సీఎం కేసీఆర్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు: రఘునందనరావు

ABN , First Publish Date - 2020-12-11T18:45:37+05:30 IST

సిద్ధిపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారు: రఘునందనరావు

హైదరాబాద్: సిద్ధిపేట సభలో ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు మండిపడ్డారు. దుబ్బాక ప్రజలు తమ వివక్షను తిప్పుకొట్టినా.. సీఎం తన తీరును మార్చుకోలేదన్నారు. సిద్ధిపేట, వరంగల్, ఖమ్మం, మున్సిపల్ ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి మాటల మాంత్రికుడి అవతారం ఎత్తాడని యెద్దేవా చేశారు. జిల్లా ఎమ్మెల్యేగా ఉన్న తనను వేదిక మీదకు పిలవకుండా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని సీఎం కల్వకుంట్ల పేరంటంగా మార్చివేశారన్నారు. దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు  మాత్రమే రింగ్ రోడ్టులు వేశారని.. దుబ్బాక ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. సిద్ధిపేట వంద రూపాయలు ఇస్తే.. దుబ్బాకకు  కూడా వంద రూపాయలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. సిద్ధిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొస్తే మంచిదే కానీ.. దుబ్బాక  పాత బస్టాండ్‌ను కూడా అభివృద్ధి చేయాలన్నారు. 


హైదరాబాద్‌కు 150 కిలోమీటర్ల లోపల కొత్త విమానాశ్రయం కట్టకూడదని నిబంధనలు చెప్తున్నాయన్నారు. వరంగల్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొస్తామని నాలుగేళ్ళ క్రితం సీఎం చెప్పిన మాటలను సిద్దిపేట ప్రజలు గుర్తుచేసుకోవాలన్నారు. 2033 వరకు హైద్రాబాద్‌కు 150కిలోమీటర్ల లోపల అంతర్జాతీయ విమానాశ్రయం కట్టలేరని చెప్పుకొచ్చారు. ఖమ్మం ఐటీ పార్క్ ఏమైందో మంత్రి కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కొడుకు కోసం ఐటీ పార్క్, అల్లుడి కోసం మెడికల్ కాలేజ్ .. మనవడు కోసం గజ్వేల్‌ను సీఎం అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. ఎస్‌ఈసీ, పోలీస్ అధికారులతో కలసి ప్రభుత్వం కుట్రతో కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతోందన్నారు. సీఎం ప్రోటోకాల్ ఉల్లంఘనపై కలెక్టర్, శాసనసభ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. రంగనాయక సాగర్‌లో కన్వెషన్ సెంటర్లు దేవుడెరుగు.. మండలం కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు కట్టాలని ప్రజలు కోరుతున్నారని  ఎమ్మెల్యే రఘునందనరావు పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-11T18:45:37+05:30 IST