నిత్యావసరాలు ప్రియం

ABN , First Publish Date - 2020-03-23T09:06:54+05:30 IST

నగరంలో రోజువారీగా ఇళ్లకు సరఫరా అయ్యే పాల ప్యాకెట్లను బయట అధిక ధరలకు విక్రయించారు.

నిత్యావసరాలు ప్రియం

దొరకని పాలు, కూరగాయలు

నగరవాసుల తీవ్ర ఇబ్బందులు

ముందురోజు భారీ ఎత్తున కొనుగోలు

31 వరకు లాక్‌డౌన్‌తో కొరత సృష్టించే అవకాశం


జనతా కర్ఫ్యూలో నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు యథావిధిగా సరఫరా ఉంటాయనడంతో నగరంలోని బాగ్‌లింగంపల్లిలో ఉండే నవీన్‌ రోజు మాదిరిగా ఇంటికే వస్తాయనే ధీమాతో ఉన్నాడు. తన ఇంటి చుట్టు పక్కలవారు శనివారం రాత్రే పాలు, కూరగాయలు ఇతర నిత్యావసర సరుకులను తెచ్చి పెట్టుకుంటుండగా.. అంత ఇబ్బందేమీ ఉండదని శ్రీనివాస్‌ భావించాడు.


అయితే.. ఆదివారం ఉదయం 9 గంటల వరకూ పాల ప్యాకెట్లు ఇంటికి రాలేదు. రోజూ పాలప్యాకెట్లను వేసే వ్యక్తికి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. ఇంట్లో చిన్న పాపకు పాలు అత్యవసరం. దీంతో బయటకు వెళ్లి తీసుకోద్దామని పలు షాపులను తిరిగాడు. కొన్ని మూసేసి ఉన్నాయి. తీసి ఉన్న షాపుల్లో మాత్రం పాల ప్యాకెట్లు లేవని, ఎప్పుడో అయిపోయాయని చెప్పారు. చేసేది లేక ఒట్టి చేతులతో ఇంటికొచ్చాడు. ఇలాంటి పరిస్థితి నగరంలోని పలువురు ఎదుర్కొన్నారు.


హైదరాబాద్‌ సిటీ, మార్చి22 (ఆంధ్రజ్యోతి) : నగరంలో రోజువారీగా ఇళ్లకు సరఫరా అయ్యే పాల ప్యాకెట్లను బయట అధిక ధరలకు విక్రయించారు. ఈ జనతా కర్ఫ్యూ ఆదివారానికి పరిమితమవ్వదని, ఇంకా ముందుకు జరిపే అవకాశముందని భావించిన చాలా మంది ఒకేసారి ఎక్కువ పాల ప్యాకెట్లను కొనుగోలు చేశారు. ఆదివారం తెల్లవారుజామున పాల ప్యాకెట్లను విక్రయించే వివిధ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కనీసం 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు కొనుగోలు చేశారు. ఎంత ధరైనా పెట్టేందుకు జనాలు ఆసక్తి చూపడంతో పాల ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయించారు. అర లీటర్‌ పాలను రూ.30 నుంచి రూ.40 వరకు విక్రయించడం విశేషం. వివిధ ప్రాంతాల్లో లీటర్‌ పాలను రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయించారు. ఉదయం 7 గంటల వరకే దాదాపుగా అన్ని షాపుల్లో, వివిధ ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల విక్రయాలు బందయ్యాయి. 


శనివారం రాత్రే భారీగా కొనుగోలు...

