మద్యం, కల్లు దొరకక అవస్థలు
ABN , First Publish Date - 2020-04-01T09:20:36+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ మూలంగా మద్యం, కల్లు దొరకక వందలాది మంది మానసిక కుంగుబాటుకు గురువుతున్నారు.

మానసిక ఆస్పత్రికి పోటెత్తుతున్న మద్యం అలవాటున్నవారు
ఎర్రగడ్డ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ మూలంగా మద్యం, కల్లు దొరకక వందలాది మంది మానసిక కుంగుబాటుకు గురువుతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మద్యానికి బానిసైన వారు మద్యం దొరకక కుంగుబాటుకు గురై ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి చేరుతున్నారు. మంగళవారం ఒక్కరోజే ఆస్పత్రిలో 185 కేసులు నమోదయ్యాయి. వీరంతా వారం రోజులుగా మద్యం దొరకక కుంగుబాటుకు గురైనవారే. చాలామంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో మద్యం అందక సోమవారం 94 మంది ఆస్పత్రికి రాగా మంగళవారం 185కు చేరింది.
ఆస్పత్రికి వచ్చిన రోగులు వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో 80 శాతం మధ్య వయస్కులే ఉన్నారు. మంగళవారం వచ్చిన 185 మంది పేషెంట్లలో 48 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నట్టు మరొక 90 మందిని అబ్జర్వేషన్లో పెట్టినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. బుధవారం వరకు వారి పరిస్థితిని చూసి విషమంగా ఉన్నవారిని అడ్మిట్ చేసుకుని మిగతా వారిని పంపించనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మద్యానికి అలవాటు పడి కుంగుబాటుకు గురైన 108 మందిని అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు.