దూమపానానికి అడ్డా డీఎంఈ కార్యాలయ ప్రాంగణం

ABN , First Publish Date - 2020-09-14T09:33:37+05:30 IST

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలన్నీ ఒకే చోటు నుంచి నిర్వహించే ప్రాంతం ఇప్పుడు ధూమపానానికి అడ్డాగా మారింది. వైద్య ఆరోగ్య శాఖ కమాండ్‌ అండ్‌

దూమపానానికి అడ్డా డీఎంఈ కార్యాలయ ప్రాంగణం

వైద్యులు, అధికారుల మొఖంపైకి సిగరెట్‌ పొగను వదులుతున్న వైనం

తరచూ వాగ్వాదాలు

టీ స్టాల్‌లోనే సిగరెట్ల అమ్మకాలు

పట్టించుకోని సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు


మంగళ్‌హాట్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): 

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలన్నీ ఒకే చోటు నుంచి నిర్వహించే ప్రాంతం ఇప్పుడు ధూమపానానికి అడ్డాగా మారింది. వైద్య ఆరోగ్య శాఖ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూం, డీఎంఈ, డీహెచ్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌, ఎండీ కార్యాలయాలు ఉన్న ప్రాంతంతో పాటు బోధనాస్పత్రుల సూపరింటెండెంట్‌లు, హెచ్‌ఓడీలతో నిత్యం రద్దీగా కనిపించే కోఠిలోని డీఎంఈ కార్యాలయ ప్రాంగణం సిగరెట్ల పొగతో గుప్పుమంటోంది. కనీసం ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఉన్నారన్న జ్ఞానం లేకుండా బయటి నుంచి వచ్చే వారితో పాటు కొంత మంది సిబ్బంది డీఎంఈ కార్యాలయానికి ఎదురుగా ఉన్న టీ స్టాల్‌ ముందు సిగరెట్లు తాగుతున్నారు. 


టీ స్టాల్‌లోనే సిగరెట్ల అమ్మకాలు..

డీఎంఈ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న టీ స్టాల్‌లో టీతో పాటు సిగరెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. టీ స్టాల్‌ పక్కనే ధూమపానం తాగడం నిషేధిత ప్రాంతం అనే బోర్డు తగిలించినా సిగరెట్లు అమ్మడం, పొగతాగేవారికి స్టాల్‌ పక్కనే బేంచీలు వేసి మర్యాదలు చేయడంపై విమర్శలు గుప్పుమంటున్నాయి. అసలు డీఎంఈ కార్యాలయ ప్రహరీ లోపల ఉన్న టీ స్టాల్‌లకు అనుమతులు ఉన్నాయా...? అనే దానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఇదిలా ఉండగా స్థానికంగా ఉండే సుల్తాన్‌బజార్‌ యువకులు, స్థానికులు డీఎంఈ కార్యాలయం ఎదురుగా ఉన్న గేటు దూకి మరీ సిగరెట్లు తాగేందుకు కార్యాలయం ప్రాంగణంలోకి వస్తున్నారు. దీంతో డీఎంఈ, డీహెచ్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీ కార్యాలయాల నుంచి అధికారులు బయటకు రావాలంటేనే ఇబ్బంది కరంగా మారింది. డీఎంఈ కార్యాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.


తరచూ వాగ్వాదాలు..

స్థానికంగ ఉండే యువకులు, డీఎంఈ, డీహెచ్‌ కార్యాలయాల్లో పలు కార్యకలాపాల నిమిత్తం వచ్చే బయటి వ్యక్తులు టీ స్టాల్‌ వద్ద సిగరెట్లు తాగుతూ వైద్యులను, అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొంత మంది యువకులు ఏకంగా పొగను అధికారుల మొఖంపైకి వదులుతుండడంతో తరచూ వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. సిగరెట్‌ తాగాలనుకునే వారికి డీఎంఈ కార్యాలయ ప్రాంగణం అడ్డాగా మారిపోయిందని పలువురు వైద్యులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది వైద్య శాఖ కార్యాలయాల వద్ద సిగరెట్‌ తాగే వారిపై చర్యలు తీసుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి టీ స్టాల్‌లో సిగరెట్లు అమ్ముతున్న వారితో పాటు ధూమపానం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-09-14T09:33:37+05:30 IST