పంచాంగానికి పండగొచ్చింది..!

ABN , First Publish Date - 2020-11-19T09:39:53+05:30 IST

బల్దియా ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. కొన్ని పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థుల వ్యవహారం తేల్చలేదు. రేపు నామినేషన్ల దాఖలుకు

పంచాంగానికి పండగొచ్చింది..!

ముహూర్తాల కోసం పరుగులు

పండితులు, జ్యోతిష్యుల వద్దకు అభ్యర్థుల క్యూ 


ఏడికి అక్కా.. పొద్దుగాల్నే పోతుండు.. దావత్‌కా ఏంది.. లేదురా.. నామినేషన్‌  యేసేందుకు మంచి ముహుర్తం కోసం అయ్యోరు తానికి పోతున్నం..ఇయాటి నుంచి నామినేషన్‌లు షురూ అవుతున్నయి. ఎప్పుడు ఏస్తే మంచిగుంటది.. ప్రచారం ఏడికెళ్లి మొదలు పెట్టాలా.. అనేది తారీఖులు అడుగుతా. అసలే కార్తీక మాసం కదా అయ్యార్లు దొరకరు. ముందే పోతే మంచిగుంటది..


టికెట్టు రాలే కదా బావ గిప్పుడే గీ ముహుర్తం తతంగం ఎంటీ.. 

చల్‌ నోర్ముయ్‌.. టికెట్టు మనకే  వస్తది.. నామినేషన్‌ మనమే ఎయ్యాలే..  అయ్యోరి దగ్గరకు పోతే జ్యోతిష్యం కూడా సెప్తడు. ఇగ ఏం మాట్లాడకు పనిమీద పోతునప్పుడు పిల్లి లెక్క నీ ప్రశ్నలేందిరా.. అంటూ వారు నామినేషన్‌కు ముహుర్తం కోసం ఓ పండితుడి దగ్గరికి వెళ్లారు.  


బంజారాహిల్స్‌, నవంబర్‌ 18 (ఆంధ్రజ్యోతి): బల్దియా ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. కొన్ని పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థుల వ్యవహారం తేల్చలేదు. రేపు  నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ. దీంతో ఆశావహులు పార్టీ బీ ఫారం ఇచ్చినా, ఇవ్వకపోయినా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అనుకున్నట్లు తమకే టికెట్‌ రావాలని, ప్రచారం సజావుగా సాగడంతోపాటు విజయం దక్కాలని ముం దస్తుగానే పండితులు, జ్యోతిష్యుల వద్దకు వెళ్తున్నారు. కీలకమైన నామినేషన్‌ ఏ తిథిలో, ఏ నక్షత్రంలో వేయాలన్న విషయాన్ని తెలుసుకునేందుకు కొందరు ఆశావహులు శ్రద్ధ చూపుతున్నారు. ప్రచారం ప్రారంభించేందుకు శుభ తిథి, ఏ దిక్కు నుంచి ప్రచారం ప్రారంభించాలన్న ప్రశ్నావళితో  జ్యోతిష్యులను ఆశ్రయిస్తున్నారు. కార్తీక మాసం మొదలైంది. సాధారణంగా ఈ మాసంలో అన్ని రోజులూ మంచివే అంటారు. కానీ, నామినేషన్ల దాఖలు తక్కువ వ్యవధి ఉంది.  చాలా మంది ఆశావహులు  జ్యోతిష్యులు, పండితులు చెప్పిన సమయానికి నామినేషన్‌ వేసేందుకు సిద్ధపడుతున్నారు. వారి వద్దకు క్యూ కడుతున్నారు. దీంతో జ్యోతిష్యులు, పండితులు  ఇన్నాళ్లు పక్కన పెట్టిన పంచాంగాలు తిరగేస్తున్నారు. 


నేడు మంచి ముహూర్తం..

మూఢాలు ఉన్నప్పటికీ ఎన్నికలోస్తే పోటీ చేయకతప్పదు. ఉన్న రోజుల్లోనే కలిసి వచ్చే శుభముహూర్తం పెట్టమని పండితులు, జ్యోతిష్యులపై అభ్యర్థులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం పంచమి భేషుగ్గా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ ముహూర్తంలో పెద్ద ఎత్తున వివాహాలు కూడా జరుగనున్నాయి. దీంతో చాలా మంది అభ్యర్థులు, ఆశావహులు గురువారం ఓ సెట్‌ నామినేషన్‌ వేసి, శుక్రవారం భారీ ర్యాలీలతో మరో సెట్‌ నామినేషన్‌ వేయాలని యోచిస్తున్నారు. 


సంఖ్యా శాస్త్రం ఏం చెబుతుంది..

ఎన్నికలైనా, శుభకార్యమైనా సంఖ్యాశాస్త్రం ప్రకారం మంచి ముహూర్తం నిర్ణయించవచ్చునని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. పుట్టిన తేదీతో పాటు మరికొన్ని వివరాలు ఉంటే మంచి ముహూర్తం పెట్టవచ్చునని అంటున్నారు. చాలా మంది  సంఖ్యాశ్రాస్త నిపుణులను సంప్రదించి, ముహూర్తాలు చూసుకుంటారని అన్నారు. ఎన్ని ముహూర్తాలు చూసుకున్న, ప్రజా సేవ చేసే నాయకుడికే విజయం దక్కుతుందన్న విషయం ఇక్కడ గమనార్హం. 

Updated Date - 2020-11-19T09:39:53+05:30 IST