‘బల్దియా’కు ఆ పేరేలా వచ్చింది..!

ABN , First Publish Date - 2020-11-25T05:51:01+05:30 IST

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను స్థానికులంతా ‘బల్దియా’గానూ పిలుస్తారు.

‘బల్దియా’కు ఆ పేరేలా వచ్చింది..!

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను స్థానికులంతా ‘బల్దియా’గానూ పిలుస్తారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో బల్దియా పదం విరివిగా వినిపిస్తోంది. అయితే, అసలు ఆ పదానికి అర్థం తెలియక కొద్దిమంది యువత, స్థానికేతరులు నోరెళ్లపెడుతుంటారు. బల్దియా అంటే ఏమిటీ అని స్థానికులను అడిగితే, మున్సిపల్‌ కార్పొరేషన్‌ అంటారే గానీ... ఆ పదం ఎలా వాడుకలోకి వచ్చిందో మాత్రం తమకీ తెలియదంటారు. బల్దియా అనేది అరబిక్‌ పదం అని భాషాశాస్త్రవేత్త నలిమెల భాస్కర్‌ చెబుతున్నారు. బల్ద్‌ అంటే.. అరబ్బీలో నగరం. అదే నగర పాలిక సమానార్ధంలో ‘బల్దియా’గా ఉర్దూలో స్థిరపడిందని ఆయన వివరించారు. అరబిక్‌, పార్సి, టర్కిష్‌, సంస్కృత పదాల మేలు కలయికతో భారత్‌లో పురుడుపోసుకున్న ఆధునిక భాష ‘ఉర్దూ’. భారతీయ అధికార భాషల్లోనూ అదొకటి. ఉర్దూలోనూ నాలుగు మాండలికాలున్నాయి. అవి... దక్కనీ, లఖనవ్‌, రేఖ్‌తా, ఖరీబోలి. ప్రపంచంలోనే తొలి ఉర్దూ గజల్‌ రచయిత, హైదరాబాద్‌ నగర నిర్మాత మహ్మద్‌ కులీ కుతుబ్‌షా. ఉర్దూ అధికారభాషగా చెలామణి అయిన ఆస్‌ఫజాహీల ఏలికలో ‘బల్దియా’ పదం వాడుకలోకి వచ్చిందని భాషావేత్తల అభిప్రాయం. అప్పటి నుంచి  నగరవాసుల నోళ్లలో బల్దియా పదం నానుతోంది.

Updated Date - 2020-11-25T05:51:01+05:30 IST