ఏఎస్‌రావునగర్‌లో 59 మంది కర్ణాటక వాసులకు కరోనా అనుమానిత వైద్య పరీక్షలు

ABN , First Publish Date - 2020-03-21T09:37:17+05:30 IST

:ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ అణుపురం కాలనీ కమ్యూనిటి హాలులో గురువారం అర్ధరాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు కర్ణాటక ఆర్టీసీ బస్సులో అక్కడి వారు రావడంతో గమనించిన స్ధానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ఏఎస్‌రావునగర్‌లో 59 మంది కర్ణాటక వాసులకు కరోనా అనుమానిత వైద్య పరీక్షలు

అణుపురం ఫంక్షన్‌ హాలులో ఓ వివాహ వేడుకకు హాజరైన కర్ణాటక వాసులు 

స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన మేడ్చల్‌ జిల్లా అధికార యంత్రాంగం

ఎవరికీ వైరస్‌ లక్షణాలు లేవని నిర్ధారించిన వైద్య శాఖ

ఊపిరి పీల్చుకున్న స్థానికులు


ఏఎస్‌రావునగర్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి):ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ అణుపురం కాలనీ కమ్యూనిటి హాలులో గురువారం అర్ధరాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు కర్ణాటక ఆర్టీసీ బస్సులో అక్కడి వారు రావడంతో గమనించిన స్ధానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. కలెక్టర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్థానిక రెవిన్యూ, పోలీసు, వైద్య బృందాలు అణుపురం కమ్యూనిటి హాలుకు చేరుకుని కర్ణాటక రాష్ట్రం సదరు వివాహవేడుకకు వచ్చిన 59 మందిని గుర్తించి  కాప్రా వైద్యాధికారి సంపత్‌ ఆధ్వర్యంలో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎవ్వరికీ ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అందరినీ అక్కడి నుంచి సొంత రాష్ట్రానికి పంపించి వేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపధ్యంలో ప్రజలెవరూ ఆందోళనకు గురికావద్దని, వైరస్‌ కట్టడికి, నివారణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్‌ వాసం వేంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, వైద్యాధికారి సంపత్‌లను ఆయన అభినందించారు. 

Updated Date - 2020-03-21T09:37:17+05:30 IST