బందోమస్త్

ABN , First Publish Date - 2020-11-26T06:51:06+05:30 IST

బందోమస్త్

బందోమస్త్
చార్మినార్‌ వద్ద పోలీసుల కవాతు

ఎన్నికలకు పోలీసుల సర్వం సిద్ధం

నిఘా నీడలో పోలింగ్‌ కేంద్రాలు

చార్మినార్‌ వద్ద సీపీ, అదనపు సీపీల కవాతు

హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌, నవంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల కోసం పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌, కౌంటింగ్‌ కేంద్రాలు, సున్నిత, అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలను ఇప్పటికే మార్కింగ్‌ చేసుకున్న పోలీసు అధికారులు వ్యూహాత్మకంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.  మంగళవారం హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, అదనపు సీపీలు చౌహాన్‌, షికాగోయెల్‌, జాయింట్‌ సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ గజరావు భూపాల్‌, పోలీసులు, అధికారులు చార్మినార్‌ వద్ద  ఫ్లాగ్‌ పీస్‌ మార్చ్‌ పేరిట కార్యక్రమం నిర్వహించారు. చార్మినార్‌ నుంచి రాజేశ్‌మెడికల్‌ హాల్‌, నాగుల్‌చింత క్రాస్‌ రోడ్స్‌, సుధా లైబ్రరీ, హరిబౌలి, వాల్టా, ఎతేబార్‌ చౌక్‌, గుల్జార్‌హౌజ్‌, చార్మినార్‌ వరకు యాత్రసాగింది. 

బందోబస్తు తీరు

హైదరాబాద్‌ సిటీ పరిధిలో 601 ప్రాంతాల్లో 1,704 పోలింగ్‌ కేంద్రా లు సున్నితంగా ఉన్నాయని, 307 ప్రాంతాల్లో 1,085 కేంద్రాలు అతి సున్నితంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆయా ప్రాంతాలపై నిఘా మరింత గట్టిగా ఉంటుందని సీపీ అన్నారు. నగరంలో 15 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి రూ.  1.41కోట్ల హవాలా డబ్బులు స్వాధీనం చేసుకున్నామని, రూ. 10లక్షలు విలువ చేసే డ్రగ్స్‌, 2.1కేజీల గంజాయి, 59లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 19ఎఫ్‌ఐఆర్‌లు, 3 పెట్టీ కేసులు, ఓ జీడీ ఎంట్రీతో కలిపి మొత్తం 23 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. 

రౌడీలపై ఉక్కుపాదం

నగరంలో 2,785 మందిని బాండెడ్‌ ఓవర్‌ చేశామని వారిలో 1,167 మంది రౌడీలు, 1,014 అనుమానితులు, 604 మందిపై చర్యలు తీసుకున్నట్లు సీపీ వివరించారు. లైసెన్సుడు ఆయుధాలున్న వారి వద్ద నుంచి 3,744 ఆయుధాలు డిపాజిట్‌ అయ్యాయని, రెండు కత్తులు రికవరీ చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద షీటీం బృందాలు నిరంతరంగా పని చేస్తాయని, ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు 100మీటర్ల పరిధి వరకు సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని, సున్నితమైన కేంద్రాల వద్ద 4 కెమెరా మౌంటెడ్‌ వాహనాల ద్వారా నిఘా ఉంటుందని వివరించారు. సోషల్‌ మీడియా ద్వారా ఫిర్యాదులు స్వీకరించి వెను వెంటనే చర్యలు తీసుకుంటారని సీపీ అన్నారు. ఎన్నికల రోజు నిర్భయంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీపీ కోరారు. మొత్తం లా అండ్‌ ఆర్డర్‌తోపాటు వివిధ విభాగాలకు చెందిన మొత్తం 15వేల మంది పోలీస్‌ సిబ్బంది బందోబస్తులో నిమగ్నం కాగా, పోలింగ్‌ ఎన్నికలకు మందు మరిన్ని బలగాలను రప్పించనున్నారు. 


ఓటు వజ్రాయుధం

ధైర్యంగా వినియోగించుకోండి  

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పిలుపు

సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన 

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఓటు వజ్రాయుధం లాంటిదని, గ్రేటర్‌ ఎన్నికల్లో నగరవాసులు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సైబరాబాద్‌ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సీపీ బుధవారం  పర్యటించారు. రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, బాలానగర్‌, సనత్‌నగర్‌, మేడ్జల్‌ జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక బూత్‌లను సందర్శించి, భద్రతను పర్యవేక్షించారు. అక్కడి పోలీస్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ, సైబరాబాద్‌ పరిధిలో 38 డివిజన్లలో పోలింగ్‌ జరగనుండగా, ఎన్నికలు సజావుగా జరగడానికి సివిల్‌, ఆర్మ్‌డ్‌ పోలీసులు కలిసి 13,500 మందిని రంగంలోకి దింపామన్నారు. మొత్తం 770 పోలింగ్‌ కేంద్రాలు సమస్మాతకంగా ఉన్నాయని, అక్కడ సివిల్‌ పోలీ్‌సలు, ఆర్మీ ఆధికారులతో పటిష్ట బందోబస్తుతోపాటు సీసీ టీవీలను ఏర్పాటు చేశామన్నారు. అలాంటి పోలీస్‌ కేంద్రాలకు జియో ట్యాగింగ్‌ చేసినట్లు వివరించారు. డైనమిక్‌ చెక్‌పోస్టులు-15, మొబైల్‌ రూట్లు-179, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ -11, స్టాటిక్‌ సర్వేలైన్స్‌ టీమ్స్‌-11 ఏర్పాటు చేశామన్నారు. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, బాలనగర్‌ డీసీపీ పద్మజ, సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్‌ అడిషనల్‌ డీసీపీ మాణిక్‌రాజ్‌, రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌ కుమార్‌, బాలానగర్‌ ఏసీపీ పురుషోత్తం, ట్రాఫిక్‌ ఏసీపీ విశ్వప్రసాద్‌, రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ నర్సింహ, జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు, సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2020-11-26T06:51:06+05:30 IST