ఏటీఎంలో డబ్బు చోరీ కేసు ఛేదన
ABN , First Publish Date - 2020-09-18T09:32:07+05:30 IST
హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బు చోరీ కేసును హయత్‌నగర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రూ. 8.95 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు

ఇద్దరు నిందితుల అరెస్టు
రూ 8.95 లక్షలు స్వాధీనం
కొత్తపేట, సెప్టెంబర్ 17 (ఆంధ్రజ్యోతి) : హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో డబ్బు చోరీ కేసును హయత్‌నగర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రూ. 8.95 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. ఎల్‌బీనగర్ సీపీ క్యాంపులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు.
డబ్బు జమ చేసే కస్టోడియనే...
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం, బసువుపల్లి గ్రామానికి చెందిన చదర్ల వినయ్ (22) ఉప్పల్ శాంతినగర్‌లో ఉంటూ సికింద్రాబాద్ సెక్యూర్ వ్యాల్యూ ఇండియా లిమిటెడ్‌లో కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. అతడు బ్యాంకుల ఏటీఎంలలో డబ్బును డిపాజిట్ చేసే విధులు నిర్వహిస్తున్నాడు. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల గ్రామానికి చెందిన కొండా రాఘవేందర్‌గౌడ్ (22) బేగంపేట భవాని బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ కొంతకాలం ఏటీఎంలలో డబ్బు డిపాటిట్ చేసే సికింద్రాబాద్ ప్రకాష్‌నగర్‌లోని రైటర్ సేఫ్‌గార్డ్‌లో పనిచేశాడు. వారిద్దరూ స్నేహితులు. కరోనా కట్టడి కారణంగా రాఘవేందర్‌గౌడ్ ఉద్యోగం మానేశాడు. ఈ నేపథ్యంలో ఏటీఎంలో డబ్బు కాజేయాలని వినయ్, రాఘవేందర్‌గౌడ్ పథకం వేశారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 11.30 గంటలకు వినయ్, తన సహోద్యోగి కాకళ్ల లింగస్వామితో కలిసి హయత్‌నగర్ బొమ్మలగుడి, రాజరాజేశ్వరి కాలనీలో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో రూ. 13 లక్షలు డిపాజిట్ చేశారు.
మరుసటి రోజు సాయంత్రం వినయ్ సదరు ఏటీఎం సేఫ్‌డోర్ కాంబినేషన్ (క్యాష్ క్యాసెట్స్ డిపాటిజ్ చేసేందుకు వాడిన పాస్‌వర్డ్)ను రాఘవేందర్‌కు అందజేశాడు. 13వ తేదీన రాఘవేందర్‌గౌడ్ ఏటీఎం సేఫ్‌డోర్ కాంబినేషన్ ఉపయోగించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఏటీఎం నుంచి రూ. 9 లక్షలు కాజేశాడు. ఆ తర్వాత వినయ్, రాఘవేందర్‌గౌడ్ ఆ డబ్బును పంచుకున్నారు. అదే రోజు సాయంత్రం ఏటీఎం నుంచి డబ్బు దొంగిలించారని అధికారులు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నాగార్జున క్రైమ్ టీం రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఏటీఎం సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారే ఈ చోరీకి ప్పాడి ఉండవచ్చని నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత కస్టోడియన్ వివరాలను సేకరించారు. గురువారం నిందితులను ఉప్పల్‌లో అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం అంగీకరించడంతో వినయ్ నుంచి రూ. 4.48 లక్షలు, రాఘవేందర్‌గౌడ్ నుంచి రూ. 4.47 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో ...
గతేడాది అక్టోబర్2వ తేదీ రాత్రి ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎంను గ్యాస్ కట్టర్లతో తెరిచిన హర్యానాకు చెందిన ఐదుగురు సభ్యులుగల ముఠా రూ. 14 లక్షలు చోరీ చేసింది. ఆ ముఠాలోని నలుగురిని క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రూ. 10.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీ రాత్రి హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మదర్ డెయిరీ వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎంను గుర్తుతెలియని దుండగులు గ్యాస్ కట్టర్లతో తెరచి రూ. 6.35 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమావేశంలో హయత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ సురేందర్ పాల్గొన్నారు.