బీఆర్‌ఎ్‌సకు ఆస్తిపన్నుతో లింకు

ABN , First Publish Date - 2020-12-11T06:19:55+05:30 IST

మీరు బిల్డింగ్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ (బీఆర్‌ఎస్‌)లో భాగంగా దరఖాస్తు చేశారా..?

బీఆర్‌ఎ్‌సకు ఆస్తిపన్నుతో లింకు

పన్ను చెల్లించిన రశీదు తప్పనిసరి

అప్‌లోడ్‌ చేయాలని దరఖాస్తుదారులకు జీహెచ్‌ఎంసీ సందేశం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి) :

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి) : 

మీరు బిల్డింగ్‌ రెగ్యులైజేషన్‌ స్కీమ్‌ (బీఆర్‌ఎస్‌)లో భాగంగా దరఖాస్తు చేశారా..? అయితే పెనాల్టీతో సహా ఆస్తిపన్ను చెల్లించాల్సిందే. ఇప్పటివరకు ఆస్తిపన్ను మదింపు జరగకున్నా.. వెంటనే దరఖాస్తు చేయాలి. పన్ను ఎంతన్నది నిర్ధారణ అయిన అనంతరం... ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఆ రశీదు అప్‌లోడ్‌ చేస్తేనే మీ బీఆర్‌ఎస్‌ దరఖా స్తును పరిశీలిస్తారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ నుంచి దరఖాస్తుదారుల మొబైల్‌ నెంబర్లకు షార్ట్‌ఫాల్‌ సమర్పించాలని సందేశాలు వస్తున్నాయి. సేల్‌డీడ్‌, ఇతరత్రా డాక్యుమెంట్లు సమర్పించాలన్న మెస్సేజ్‌లూ  వస్తున్నాయి. గ్రేటర్‌లో 22 లక్షలకుపైగా వివిధ కేటగిరీల వినియోగ భవనాలున్నాయి. ఆస్తిపన్ను చెల్లింపుదారుల సంఖ్య 16.08 లక్షలు మాత్రమే. అంటే దాదాపు ఐదారు లక్షల భవనాల ఆస్తిపన్ను మదింపు జరగలేదు. వీటిలో చాలా వరకు అనుమతి లేని నిర్మాణాలే. కొన్ని పేదలవి కాగా.. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం 2015లో అవకాశం కల్పించింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.30 లక్షల బీఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వీటి క్రమబద్ధీకరణ నిలిచిపోయింది. కేవలం దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తున్నారు. డాక్యుమెంట్లు తక్కువగా ఉంటే షార్ట్‌ఫాల్‌ సమర్పించాలని సందేశాలు పంపుతున్నారు. దరఖాస్తుల పరిశీ లన, ఆమోదానికి మాత్రమే ప్రస్తుతం పట్టణ ప్రణాళికా విభాగం పరిమితమైంది. న్యాయస్థానం తుది తీర్పు వెలువడిన అనంతరమే రుసుము వసూలు, ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని పట్టణ ప్రణాళికా విభాగం వర్గాలు చెబుతున్నాయి. 

రెండు, మూడింతల భారం...

అనుమతి లేకుండా నిర్మించిన భవనాలనే అక్రమ నిర్మాణాలుగా పరిగణిస్తారు. వాటి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. తాగునీరు, విద్యుత్‌ సరఫరా వంటి సదుపాయాలున్నా.. చాలా వరకు నిర్మాణాలకు ఆస్తిపన్ను మదింపు జరగలేదు. అనుమతి లేని భవనాలకు ఆస్తిపన్ను మదింపు చేస్తే రెండింతల పెనాల్టీ వేస్తారు. సాధారణంగా ఒక ఫ్లాట్‌/ ఇంటికి ఏటా రూ.5వేల పన్ను ఉంటే.. అనుమతి లేనందున యజమాని రూ.10 వేలు చెల్లించాలి. అందుకే మెజార్టీ మదింపు కోసం దరఖాస్తుచేయరు. జీహెచ్‌ఎంసీ కూడా పన్ను మదింపు జరగని భవనాలను అంత సీరియ్‌సగా పరిగణించదు. క్రమబద్ధీకరణ అవకాశం నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసిన వారు నయా నిబంధన ప్రకారం ఆస్తిపన్ను కూడా చెల్లించాల్సిందే. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం గతంలోనే భవనం నిర్మించి ఇప్పటి వరకు పన్ను చెల్లించకుంటే.. మదింపు క్రమంలో రెండున్నరేళ్లకు సరిపడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అక్రమ భవనమైనందున పన్ను కూడా రెట్టింపు చెల్లించాలి. ఏటా రూ.5 వేల పన్ను నిర్ధారణ అయితే అనుమతి లేనందుకు రూ.10 వేలు చొప్పున రెండున్నరేళ్ల పన్ను మొత్తం రూ.25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దరఖాస్తుదారులకు బీఆర్‌ఎస్‌ రుసుముతో పాటు ఆస్తిపన్ను చెల్లింపు అదనపు భారంగా మారనుంది. దీనిపై బీఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. 


Updated Date - 2020-12-11T06:19:55+05:30 IST