నా టిక్‌టాక్ వీడియోల్ని ఎడిట్ చేస్తున్నారు.. నటుడు పృథ్విరాజ్‌ ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-04-28T16:41:17+05:30 IST

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మిన మహిళ రూ. 9.55 లక్షలు పోగొట్టుకుంది. యూఎస్‌కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాడు తిరుమలగిరి

నా టిక్‌టాక్ వీడియోల్ని ఎడిట్ చేస్తున్నారు.. నటుడు పృథ్విరాజ్‌ ఫిర్యాదు

కించపరిచే విధంగా మార్చేస్తున్నారంటూ పృథ్విరాజ్ ఫిర్యాదు

మరో కేసులో.. ఫేస్‌బుక్‌ పరిచయంతో టోకరా

మహిళ నుంచి రూ. 9.55 లక్షలు స్వాహా


హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): తాను చేసిన టిక్‌టాక్‌ వీడియోలను ఎడిట్‌ చేసి కించపరిచే విధంగా మార్చి కొందరు సోషల్‌ మీడియాలో పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సినీ నటుడు పృథ్విరాజ్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా టిక్‌టాక్‌లో కొన్ని వీడియోలు చేశానని ఆయన తెలిపారు. కొంతమంది వాటిని ఎడిట్‌ చేసి వేరే వారిని కించపరిచే విధంగా మార్చి టిక్‌టాక్‌ వీడియోలు పెడుతున్నారని. వారి చేష్టల కారణంగా తనకు నష్టం జరుగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఇదిలా ఉండగా.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మిన మహిళ రూ. 9.55 లక్షలు పోగొట్టుకుంది. యూఎస్‌కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్న సైబర్‌ నేరగాడు తిరుమలగిరి ప్రాంతానికి చెందిన మహిళకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. జిమ్‌ జై పేరుతో పంపిన రిక్వె్‌స్టను ఆమె యాక్సెప్ట్‌ చేసింది. కొంతకాలంగా ఇద్దరూ చాటింగ్‌ చేసుకున్నారు. జనవరిలో ఇండియాకు వస్తున్నానని చెప్పిన రెండు రోజుల తర్వాత మళ్లీ ఫోన్‌ చేశాడు. తాను భారీగా డాలర్లు తెచ్చానని, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారని తెలిపాడు. అధికారులు తనను వదిలేయాలంటే రూ. 5లక్షలు చెల్లించాలని చెప్పాడు. 


అతడి మాటలు నమ్మిన మహిళ అతడు చెప్పిన అకౌంట్‌కు డబ్బులు ఆన్‌లైన్‌లో పంపింది. కస్టమ్స్‌ నుంచి డబ్బులు రాగానే భారీగా డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఆమె అతడు చెప్పిన మాటలు నమ్మింది. కస్టమ్స్‌ ట్యాక్స్‌ వంటి సాకులు చెప్పి ఆమె నుంచి పలు దఫాలుగా రూ. 9.55 లక్షలు వసూలు చేశాడు. అనంతరం అతడి ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-04-28T16:41:17+05:30 IST