కరోనాను అరికట్టాలంటే ఇదొక్కటే దారి.. మారకుంటే ముప్పే!

ABN , First Publish Date - 2020-03-24T16:05:43+05:30 IST

సమయం: ఉదయం 7.30 గంటలు. మోతీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌. ఈ ప్రాంతానికో ప్రత్యేకత ఉంది. ప్రముఖ సూపర్‌ మార్కెట్లు మూడూ ఒకే దగ్గర ఉంటాయి. పాల ప్యాకెట్లు, కూరగాయల కోసం విపరీతమైన రద్దీ.

కరోనాను అరికట్టాలంటే ఇదొక్కటే దారి.. మారకుంటే ముప్పే!

కరోనా ముప్పును పట్టించుకోని నగరవాసులు

ఇళ్ల బయట ముచ్చట్లు

కాలనీల్లో తరచూ బయటకు వస్తూ కాలక్షేపం

కొన్ని ప్రాంతాల్లో ఆటలే కాదు.. విందులు కూడా...

మీటరు దూరం ఉండాలన్నది మర్చిపోతున్న వైనం

ప్రభుత్వ సూచనలను పక్కన పెడితే ప్రమాదమే

అవసరం లేకున్నా బయటకు వస్తున్న తీరు

ఇదే తీరు కొనసాగితే ప్రమాదమంటున్న వైద్యులు


(హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రతినిధి, ఆంధ్రజ్యోతి): 


సమయం: ఉదయం 7.30 గంటలు. మోతీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌. ఈ ప్రాంతానికో ప్రత్యేకత ఉంది. ప్రముఖ సూపర్‌ మార్కెట్లు మూడూ ఒకే దగ్గర ఉంటాయి. పాల ప్యాకెట్లు, కూరగాయల కోసం విపరీతమైన రద్దీ. వ్యానులో వచ్చిన సరుకును షాపులోకి తీసుకెళ్లేందుకు సైతం ఒప్పుకోకుండా, తమకు ఇవ్వాలన్న డిమాండ్లతో అక్కడికక్కడే అమ్మేయాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో పాల పాకెట్లు, కూరగాయలు కొనుక్కోవాలన్న ఆత్రుత తప్పించి.. స్వీయ సంరక్షణ గురించి ఆలోచనే కనిపించలేదు.


సమయం: ఉదయం 10 గంటలు. ఎర్రగడ్డ రైతు బజార్‌. కొనుగోలుదారులతో విపరీతమైన రద్దీ. ఒకరినొకరు తగులుకుంటూ, స్వీయ సంరక్షణ విషయంలో ఎలాంటి పట్టింపు లేకుండా, కూరగాయల కొనుగోలు మాత్రమే ముఖ్యమన్నట్లు, ఎక్కడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్న ధ్యాస కనిపించలేదు. కొనుగోలు వేళ ఒకరికొకరు తగులుకుంటూ వెళ్లడమే తప్పించి, ఒకరికొకరి మధ్య కనీస దూరం మీటరు నుంచి మూడు మీటర్ల మధ్య ఉండాలన్న ఆలోచన ఎవరిలోనూ కనిపించలేదు. కాకుంటే.. కొద్దిమంది ముఖాలకు మాస్కులు ధరించడం కనిపించింది. రోజువారీగా కనిపించే రద్దీకి సోమవారం ఎలాంటి మినహాయింపు కనిపించలేదు. 


సమయం: ఉదయం 11 గంటలు. కేపీహెచ్‌బీలోని వసంత్‌నగర్‌లో ఒక కూరగాయల సూపర్‌ మార్కెట్‌. షాపు కిటకిటలాడటమే కాదు, బయట క్యూ. కరోనా వేళ వ్యక్తికి వ్యక్తికి మధ్య మీటరు దూరం ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయారు. అవసరమైన వాటిని హడావిడిగా కొనుగోలు చేశారు. బిల్‌ కౌంటర్‌ వద్ద ఒకరికొకరు దగ్గరగా ఉన్నారు. సామాజిక దూరం పాటించాలన్న సూచన పట్టలేదు.


సూచనలు పక్కాగా పాటించాలి

కరోనా టీ20 మ్యాచ్‌ కాదు. మూడున్నర గంటల్లో ముగిసిపోదు. సుదీర్ఘంగా సాగేది. ప్రభుత్వాలు, ప్రజలు ఒకరికొకరు సహకరించుకోవాలి. అధికారులు చెప్పిన సూచనలను పక్కాగా పాటించాలి. పెడచెవిన పెట్టకూడదు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. కరోనా వైరస్‌ ఏ రూపంలో ఎప్పుడు, ఎలా వస్తుందన్నది చెప్పలేం. ముందు జాగ్రత్తగా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఇంటి నుంచి ఒక్కరు బ యటకు వెళ్లాలని, అది కూడా అత్యవసరమైతే తప్పించి కాదన్నది మర్చిపోకూడదు. ఇప్పుడు నడుస్తున్నది పరీక్షా కాలం. పరీక్ష రాసేటప్పుడు ఎంత ఏకాగ్రతతో ప్రశ్నలకు సమాధానాలు రాస్తామో, సరిగ్గా అదే తీరును నగర ప్రజలు పాటించాలి. పాల ప్యాకెట్లు, కూరగాయలు, నిత్యవసర వస్తువులు, మందులు లాంటి వాటి కోసం బయటకు వెళ్లాలి. ఇంట్లోనే ఉండాలి. ఇందుకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. కరోనా చెప్పిరాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్‌ను అరికట్టడానికి ఇంటి పట్టున ఉండడానికి మించింది లేదు. దురదృష్టం ఏమంటే ఇంత సీరియస్‌ అంశాన్ని నగరవాసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అలా అని అందరూ అలా లేరు. కొన్ని కాలనీల్లో బయటకు అదే పనిగా వెళ్లే వారిని హెచ్చరించటంతో పాటు.. ‘మీరు ఇలా వెళ్లటం మంచిది కాదు. మీ ఆరోగ్యమే కాదు. కాలనీ ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందన్నది మర్చిపోవద్దు’ అన్న మాటను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. 


