ఒకచోట దించాల్సిన సరుకు మరోచోట..

ABN , First Publish Date - 2020-06-18T09:58:26+05:30 IST

ప్లాస్టిక్‌ వస్తువుల తయారీకి ఉపయోగించే రూ. 24 లక్షల విలువైన ముడిసరుకును మరో ఫ్యాక్టరీలో ఖాళీ చేయించిన నలుగురు

ఒకచోట దించాల్సిన సరుకు మరోచోట..

లారీ డ్రైవర్‌ను మోసం చేసిన కంపెనీ ఉద్యోగి

నలుగురు నిందితుల అరెస్టు


హసన్‌నగర్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్‌ వస్తువుల తయారీకి ఉపయోగించే రూ. 24 లక్షల విలువైన ముడిసరుకును మరో ఫ్యాక్టరీలో ఖాళీ చేయించిన నలుగురు నిందితులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌చక్రవర్తి, ఇన్‌స్పెక్టర్‌ కేతూరి నర్సింహ వివరాలు వెల్లడించారు. ఈనెల 14న తమిళనాడు నుంచి ఓ లారీలో ముడిసరుకు తీసుకొని కాటేదాన్‌లోని బసుదేవ్‌ కంపెనీకి డ్రైవర్‌ సెంగుట్టి వచ్చాడు. కంపెనీ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి లారీని రామ్‌చరణ్‌ ఆయిల్‌ మిల్‌ వద్ద ఆపాడు.


బసుదేవ్‌ కంపెనీలో పనిచేసే బండ్లగూడ జాగీర్‌ ప్రాంతానికి చెందిన కుమార్‌ ప్రియమ్‌వద్‌(30)కు సరుకు తమిళనాడు నుంచి వస్తున్న విషయం తెలుసు. అతడు డ్రైవర్‌ వద్దకు వెళ్లి ఫ్యాక్టరీలో సరుకు దించమని చెప్పాడు. కంపెనీలో స్థలం లేనందున తమ గోడౌన్‌లో ఖాళీ చేస్తామని చెప్పిన ప్రియమ్‌వద్‌ స్నేహితులు ఠాకూర్‌ ధారజ్‌ (38), సందీప్‌ బేద్‌(42), కుమార్‌ప్రియావత్‌(34) సహకారంతో రెండు డీసీఎంలలో సరుకును తీసుకెళ్లి కాటేదాన్‌లో ఓ ఫ్యాక్టరీలో అన్‌లోడ్‌ చేయించాడు.  


సరుకు రాలేదని ఫోన్‌ చేయడంతో.. 

సరుకు రాకపోవడంతో బసుదేవ్‌ కంపెనీ నిర్వాహకులు తమిళనాడులోని ట్రాన్స్‌పోర్ట్‌కు ఫోన్‌ చేశారు. వారు డ్రైవర్‌ సెంగుట్టికి ఫోన్‌ చేయగా.. ఇప్పుడే అన్‌లోడ్‌ చేశారని.. తాను భోజనం చేస్తున్నానని చెప్పాడు. మోసం జరిగిందని భావించి ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని సెంగుట్టికి ఫోన్‌ చేసి స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పాడు. అదేరోజు సరుకును నలుగురు వ్యక్తులు లారీలోని సరుకును వేరేచోట ఖాళీ చేయించారని ఫిర్యాదు చేశాడు. 


సీసీ ఫుటేజీల ఆధారంగా..

కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సరుకును అన్‌లోడ్‌ చేసిన ప్రాంతంలో సీసీ ఫుటేజీలు పరిశీలించారు. సరుకును లారీ నుంచి అన్‌లోడ్‌ చేసిన కంపెనీలోకి వెళ్లి ఆరా తీయగా.. కుమార్‌ ప్రియమ్‌వద్‌, ఠాకూర్‌ ధీరజ్‌, సందీ్‌పకుమార్‌ బేద్‌, కుమార్‌ ప్రియవత్‌ వెయ్యి బస్తాల ప్లాస్టిక్‌ ముడిసరుకును బసుదేవ్‌ కంపెనీలో కాకుండా వేరేచోట దించినట్లు తెలిసింది. నిందితులను బుధవారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.  

Updated Date - 2020-06-18T09:58:26+05:30 IST