పూజలతో కుటుంబాన్ని భస్మం చేస్తా..
ABN , First Publish Date - 2020-09-12T09:49:54+05:30 IST
అతడి వయస్సు 43. పూజలు చేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తానని చెప్పుకున్నాడు.

పెళ్లి చేసుకోవాలని మైనర్‌పై ఒత్తిడి
పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
బంజారాహిల్స్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అతడి వయస్సు 43. పూజలు చేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తానని చెప్పుకున్నాడు. ఇలా పూజలు చేస్తుండగా అతని కన్ను ఓ మైనర్ పై పడింది. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, తనతో పెళ్లికి ఒప్పుకోకపోతే పూజలు చేసి కుటుంబాన్ని భస్మం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3 షౌకత్‌నగర్‌కు చెందిన ఓ మహిళ భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి ఇద్దరు కుమార్తెలను చదివించుకుంటోంది. చుట్టుముడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే పూజలు చేయాలని రమేశ్ అనే వ్యక్తి ఆమెకు చెప్పాడు. ఆ పూజలు తానే నిర్వహిస్తానని తెలిపాడు. కొన్ని సార్లు పూజలు చేశాడు. వారి పరిస్థితి కాస్త మెరుగుపడుతూ రావడంతో అది తన పూజల మహిమే అని నమ్మించాడు. 2018లో ఓసారి పూజ చేస్తూ ఎవరూ లేని సమయంలో పెద్ద కుమార్తె(17)తో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె గట్టిగా ప్రశ్నించింది. భయపడ్డ రమేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఆ బాలిక ఫోన్ నెంబర్ సంపాదించి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని బాలికపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టాడు. ఒప్పుకోకపోతే పూజలు నిర్వహించి తల్లిని, సోదరిని చంపేస్తానని, కుటుంబాన్ని భస్మం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. భయపడ్డ ఆమె ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. తల్లి సహాయంతో బంజారాహిల్స్ పోలీసులకు ఆ బాలిక ఫిర్యాదు చేయగా, వారు రమేష్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.