గంట పాటు.. వాన పోటు!
ABN , First Publish Date - 2020-05-17T11:20:00+05:30 IST
ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి రోడ్ల వెంట ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి.

ఎడతెరిపి లేకుండా..
ఈదురుగాలులకు విరిగిన వృక్షాలు
తెగిపోయిన విద్యుత్ తీగలు
పలు ప్రాంతాల్లో పొంగిన మ్యాన్‌హోళ్లు
వెంగళ్‌రావునగర్‌లో అత్యధికంగా 55.3 మిల్లీమీటర్లు
ఒక్కసారిగా విరుచుకు పడ్డ గాలివాన బీభత్సం సృష్టించింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు వేళ్లతో సహా కూలిపోయాయి. అనేక ప్రాంతాలలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో కరెంట్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్ కాలం కావడంతో రోడ్లపై ట్రాఫిక్ మామూలుగానే ఉన్నా.. గాలివాన, వరద నీటి తాకిడికి చాలాచోట్ల వాహనాలు నిలిచిపోయాయి. కూలిపోయిన చెట్లను, విద్యుత్ తీగలను తొలగించడానికి వివిధ ప్రభుత్వ విభాగాల సిబ్బంది పని చేస్తున్నారు.
నగరంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గత మూడు రోజుల నుంచి 39 నుంచి 40.2 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వాటి ప్రభావంతో కూడా వర్షాలు కురుస్తున్నాయని వివరించారు.
హైదరాబాద్ సిటీ/కూకట్‌పల్లి/ బేగంపేట/ ఉప్పల్/ అల్వాల్/ రాంనగర్/అమీర్‌పేట/
బంజారాహిల్స్/ వెంగళ్‌రావునగర్/ఖైరతాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి రోడ్ల వెంట ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. పలుచోట్ల విద్యుత్ తీగలు తెగిపోయాయి. సోమాజిగూడలోని బీఎస్ మక్తా, హరిగేట్‌లో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోవడంతోపాటు ఇళ్లలోకి చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఖైరతాబాద్ ఆర్టీఏ బస్‌స్టాప్ చెరువులా మారి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కేపీహెచ్‌బీకాలనీ, మూసాపేట, వివేకానందనగర్‌కాలనీ ప్రాంతాల్లోని కాలనీల్లోని రోడ్లు జలమయమయ్యాయి.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడ్డాయి. యూసు్‌ఫగూడ, సిద్ధార్థనగర్, మధురానగర్, కల్యాణ్‌నగర్, వెంగళ్‌రావునగర్, రాజీవ్‌నగర్, శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌శాఖ అత్యవసర బృందాలు ఆయా ప్రాంతాల్లో చెట్ల కొమ్మలను తొలగించడంతోపాటు విద్యుత్ పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయా ప్రాంతాలను సందర్శించారు. అమీర్‌పేట, బల్కంపేట, సనత్‌నగర్, సాగర్‌సొసైటీ, జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 3 ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు విరిగి, వాహనాలపై పడడంతో అవి ధ్వంసమయ్యాయి. బల్కంపేట ప్రధాన రహదారిలో వర్షం నీరు భారీగా చేరడంతో చెరువుగా మారింది. బంజారాహిల్స్‌లోని సాగర్ సొసైటీలో చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లో రహదారిలో పార్కు చేసిన కారుపై చెట్టు పడడంతో ధ్వంసమైంది. హబ్సిగూడ వసంత్‌విహార్ కాలనీలో ఈదురుగాలులతో చెట్టు విరిగిపడడంతో కారుపై పడడంతో అద్దాలు పగిలిపోయినట్లు దాని యజమాని తెలిపారు. భారీ వర్షం కారణంగా విరిగిపోయిన చెట్లను జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్ సిబ్బంది రాత్రి వరకు తొలగించారు. విద్యుత్ తీగలను ట్రాన్స్‌కో సిబ్బంది సరిచేశారు.
అత్యధికంగా వెంగళ్‌రావునగర్‌లో..
అత్యధికంగా వెంగళ్‌రావునగర్‌లో 55.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అమీర్‌పేట మైత్రీవనంలో 54.3, బంజారాహిల్స్‌లో 45.5, యూస్‌ఫగూడలో 41.8, మూసాపేటలో 41.8, గణాంకా భవన్ వద్ద 37.8, బాలానగర్‌లో 27.3, సుమిత్రానగర్ కాలనీలో 26.3, టోలిచౌకీలో 25.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా ఆసి్‌ఫనగర్‌లో 9.8, రెడ్‌హిల్స్‌లో 8.3 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తీగలతో జాగ్రత్త..
నగరంలో ఈదురుగాలులతో వర్షం కురిసిన నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో వెంటనే పునరుద్ధరించాలని సీఎండీ జి. రఘుమారెడ్డి ఆదేశించారు. విద్యుత్ సరఫరాపై సూపరింటెండెంట్ ఇంజనీర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. భారీగాలుల కారణంగా చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడటంతో పలు ప్రాంతాల్లో 50 విద్యుత్ స్తంభాలు విరిగాయి. ఏడు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. దీంతో జూబ్లీహిల్స్, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్‌నగర్, మెహిదీపట్నం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
సుమారు వంద మంది డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బృందాల ఇంజనీర్లు, సిబ్బంది సరఫరా పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా, విద్యుత్ పునరుద్ధరణ పనులు చురుకుగా సాగుతున్నాయని సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. అయితే, తెగిపడిన విద్యుత్ తీగల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా తెగిన విద్యుత్ తీగలను గమనిస్తే వాటిని తాకకుండా విద్యుత్‌శాఖ వారికి తెలపాలని కోరారు. ఏ ప్రాంతంలో నైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే 1912 లేదా 100 లేదా స్థానిక విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.