తప్పని పరిస్థితుల్లో ఆఫీసుకు...

బంజారాహిల్స్‌లోని ఒక కాలనీలో నివాసం ఉండే చలపతిరావు ఒక కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. తప్పనిసరిగా ఆయన రోజూ ఆఫీసుకు వెళ్లి రావల్సిన పరిస్థితి. ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన ఆఫీసుల్లో ఆయనది కూడా ఒకటి. ఆయన రోజులో ఒకట్రెండుసార్లు బయటకు వెళ్లి రావాల్సిన అవసరం ఉంటుంది. జనతా కర్ఫ్యూ వేళలోనూ ఆయన విధులకు హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది. సోమవారం ఆ కాలనీకి చెందిన ఒకరిద్దరు ఆయన్ను కలిసి, మీరు రోజూ ఇలా బయటకు వెళ్లి రావటం అంత క్షేమకరం కాదు. జాగ్రత్తగా ఉండాలన్న సూచనతో కూడిన హెచ్చరింపు చేయడం గమనార్హం. 


స్వీయ నియంత్రణ లేదు...

కొన్ని హైరైజ్‌ అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు, టౌన్‌ షిప్పుల్లోని కొందరు ఇంటికే పరిమితం కావాలన్న ప్రభుత్వ సూచనను తూచా తప్పకుండా పాటించడమే కాదు, తమ వద్ద నివాసం ఉండే వారు ఎవరైనా ఎక్కువగా బయటకు వెళ్లి వస్తుంటే.. ఇలాంటి అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం కనిపిస్తోంది. అదే సమయంలో మహా నగరంలోని చాలాచోట్ల ఇలాంటి స్వీయనియంత్రణ, క్రమశిక్షణ అసలు కనిపించకపోవడం శోచనీయం. కొన్ని ప్రాంతాల్లోని వారు బయటకు చేరి కలిసి ఆడుకోవటం, కాలక్షేపం చేయడంతో పాటు దగ్గర దగ్గరగా ఉండటం కనిపిస్తోంది. కొందరు బాతాఖానీ పేరుతో ప్రభుత్వ సూచనలను పాటించడం లేదు. ఇలాంటివి ప్రమాదకరమన్న విషయాల్ని గుర్తించాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెలవులతో ఖాళీగా ఉన్నాం. బయటకు వెళ్లలేకపోతున్నాం. ఎవరినైనా కలిసి వద్దాం. మిత్రుల్ని కలవడం తప్పేం కాదు. అన్న ఉద్దేశంతో అనవసర ప్రయాణాలు చేస్తున్నవారు చాలామందే రోడ్ల మీద కనిపిస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు అడ్డుకున్నప్పుడు అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోతున్నారు. 


కరోనాను ఆహ్వానించవద్దు

ఇప్పుడున్నది మామూలు పరిస్థితి ఎంతమాత్రం కాదని, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నామన్న విషయాన్ని నగరవాసులు అనుక్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం చెప్పినట్లుగా పది, పదిహేను రోజులు కాస్త ఇబ్బందులకు గురైనా, ఆ తర్వాత ఎప్పటిలానే ఉండొచ్చన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఇవాల్టి సంతోషం కోసం రేపటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని బలి పెట్టకూడదు కదా? ఇప్పటివరకూ విదేశాల నుంచి వచ్చిన వారిలోనే కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి. రెండు కేసులు మాత్రమే సెకండ్‌ కాంటాక్ట్‌ (విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా సోకడం) కేసులు నమోదయ్యాయి. దీన్ని ఎంత తక్కువతో ముగిస్తే అంత మంచిది. కరోనా ఒకసారి విస్తరించడం మొదలైతే, దాని వేగం ఊహకు అందనంతగా ఉంటుంది. దాంతో జరిగే నష్టం అంచనాలకు అందదు. అదెప్పుడు ఏం చేస్తుందో? దాని విపరిణామాల తీవ్రత ఎలా ఉంటుందన్నది ఇటలీ ఉదంతం చెప్పేస్తుంది. అందుకే చిన్న చిన్న విషయాలు, ఆనందాల కోసం ప్రమాదంలోకి ప్రయాణించడం మంచిది కాదు. ఒక పాల ప్యాకెట్‌, కొన్ని కూరగాయలు, ఇంకొన్ని నిత్యావసరాల కంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. కుటుంబానికి మీ అవసరమెంతో. అత్యుత్సాహంతో, అవగాహన లేమితో కరోనాను కోరి ఆహ్వానించడం మీకే కాదు, మీ చుట్టూ ఉన్న వారిని ప్రమాదంలోకి నెట్టేస్తుందన్నది ఏ సందర్భంలోనూ మర్చిపోకూడదు.

Read more