ఎంటెక్ చేసి కానిస్టేబుల్‌గా... ఉప్పల్ కానిస్టేబుల్‌కు జాతీయ అవార్డు
ABN , First Publish Date - 2020-12-17T06:26:31+05:30 IST
ఎంటెక్ చేసి కానిస్టేబుల్‌గా... ఉప్పల్ కానిస్టేబుల్‌కు జాతీయ అవార్డు

ఉప్పల్, డిసెంబర్ 16 (ఆంధ్రజ్యోతి) : ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దండబోయిన శివరాణి హోంమంత్రిత్వ శాఖ జాతీయ అవార్డును అందుకున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నేషనల్ క్రైం రికార్డు బ్యూరో ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్లలో అమలు చేస్తున్న సెంట్రల్ క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్కింగ్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎస్)లో ఉత్తమమైన పనితీరు కనబరిచినందుకు గాను శివరాణికి ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. రోజూ పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులకు చెందిన ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకూ అన్ని దశల్లో జరిగిన నేర పరిశోధనలకు సంబంధించిన ప్రతులను సీసీటీఎన్‌ఎస్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ వ్యాప్తంగా ముగ్గురు పోలీసులు ఎంపిక కాగా అందులో ఉప్పల్ నుంచి శివరాణి ఎంపికయ్యారు. ఆమెను రాచకొండ సీపీ మహేష్ భగవత్, ఉప్పల్ ఇన్‌స్పెక్టర్ రంగస్వామితో పాటు ఉప్పల్ పోలీసు స్టేషన్ సిబ్బంది అభినందించారు.
ఎంటెక్ చేసి కానిస్టేబుల్‌గా...
నగరశివారుల్లోని ఘట్‌కేసర్‌కు చెందిన శివరాణిది నిరుపేద కుటుంబం. 6వ తరగతి చదువుతున్నప్పుడే ఆమె తండ్రి కృష్ణయ్య చనిపోయాడు. తల్లి బాలమణి వ్యవసాయ కూలీగా పనిచేసి శివరాణిని చదివించింది. ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన శివరాణి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. ఇంటర్, బీటెక్, ఎంటెక్.. అన్నీ ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో చదివారు. ఎస్‌ఐ ఉద్యోగం కోసం ప్రయత్నించగా ఈ వెంట్స్‌లో జస్ట్ మిస్ అయింది. కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించింది. ఆర్థిక ఇబ్బందులకు తోడు వృద్ధురాలైన తల్లిని పోషించుకోవడానికి ఆ ఉద్యోగంలో చేరినట్లు శివరాణి తెలిపారు. ఈ అవార్డు సాధించడానికి ఇన్‌సెక్టర్ రంగస్వామి, ఇంతకు ముందు పనిచేసిన ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఎంతో సహకరించారని తెలిపారు. తన విధుల్లో సహకరించిన పోలీసు అధికారులకు, తోటి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తన లక్ష్యం ఎస్‌ఐ కావడమని, తప్పకుండా సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. లేదంటే గ్రూప్స్ ఉద్యోగాలు సాధిస్తాన్నారు.