నిర్మాణ సంస్థలో చోరీ
ABN , First Publish Date - 2020-07-19T09:37:03+05:30 IST
ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంలో చోరీ జరిగింది. లైసెన్స్‌డ్ రివాల్వర్, బుల్లెట్లతోపాటు రూ. కోట్ల వి...

- రూ. కోట్ల విలువ చేసే దస్తావేజులు మాయం
- రివాల్వర్, బుల్లెట్ కూడా..
- సంస్థ మాజీ డైరెక్టర్‌పై అనుమానాలు
బంజారాహిల్స్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఓ నిర్మాణ సంస్థ కార్యాలయంలో చోరీ జరిగింది. లైసెన్స్‌డ్ రివాల్వర్, బుల్లెట్లతోపాటు రూ. కోట్ల విలువ చేసే ఆస్తుల దస్తావేజులు చోరీకి గురయ్యాయి. సంస్థ మాజీ డైరెక్టర్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఎండీ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 59లో నివాసముండే వీరప్పరెడ్డి కోటారెడ్డి బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3లో ఆదిత్య హోమ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి ఎండీగా ఉన్నారు. ఆ సంస్థ పేరుతో నగరంలో అనేక నిర్మాణాలు చేపట్టారు. అతడి బావమరిది సుధీర్‌రెడ్డి సంస్థకు డైరెక్టర్‌గా ఉండేవారు. కొంతకాలం క్రితం కోటారెడ్డి ఆయనను సంస్థ నుంచి తొలగించారు. అయినప్పటికీ, సుధీర్‌రెడ్డి తరుచూ కార్యాలయానికి వచ్చే వారు. యజమాని బంధువు, మాజీ డైరెక్టర్ కావడంతో ఎవరూ అడ్డుచెప్పేవారు కాదు. ఈనెల 8న 11:15 గంటలకు సుధీర్‌రెడ్డి అక్రమంగా కోటారెడ్డి కార్యాలయంలోకి ప్రవేశించారు. ఆయన క్యాబిన్‌లోకి వెళ్లి రూ. కోట్ల విలువ చేసే ఆస్తుల దస్తావేజుల పెట్టెతోపాటు, లైసెన్స్‌డ్ (0.32) రివాల్వర్, 20 బుల్లెట్ల క్యాట్రిడ్జ్ చోరీ చేశాడని కోటారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.