బీజేపీలో చేరికపై అంజన్ కుమార్ యాదవ్ ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2020-11-19T17:51:51+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో

బీజేపీలో చేరికపై అంజన్ కుమార్ యాదవ్ ఏమన్నారంటే..

హైదరాబాద్ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిన విషయం విదితమే. జీహెచ్‌ఎంసీ ఏర్పాటైన తొలినాళ్లలో మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న ఆ పార్టీ.. ప్రస్తుతం తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే ఇబ్బందులు పడుతున్న స్థితికి చేరింది. మరీ ముఖ్యంగా ఒకప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో అన్నీ తానై చూసుకున్న కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంతేకాదు.. ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఆయన మీడియా ముందుకొచ్చి అసలు తానెందుకు సైలెంట్‌గా ఉన్నారు..? ఆయనకు నిజంగానే అధిష్టానం ప్రాధాన్యత ఇవ్వట్లేదా..? బీజేపీలో చేరతారన్న వార్తల్లో నిజమెంత..? యాదవ్ అసంతృప్తిగానే ఉన్నారా..? ఇలా పలు విషయాలపై మీడియా మీట్ నిర్వహించి మరీ క్లారిటీ ఇచ్చుకున్నారు.


యాదవ్ మాటల్లోనే..

గ్రేటర్ ఎన్నికల ప్రక్రియలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కానీ బీ- ఫామ్‌లు ఇవ్వడం కానీ నా ద్వారా జరగాల్సి ఉండే.. కానీ అలా జరగలేదు. అందుకే అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను. నేను బీజేపీలోకి  వెళ్లట్లేదు. అదంతా తప్పుడు ప్రచారం మాత్రమే. కొంతమంది కావాలనే నాపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ కోసం పార్లమెంటులో కొట్లాడిన వ్యక్తిని నేను. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వదిలను. నేను అసంతృప్తిగా ఉన్నానని నాతో కాంగ్రెస్ పెద్దలు అందరూ మాట్లాడారు. వారి మాటలతో సంతృప్తి చెందాను. కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది. అందరం కలిసి కట్టుగా పని చేస్తాం. బీజేపీ ప్రజల మధ్య మతం పేరుచెప్పి ఓట్లు సాధించాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్‌ పార్టీ. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే మా అభ్యర్థులను గెలిపిస్తుందిఅని అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.


గ్రేటర్‌ కాంగ్రెస్‌ అస్తవ్యస్తం

కాగా.. గ్రేటర్‌ కాంగ్రె‌స్‌లోని హేమహేమీ నేతలంతా ఆరేళ్లుగా ఇతర పార్టీల్లోకి వలస పోతుండడంతో పలు డివిజన్లలో పార్టీ అభ్యర్థులను నిలపడం నాయకత్వానికి సవాల్‌గా మారింది. గతంలో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం నాయకులు ఎన్నో తిప్పలు పడేవారు.. పైరవీలు చేసేవారు. కానీ.. ప్రస్తుతం పిలిచి టికెట్‌ ఇచ్చినా పోటీ చేయడానికి కొంతమంది నేతలు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సందర్భంలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు మినహా.. మిగతా సందర్భాల్లో పట్టించుకునేవారు లేకపోవడంతో పార్టీ కార్యకర్తలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి, శేరిలింగంపల్లి నేత రవికుమార్‌ యాదవ్‌ కాషాయ కండువా కప్పుకొన్నారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ కూడా కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోది. దీంతో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ ఈసారి ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాల్సిందే.

Updated Date - 2020-11-19T17:51:51+05:30 IST