అమ్మ తోడు..!
ABN , First Publish Date - 2020-11-26T06:01:36+05:30 IST
రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం.. రోడ్లు వేస్తేనే మేము ఎన్నికల్లో ఓట్లు వేస్తాం.. లేకుంటే వేసేది లేదు.. అని యాప్రాల్ ప్రజలు ఈ నెల 22న నిరసన చేపట్టారు.

ప్రచారంలో నేతల ప్రమాణాలు
తమ సమస్యలపై నిలదీస్తున్న ప్రజలు
వాటిని వీడియో తీసి, నెట్టింట..
షేరింగ్‌లతో వైరల్ చేస్తున్న ప్రత్యర్థి పార్టీలు
ప్రచారానికి వెళ్లేందుకు వణికిపోతున్న నేతలు, అభ్యర్థులు
‘గ్రేటర్’ ప్రచారంలో వేడెక్కిన రాజకీయం
హైదరాబాద్ సిటీ, నవంబర్ 25 (ఆంధ్రజ్యోతి): రోడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాం.. రోడ్లు వేస్తేనే మేము ఎన్నికల్లో ఓట్లు వేస్తాం.. లేకుంటే వేసేది లేదు.. అని యాప్రాల్ ప్రజలు ఈ నెల 22న నిరసన చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును అడ్డుకుని, ‘నో రోడ్స్.. నో వోట్స్’తో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన వెంటనే సొంత నిధులతో రోడ్లు బాగు చేయిస్తానని ఎమ్మెల్యే తనపై తాను ప్రమాణం చేశారు. తన లెటర్ ప్యాడ్‌పై హామీపత్రం రాసి సంతకం చేసి స్థానికులకు అందించడంతో వారు శాంతించారు. జాంబాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌కు మద్దతుగా ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈనెల 23న ప్రచారానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఓ మహిళ ఆయన ముందు తమ సమస్యలు ఏకరువు పెట్టింది. ఎన్నికల తర్వాత సాయం తప్పకుండా ఇప్పిస్తానని ఆయన ఆమెకు హామీ ఇచ్చారు. వరదసాయాన్ని నేతలు తమ ఇష్టమొచ్చినోళ్లకే ఇచ్చారని, మురుగునీరు, దోమలతో తాము పడ్డ ఇబ్బందిని ఎవరూ పట్టించుకోలేదని రాజేంద్ర నగర్‌లో ఓ మహిళ టీఆర్‌ఎస్ నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. సాయం చేయకపోతే తమ దగ్గరికి రానే రావద్దని తెగేసి చెప్పింది. ఈ సందర్భంగా వీడియో తీసిన కొంతమంది, సోషల్ మీడియాలో పెట్టడంతో ఘటన వైరల్ అయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ముంగిట ఇవీ నగరంలో కనిపిస్తున్న కొన్ని సన్నివేశాలు. ప్రజల్లో ఉన్న అసహనాన్ని ప్రత్యర్థి పార్టీలు మరింత వేగంగా జనంలోకి తీసుకెళ్లి తమకు అనుకూలంగా మార్చుకోవాలని యత్నిస్తున్నాయి.
ఓటర్ల ప్రశ్నలకు బెంబేలు
గ్రేటర్ ఎన్నికల్లో టికెట్లు దక్కాయని సంబరపడిన అభ్యర్థులకు, తాజాగా ఓటర్లను ఎలా ఎదుర్కోవాలో అన్న బెంగ పట్టుకుంది. ఏ ప్రాంతంలో ఎవరు ఎలా స్పందిస్తారో తెలియని పరిస్థితి ఉండటంతో బెంబేలెత్తుతూనే ఓట్ల అభ్యర్థనకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓటర్లను బుజ్జగించేందుకు గాను.. గెలిపిస్తే సమస్యల్ని తీరుస్తామంటూ వాగ్దానాలు చేస్తున్నారు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన కొంతమంది కార్పొరేటర్లు తమ డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టలేదు. అప్పటి సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వారిలో కొంతమంది సిటింగులకే ఈసారి మళ్లీ టికెట్లు దక్కడంతో ప్రజల వద్దకు వెళ్లక తప్పట్లేదు. ఈ క్రమంలో ప్రజలు వారిని నిలదీస్తున్న వీడియోలను ప్రతర్థి పార్టీల వారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ఇతర జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు సైతం ‘తిరుగుబాటు’ వీడియోలతో ఆందోళనకు గురవుతున్నారు. వీడియోల కారణంగా తమ ప్రతిష్ఠ ఎక్కడ మసకబారు తుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఒక పార్టీ అభ్యర్థిని ఓటర్లు అడ్డుకున్న సంఘటన వీడియోలను వైరల్ చేస్తే.. మరో పార్టీ అదే తరహాలో ఉన్న ఎదుటి పార్టీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టే వీడియోలను వైరల్ చేస్తోంది. అవసరమైతే.. తమ కార్యకర్తలతోనే ప్రత్యర్థుల్ని ప్రశ్నించేలా చేసి, వీడియోలు చిత్రీకరిస్తున్నారు.
ఈసారి చేస్తా.. ప్రామిస్!
ఓటర్ల ప్రశ్నలను ఎదుర్కొనేందుకు, వారిని తమకే ఓటేసేలా చేసేందుకు అభ్యర్థులు ఏకంగా తమపైనే తాము ప్రమాణం చేసుకుంటున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఓ పార్టీ అభ్యర్థి ప్రచారంలో తన నెత్తిన ఒట్టు వేసుకుని హామీ ఇచ్చారు. మరో అభ్యర్థైతే.. గతంలో తనను గెలిపిస్తే కొంతవరకే పనులు చేశానని, ఈసారి మాత్రం అన్నీ పూర్తి చేస్తానని ఓటరు ఇంట్లోని దేవుళ్ల ఫొటోలపై ప్రమాణం చేసినట్లు సమాచారం. మొత్తంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం ఇలా మూడు నిలదీతలు, ఆరు ప్రమాణాలుగా ఆసక్తికరంగా సాగుతోంది.