సీఎం కేసీఆర్‌కు సిగ్గుండాలి: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-11-27T18:17:39+05:30 IST

హిందువునని చెప్పుకోవడంకోసం కాషాయపు వస్త్రాలు ధరించి పేపర్లో ఫోటోలు వేసుకునే దౌర్భగ్యస్థితికి..

సీఎం కేసీఆర్‌కు సిగ్గుండాలి: బండి సంజయ్

హైదరాబాద్: హిందువునని చెప్పుకోవడంకోసం కాషాయపు వస్త్రాలు ధరించి పేపర్లో ఫోటోలు వేసుకునే దౌర్భగ్యస్థితికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కుర్మన్‌గూడ డివిజన్‌లో రోడ్ షో నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవడం కోసం, కేటీఆర్‌ను సీఎం చేయడం కోసం యాగాలు చేశారని ఆరోపించారు. కాషాయ వస్త్రాలు వేసుకుంటే సమాజం హిందువుగా గుర్తించిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. దేశద్రోహ పార్టీతో పొత్తుపెట్టుకుని తిరుగుతున్న ముఖ్యమంత్రికి సిగ్గుండాలన్నారు.


15 నిముషాల సమయం ఇస్తే హిందువులను నరికి చంపుతామని ఎంఐఎం పార్టీ వ్యాఖ్యలు చేసిందని, హిందూ దేవుళ్లను అవమానపరిచిందని సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎంఐఎం వ్యతిరేకించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఎంఐఎం పార్టీ పాల్గొనలేదని ఆరోపించారు. అలాంటి పార్టీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే ఆయన ఎలాంటి హిందువో సమాజం గుర్తిస్తుందని సంజయ్ అన్నారు.

Read more