాడతానన్నారు. ఈ కేసులో నిందితుడిని రిమాండ్‌కు పంపామని, చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు చర్యలు చేపట్టామని ఏసీపీ తెలిపారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏసీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్టు ఆలిండియా కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ సంఘాల తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె.మహేశ్వర్‌రాజ్‌ తెలిపారు. అత్యాచార బాధితురాలికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందేలా చర్యలు చేట్టాలని ఎస్సీ కమిషన్‌ జాతీయ సభ్యుడు రాములు అంబర్‌పేట తహసీల్దార్‌ వేణుగోపాల్‌ను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కలెక్టర్‌కు నివేదిక సమర్పించామని తహసీల్దార్‌ పేర్కొన్నారు. 


నిందితుడిని శిక్షించాలి.. 

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. బాధితురాలి కుటుంబాన్ని టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్‌ శుక్రవారం పరామర్శించారు. ఆయన వెంట మలక్‌పేట ఏ-బ్లాక్‌ అధ్యక్షుడు బాబు శ్రీనివాస్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నరేందర్‌ ఉన్నారు. అలాగే, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బీజేపీ వెంకటేశ్వర కాలనీ డివిజన్‌ అధ్యక్షుడు మన్నెం వీరస్వామి శుక్రవారం సుఖ్‌దేవ్‌నగర్‌ బస్తీలో దళిత సంఘాలతో కలిసి ఒకరోజు దీక్ష చేపట్టారు.


బీజేపీ ఓబీసీ సెల్‌ రాష్ట్రనాయకుడు నీలకంఠం రాజు, బీజేపీ అంబర్‌పేట నియోజకవర్గం కన్వీనర్‌ ఎడెల్లి అజయ్‌కుమార్‌లు వేర్వేరుగా బాగ్‌అంబర్‌పేటలోని తమ తమ నివాసాల్లో దీక్ష చేశారు. అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి పాశం శ్రీశైలం డిమాండ్‌ చేశారు.  బాలికకు న్యాయం చేయాలని తెలంగాణ మాలల సమితి రాష్ట్ర అధ్యక్షుడు బరిగెల వెంకటస్వామి డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-05-09T10:36:02+05:30 IST