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం కిరణా షాపులు, సూపర్‌ మార్కెట్లు కిటకిటలాడాయి. నిత్యావసర సరుకులను రెండు నెలలకు సరిపడా కొనుగోలు చేశారు. వివిధ ప్రాంతాల్లో పాల ప్యాకెట్లను పెద్దఎత్తున కొనుగోలు చేశారు. శనివారం రాత్రి 8 గంటల వరకు నగరంలోని అన్ని కిరణా షాపులు, సూపర్‌ మార్కెట్లలో పాల ప్యాకెట్లు లేవంటూ బోర్డు పెట్టేశారు. శనివారం రాత్రే పాల ప్యాకెట్లకు పెద్దఎత్తున డిమాండ్‌ ఉండడంతో ఆదివారం తెల్లవారుజామున అధిక ధరలకు విక్రయించారు. రోజువారీగా ఇంటింటికీ సరఫరా చేసే పాల ప్యాకెట్లను నిలిపివేసి అధిక ధరలకు అమ్ముకోవడానికే ఇలా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. 


పెరిగిన చికెన్‌ ధరలు...

నగరంలో ఆదివారం అత్యధిక ఇళ్లలో నాన్‌వెజ్‌ను ఇష్టపడుతుంటారు. చికెన్‌, మటన్‌, చేపలను కొనుగోలు చేసి ఇంటిల్లిపాది ఆరగిస్తారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం రాత్రి పెద్దఎత్తున చికెన్‌ కొనుగోలు చేయడానికి పోటీపడ్డారు. రాత్రి 12 గంటల వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చికెన్‌ సెంటర్లు పని చేశాయి. రెండు రోజుల క్రితం వరకు చికెన్‌ కిలో రూ.30, రూ.50లకే విక్రయించగా, శనివారం రాత్రి మాత్రం జనాల తాకిడి పెరగడంతో కిలో రూ.100కు విక్రయించారు.


నెల రోజులుగా చికెన్‌ సెంటర్లు బోసిపోయి ధరలు పడిపోయాయి. చికెన్‌ తింటే వైరస్‌ వస్తుందనే దుష్ప్రచారంతో ఫౌల్ర్టీ ఫామ్‌ కొలుకోలేని స్థితికి చేరింది. చికెన్‌ తింటే ఎలాంటి ఇబ్బందులుండవని 15 రోజులుగా మంత్రుల దగ్గర నుంచి ఫౌల్టీఫామ్‌ అధినేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ అనుహ్యాంగా జనతా కర్ఫ్యూ నేపథ్యంలో శనివారం రాత్రి చికెన్‌ సెంటర్లు కళకళలాడాయి. 


లాక్‌డౌన్‌ పేరుతో కొరత సృష్టించే అవకాశం...

ఆదివారం ఒక్కరోజు జనతా కర్ఫ్యూతో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించారు. వీధుల్లోని కిరణా షాపుల దగ్గర నుంచి సూపర్‌ మార్కెట్ల వరకు వివిధ రకాల నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మారు. చాలా మంది రెండు నెలలకు సరిపడా సరుకులను తీసుకెళ్తుండడంతో అందుకనుగుణంగా రేట్లను పెంచేసి విక్రయించారు. తాజాగా పది రోజుల పాటు తెలంగాణ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో నిత్యావసర వస్తువులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి కొరత సృష్టించే అవకాశాలున్నాయి. కొరత వల్ల ఆయా వస్తువుల ధరలను విపరీతంగా పెంచేసి సొమ్ము చేసుకునేందుకు ఆస్కారం ఉంది.


మొన్నటి వరకు ఉలిగడ్డ నగరవాసులకు కన్నీరు తెప్పించగా, ఇప్పుడిప్పుడు ధరలు దిగివస్తున్నాయి. ఉప్పులు, పప్పులు, చింతపండు తదితర నిత్యావసర ధరలు ఆకాశాన్నంటకపోతే పది రోజుల పాటు లాక్‌డౌన్‌ నిర్వహించినా ఏలాంటి సమస్యలు తలెత్తవు. కానీ కృత్రిమ కొరతతో ధరలు విపరీతంగా పెరిగితే పది రోజుల పాటు ఎలాంటి పనుల్లేకుండా ఇంట్లో ఉండేవారికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే ప్రమాదముంది. అయితే కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు నిత్యావసరాలను విక్రయించేవారిపై ఫోన్‌లో సమాచారమిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Updated Date - 2020-03-23T09:06:54+05:30 IST